తలనొప్పి ఎందుకు వస్తుందంటే..?!

మన తలలోని రక్తనాళాల మీద ఒత్తిడి వల్ల తలనొప్పి అనేది వస్తుంది. ఇలా మొదలైన తలనొప్పి.. మైగ్రేన్‌ నొప్పిగా మారవచ్చు. మైగ్రేన్ నరాలకు సంబంధించిన వ్యాధి. తలలో ఒకవైపు మాత్రమే వేధిస్తుంది అందువల్ల దీన్ని పార్శ్వపు నొప్పి అని కూడా అంటారు. తరచూ వచ్చే ఈ నొప్పి తీవ్రత ఒక్కోసారి తీవ్రంగా కూడా ఉంటుంది. ఇది పురుషుల్లో కంటే స్త్రీలలో మూడు రెట్లు ఎక్కువగా వస్తుంది.

లక్షణాలు:
తలనొప్పి ఓ వైపు మాత్రమే ఉండడం.
చీకాకు, మానసిక స్థితి సరిగా ఉండకపోవడం.
ఎండ, బయట శబ్దాల వల్ల సమస్య తీవ్రమవ్వడం.
వాంతి వస్తున్న భావనకు గురికావడం.
ఈ నొప్పితో రోజువారీ పనులు చేసుకోలేకపోవడం. కంటిచూపు సరిగా ఉండకపోవడం.

కారణాలు:
నిద్రలేమి, డిప్రెషన్‌, ఎక్కువసేపు ఎండలో ఉండలేకపోవడం,
మహిళల్లో హార్మోన్లు హెచ్చుతగ్గులకు లోనయ్యే సమయాలైన బహిష్టుకు ముందు లేదా తర్వాత ఈ సమస్య తలెత్తే అవకాశాలు ఎక్కువ.
ఎక్కువగా ప్రయాణాలు చేసేవారిలోనూ ఈ సమస్య కనిపిస్తుంది.
మైగ్రేన్‌ వంశపారంపర్యంగా కూడా సంక్రమిస్తుంది. ఈ సమస్య ఉంటే న్యూరోఫిజీషియన్‌ను సంప్రదించి, వైద్యం తీసుకోవాలి.

చిట్కాలు..
ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.
ప్రశాంతంగా నిద్రపోవడానికి ప్రయత్నించాలి.
చల్లని వస్తువులు, ఐస్‌ ప్యాక్‌ నుదుటి మీద పెట్టుకోవాలి.
పుదీనాలోని మెంథాల్‌కు మైగ్రేన్‌ను తగ్గించే గుణం ఉంటుంది. కాబట్టి ఆహారంలో పుదీనా చేర్చుకుంటూ ఉండాలి.
అల్లంలోని జింజెరాల్‌ అనే రసాయనం కూడా మైగ్రేన్‌ను తగ్గిస్తుంది. కాబట్టి అల్లం కూడా ఆహారంలో చేర్చుకోవాలి.
మెగ్నీషియం ఎక్కువగా ఉండే పాలకూర, చిలకడదుంపలు తీసుకోవడం వల్ల కొంచం ఉపశమనం పొందవచ్చు.