అమ్మాయిలే అబ్బాయిలు అయితే …

దుస్తుల విషయంలో అమ్మాయిలు మరింత సౌకర్యాన్ని కోరుకుంటున్నారు. తమకు నచ్చేవి-నప్పేవి కొనుగోలు చేసేందుకు.. అక్కడా, ఇక్కడా అనే తేడా లేకుండా వెతికేస్తున్నారు. ముఖ్యంగా దుస్తుల దుకాణాల్లో పురుషుల విభాగాన్ని అస్సలు వదలడం లేదు. అంతేకాదు, ఒత్తిడి లేని షాపింగ్‌ అనుభవాన్ని పొందాలని భావించినప్పుడల్లా.. పురుషుల విభాగంలోనే షాపింగ్‌ చేస్తామని చాలామంది అమ్మాయిలు చెబుతున్నారు. ఆఫీస్‌ కోసం ఫార్మల్‌ డ్రెస్‌ కావాలన్నా.. అబ్బాయిల బ్రాండ్స్‌నే కోరుకుంటున్నామని అంటున్నారు. కొన్ని లేడీస్‌ స్పెషల్‌ బ్రాండ్ల ఫిటింగ్స్‌లో తేడాలు కనిపిస్తుంటాయనీ, దాంతో ప్రతిరోజూ ఫిటెడ్‌ షర్ట్స్‌ ధరించాలంటే ఇబ్బందిగా ఉంటుందని ఫీలవుతున్నారు. అందుకు బదులుగా.. వదులుగా ఉండే అబ్బాయిల కాలర్‌ షర్టులను సౌకర్యంగా వాడుకుంటున్నామని కాలరెగరేసి మరీ చెబుతున్నారు. కాలేజీ అమ్మాయిలు కూడా.. బటన్లు ఉండే హూడీలు, కూల్‌ టీ షర్టులను కోరుకుంటున్నారు. ఇక వ్యాయామం కోసం ఉపయోగించే షార్ట్స్‌, ట్రాక్‌ ప్యాంట్స్‌ను కూడా మగవాళ్ల బ్రాండ్స్‌లోనే చూసుకుంటున్నారు. మహిళలతో పోలిస్తే.. పురుషుల అథ్లెటిక్స్‌ కలెక్షన్‌ మెరుగ్గా ఉండటమే ఇందుకు కారణం. పురుషుల షార్ట్స్‌, ట్రాక్‌ ప్యాంట్స్‌ ప్యాకెట్స్‌తో వస్తాయి. మహిళల దుస్తులలో చాలా బ్రాండ్‌లు ఇప్పటికీ ప్యాకెట్స్‌ను అందించడం లేదని అతివలు వాపోతున్నారు. వీటితోపాటు బటన్‌ డౌన్‌ షర్టులు, లాంగ్‌ టీ షర్టులు, హూడీలు, స్వెట్‌షర్టుల్లోనూ అబ్బాయిల కలెక్షన్‌ నుంచి తీసుకుంటున్న అమ్మాయిలు పెరుగుతుండటం విశేషం.