
రాణాప్రతాప్ పేరు వినగానే మనకు ఉదయ్‌పూర్ నగరం గుర్తుకు వస్తుంది. ఆయన పాలించిన మేవార్ రాజ్యం అనగానే.. అక్బర్‌కు కంటిమీద కునుకు లేకుండా చేసిన ఆ మహానాయకుని పరాక్రమం గుర్తుకు వస్తుంది. రాజపుత్రుల వీరత్వం, శౌర్యం, పరాక్రమం అన్ని కలగలిపి మొఘల్ సామ్రాజ్య విస్తరణకు వ్యతిరేకంగా ఎదురుతిరిగినవాడే..
ఈ మహారాణా ప్రతాప్… 1540, మే 9న కుంభాల్‌గడ్ కోటలో జన్మించాడు..
తండ్రి ఉదయ్ సింగ్.. రాణాప్రతాప్ తన 32 ఏళ్ల వయసులో 1572లో మేవార్ రాజ్య సింహాసనాన్ని అధిష్టించాడు. రాణాప్రతాప్ తల్లి జైవంత్ బాయ్.. కానీ ఉదయ్‌సింగ్‌కు ఇష్టమైన భార్య ధీరూబాయ్ భట్టియాని(ఈవిడ పెద్ద భార్య). రాణాప్రతాప్‌కు బదులు తన కొడుకు జగ్‌మల్‌ను రాజును చేయాలని ఈమె పట్టుబట్టింది.కానీ ఆ రాజ్యంలోని మంత్రివర్గంతోపాటు ఇతర రాజదర్బార్ ప్రముఖులందరూ రాణాప్రతాప్‌కు మాత్రమే రాజయ్యే అర్హత ఉందని, అతనే రాజు కావాలని తీర్మానించారు.
సిసోడియా రాజ్‌పుత్‌ల శ్రేణిలో మేవార్ 54వ పాలకుడిగా మహారాణా ప్రతాప్ సింహాసనాన్ని అధిష్టించాడు. గోగుండాలో అతనికి పట్టాభిషేకం జరిగింది. దీంతో జగ్మల్ ప్రతాప్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు అక్బర్ సైన్యంలో చేరడానికి అజ్మీర్‌కు బయలుదేరాడు. బదులుగా జహజ్‌పూర్ పట్టణానికి జాగీర్ అయ్యాడు. ఇక వీరి మధ్యన యుద్ధం జరిగే రోజు రానే వచ్చింది.
1572లో ప్రతాప్ సింగ్ రాజుగా (మహారాణా) పట్టాభిషిక్తుడైనప్పుడు, అక్బర్ అనేకమంది రాయబారులను పంపాడు. అమెర్రాజా మాన్ సింగ్ ను ఒకరితో సహా, రాజ్‌పుతానాలోని అనేక ఇతర పాలకులలాగా అతడిని సామంతుడిగా ఉండమని వేడుకున్నాడు. దీంతో అక్బర్‌కు వ్యక్తిగతంగా లొంగిపోవడానికి ప్రతాప్ నిరాకరించాడు. ఆ తర్వాత ఈ సమస్యను దౌత్యపరంగా పరిష్కరించేందుకు చేసిన అనేక ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. ఇక యుద్ధం అనివార్యమైంది.
ప్రతాప్ సింగ్, మొఘల్, రాజ్‌పుత్ జనరల్ మాన్ సింగ్ సేనలు 1576లో రాజస్థాన్‌లోని గోగుండా, ఆధునిక రాజ్‌సమంద్ సమీపంలోని హల్దీఘాట్ వద్ద ఇరుకైన పర్వత మార్గంలో కలుసుకున్నారు. హల్దీఘాట్ వద్ద అక్బర్ సైన్యానికి, రాణాప్రతాప్ సైన్యానికి జరిగిన యుద్దాన్ని హాల్దిఘాట్ యుద్ధంగా పిలుస్తారు.
ఈ హల్దీఘాట్ యుద్ధక్షేత్రం ఉదయ్‌పూర్ నగరానికి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది. అది 1576, జూన్ 18.. అక్బర్ సైన్యానికి- రాణాప్రతాప్‌కి మధ్య యుద్ధం మొదలైన రోజు… మూడు వేల అశ్విక దళం, నాలుగు వందల మంది భిల్లులు మాత్రమే ఉండగా.. అక్బర్ ప్రతినిధిగా వచ్చిన మాన్‌సింగ్ దగ్గర ఐదు వేల అశ్వికదళం, ఇతర దళాలన్నీ కలిపి పదివేల సైన్యం ఉంది.
