
యోగా అంటే.. జీవనయోగమని అర్ధం.
యోగా.. అనేది భారతీయ వైద్య విధానాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ప్రకృతి వైద్యం, ఆయుర్వేద వైద్యంతో పాటు యోగా కూడా ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయగలదు. మారుతున్న కాలంతో పాటు మానవ జీవనశైలి ఎన్నో మార్పులకు లోనవుతుంది కదా.. ఆ మార్పు ఎంతలా అంటే మనిషి తన శరీరం, మనసు మీద నియంత్రణ కోల్పోయే దశకు చేరుకునేంతలా.. దీనివల్ల మనిషికి కలిగే దుష్ప్రభావాలు అనేకం.. అధిక రక్తపోటు, ఊబకాయం, హృద్రోగం, ఒత్తిడి, మతిమరుపు లాంటి రకరకాల శారీరక, మానసిక సమస్యల సుడిగుండంలో చిక్కుకుంటున్నాడు.
వాటినుంచి బయటపడేందుకు కొన్ని మార్గాలున్నాయి. యోగాకి సాధారణంగా ఎనిమిది సోపానాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం:
◆ ‘యమ’.. సమాజంలో ఎలా నడుచుకోవాలో నేర్పుతుంది.
◆ ‘నియమం’.. వ్యక్తిత్వ వికాస పాఠం.. పరిశుభ్రత, అంతరదృష్టి, కర్తవ్య నిష్ఠ మొదలైన సూత్రాలు ఇందులో ఇమిడి ఉంటాయి.
◆ ‘ఆసనం’.. యోగాసనాల ప్రాధాన్యాన్ని ఇది వివరిస్తుంది.
◆ ‘ప్రాణాయామం’.. ప్రాణశక్తిని పెంచుకోగల విద్య ఇది.
◆ ‘ప్రత్యాహారం’.. మనసును ప్రాపంచిక విషయాలకు దూరంగా తీసుకెళ్లే మార్గం ఇది.
◆ ‘ధారణ’.. మనసుకు ఏకాగ్రతనిస్తుంది.
◆ ‘ధ్యానం’ మనసు మీద నియంత్రణను అందిస్తుంది.
◆ సమాధి.. ఇదే అత్యున్నతమైన యోగ సోపానం!
ఇదే అద్వైత సిద్ధికి అసలైన పరమార్థం. మానవుడు అనుభవించే సుఖదుఃఖాలు, జయాపజయాలు.. సమానంగా స్వీకరించగలిగే మహోన్నత స్థాయి.
ఇక్కడికి చేరుకోగానే మనిషి పరిపూర్ణుడవుతాడు. జీవితం తేజోవంతంగా ప్రకాశిస్తుంది. అనారోగ్యం దరిచేరదు.
ఈ సంప్రదాయ యోగాను ఎనిమిదేళ్ల పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరైనా సాధన చేయవచ్చు. అయితే, గురువు సమక్షంలో నేర్చుకోవడమే ఉత్తమం! ఆ తరువాత స్వయంగా సాధన చేసుకోవచ్చు. అంతేకానీ సోషల్ మీడియాను ఫాలో కావొద్దు. యూట్యూబ్, వాట్సాప్ లలో వచ్చే సందేశాలను, వీడియోలను అనుసరిస్తూ ఆసనాలు వేయడం ప్రమాదకరం. కొన్నిసార్లు అవి ప్రాణాంతకమూ కావొచ్చు.