భారత్ న్యూస్. సికింద్రాబాద్ :
జంట నగరాల ప్రయాణీకుల అసోసియేషన్ల తో సమావేశాన్ని నిర్వహించిన దక్షిణ మధ్య రైల్వే
సికింద్రాబాద్ డివిజన్, డివిజనల్ రైల్వే మేనేజర్, శ్రీ భరతేష్ కుమార్ జైన్ మరియు హైదరాబాద్ డివిజన్, డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ లోకేష్ విష్ణోయ్ జంట నగరాలకు చెందిన వివిధ ప్రయాణీకుల అసోసియేషన్ల సభ్యులతో ఎమ్.ఎమ్.టి.ఎస్. (మల్టీ-మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్) మరియు సబ్-అర్బన్ రైలు సేవలను మెరుగుపరచడంపై 16 అక్టోబర్, 2024న వారి సంబంధిత డివిజనల్ హెడ్‌క్వార్టర్స్‌లో సమావేశాలు నిర్వహించారు. సికింద్రాబాద్ డివిజన్ ప్రధాన కార్యాలయమైన సంచాలన్‌ భవన్ లో మరియు హైదరాబాద్ డివిజన్ ప్రధాన కార్యాలయమైన హైదరాబాద్ భవన్లో విడివిడగా జరిగిన సమావేశాల్లో డివిజనల్ రైల్వే వినియోగదారుల సంప్రదింపుల కమిటీ, జంటనగరాల సబర్బన్ ట్రావెలర్స్ అసోసియేషన్, అమ్ముగూడ లోని సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్, శ్రీ రాఘవేంద్ర నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్, వివేకానందపురం వెల్ఫేర్ అసోసియేషన్ మరియు దక్షిణ మధ్య రైల్వే రైల్ ఫ్యాన్స్ అసోసియేషన్ మొదలైన అసోసియేషన్ల నుండి ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వీరితోపాటు రెండు డివిజన్ల నుంచి ఇతర ఉన్నత రైల్వేఅధికారులు కూడా పాల్గొన్నారు.
ఎమ్.ఎమ్.టి.ఎస్. సేవలను మరింత మెరుగుపరిచే దిశలో భాగంగా తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రయాణికుల అసోసియేషన్లతో డివిజనల్ రైల్వే మేనేజర్లు సవివరంగా చర్చించారు. ఈ సమావేశంలో హాజరైన ప్రతినిధులు సమయపాలనను పెంపొందించడం, ఎమ్.ఎమ్.టి.ఎస్. రైళ్లలో అధిక ప్రయాణీకులు ప్రయాణించే విధంగా ప్రోత్సాహాయించడం, హైలైట్స్ యాప్‌ను పునర్నిర్మించడం, సేవల పొడిగింపు మొదలైన అంశాల గురించి సూచనలు అందించారు. తదుపరి సభ్యులు అదనపు స్టాపేజ్‌లు మరియు వివిధ మార్గాల్లో ఎమ్.ఎమ్.టి.ఎస్. రైళ్ల పునరుద్ధరణకు సంబందించిన అంశాలపై డివిజనల్ రైల్వే మేనేజర్లకు విన్నవించారు. సభ్యులు అందించిన సూచనలు మరియు సలహాలన్నింటినీ సానుకూలంగా తీసుకుని, వారి సూచనలను పరిశీలించి జంటనగరాల ప్రాంతంలోని ప్రజలకు అత్యుత్తమ రైలు సేవలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని డీఆర్‌ఎంలు హామీ ఇచ్చారు.

దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్ ఎమ్.ఎమ్.టి.ఎస్. సేవల సమయపాలనను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. జనరల్ మేనేజర్ ఎమ్.ఎమ్.టి.ఎస్ రైళ్ల నిర్వహణలో ఆలస్యం జరగకుండా చూడాలని మరియు సమయపాలన పాటించడంపై దృష్టి సారించాలని డివిజన్లకు సూచించారు. ప్రజల అవసరాలు మరియు ప్రయాణికుల అసోసియేషన్లతో జరిపిన చర్చలను పరిగణనలోకి తీసుకుని ఎమ్.ఎమ్.టి.ఎస్ సేవలను మరింత మెరుగుపరిచేందుకు వీలైనంత త్వరగా తగిన చర్యలు తీసుకోవాలని డివిజనల్ అధికారులకు సూచించారు. రైలు వినియోగదారులకు మెరుగైన ప్రయాణ సేవలను అందించడమే మన యొక్క ఏకైక అంతిమ లక్ష్యమని ఆయన తెలియజేశారు.