మొఘలులు సైన్యంతో మేవార్ రాజ్యం మీద దండెత్తుతున్న విషయాన్ని అడవుల్లో నివసించే ఆదివాసీ భిల్లులు గమనించి అప్పుడు రాణాప్రతాప్‌కి చేరవేశారు. దాంతో మొఘల్ సైన్యం నగరంలోకి ప్రవేశించడానికి ముందే.. హల్దీఘాట్ దగ్గరే ఎదుర్కొంది మేవార్ సైన్యం. ఆ యుద్ధంలో మేవార్ సైన్యం వీరోచితంగా పోరాడింది. మాన్‌సింగ్ ఏనుగు మీద ఉన్నాడు. రాణాప్రతాప్ తన గుర్రానికి ఏనుగు తొండం తొడిగి..
అచ్చం ఏనుగు అనే భ్రమ కల్పించాడు. ఎదురుగా ఉన్నది గుర్రం అని తెలిస్తే ప్రత్యర్థి గుర్రం వేగాన్ని అంచనా వేయగలుగుతాడు. ఏనుగు అని భ్రమపడితే ఏనుగు మందగమనాన్నే ఊహిస్తాడనీ.. ఆ రణనీతిని ప్రదర్శించాడు రాణాప్రతాప్. ఆ యుద్ధంలో మొఘలులు కనీసం మేవార్ రాజధాని నగరం ఉదయ్‌పూర్‌లో అడుగు కూడా పెట్టలేకపోయారు. రాణాప్రతాప్‌ను బంధీని చేయాలనుకున్నారు.
కానీ మేవార్ రాజ్యంలో మొఘలుల పాలనకు బీజం పడలేదు. మొఘలుల సైన్యం హల్దీఘాట్ నుంచే వెనుదిరిగి వెళ్లిపోయింది. రాజపుత్రుల విజయాన్ని, మొఘలుల పరాజయాన్ని జీర్ణించుకోలేని కొందరు చరిత్రకారులు ఈ యుద్ధాన్ని అసంపూర్తిగా ఆగిపోయిన యుద్ధంగా వర్ణించారు.
అయినప్పటికీ రాజ్యపాలన రాణాప్రతాప్ చేతిలోనే ఉన్నప్పుడు అది రాణాప్రతాప్ గెలుపు కాకుండా మరేమవుతుందనేది ఆ తర్వాత చరిత్రను అధ్యయనం చేసిన కొత్త తరం చరిత్రకారులు తేల్చి చెప్పారు. ఆ యుద్ధం తర్వాత కూడా అక్బర్ మళ్లీ మేవార్ మీద ఎప్పుడు దాడి చేయాలా అని వ్యూహాలు పన్నాడు.. కానీ అవి అసంపూర్తిగా నిలిచాయి.
రాణాప్రతాప్ మాత్రం హల్దీఘాట్ యుద్ధం తర్వాత ఇరవైఏళ్ల పాటు సుదీర్ఘ రాజ్యపాలన చేశాడు. తాను పుట్టిన కుంభాల్‌గడ్ కోటను తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. 1585లో చవంద్ అనే ప్రదేశంలో కొత్త రాజధానిని కట్టాడు. అక్కడి నుంచే రాజ్యపాలన చేశాడు. తనకు అండగా నిలిచిన భిల్లుల కోసం ఇక్కడ అనేక నిర్మాణాలు చేశాడు. వారితో కలిసి వేటకు వెళ్లడం రాణాకు ఇష్టమైన వ్యాపకం. అలా వేటకు వెళ్లినప్పుడు జరిగిన ప్రమాదంలోనే ఆయన అనుకోకుండా (1597, జనవరి 29) తుదిశ్వాస వదిలాడు.
మొత్తానికి హల్దీఘాట్ యుద్ధం రాణాప్రతాప్‌ను వీరుడిగా నిలబెట్టింది. అయితే ఆ యుద్ధం చేసిన గాయం అతడిని చివరివరకు ఇబ్బంది పెట్టిందని, చేతక్ మరణం అతడిని మానసికంగా బాగా కుంగదీసిందని చెబుతుంటారు.