ఐజీఓటీ ల్యాబ్ ఏర్పాటు చేయనున్న సమాచార శాఖ.

భారత్ న్యూస్. హైదరాబాద్ : ఉద్యోగుల ఆన్‌లైన్ అభ్యాసాన్ని సులభతరం చేయడం కోసం

ఐజీఓటీ ల్యాబ్ ఏర్పాటు చేయనున్న సమాచార శాఖ.

మంత్రిత్వ శాఖలోని ఉద్యోగులందరికీ ఆన్‌లైన్ అభ్యాసాన్ని సులభతరం చేయడం కోసం ఐజీఓటీ ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర సమాచార, ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ మంత్రిత్వ శాఖను ఆదేశించారు. మంత్రిత్వ శాఖ వార్షిక కెపాసిటీ బిల్డింగ్ క్యాలెండర్, ఐజీఓటీ పోర్టల్‌లో ఉద్యోగుల ఆన్‌బోర్డింగ్ స్థితి గురించి సమగ్ర సమీక్ష నిర్వహించిన తర్వాత ఇది మొదలుకానున్నది.

సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు, ఇతర సీనియర్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో డాక్టర్ మురుగన్ మాట్లాడుతూ ఈనెల 19లోగా మంత్రిత్వ శాఖ ఉద్యోగులందరూ ఐజీఓటీ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని ఆదేశించారు. సిబ్బంది వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరచడం కోసం బడ్జెట్ మేనేజ్‌మెంట్, జెండర్ సెన్సిటైజేషన్, లీడర్‌షిప్, టీమ్ బిల్డింగ్‌తో సహా 16 కోర్సుల ఎంపికను మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది.

భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి, ప్రతి త్రైమాసికంలో అత్యధిక సంఖ్యలో కోర్సులు పూర్తి చేసిన ఉద్యోగులను సత్కరించాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. అన్ని మీడియా విభాగాలలో మంత్రిత్వ శాఖ అభ్యసన ప్రణాళికను, శాఖాపరమైన వ్యూహాల గురించి తెలియజేయడం కోసం కార్యగోష్ఠి నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు.

మంత్రిత్వ శాఖ ద్వారా ఫిర్యాదులు, ఆర్‌టీఐ దరఖాస్తుల నిర్వహణ గురించి కూడా మంత్రి సమీక్షించారు. పారదర్శకత, జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికి అన్ని కేసులను సకాలంలో పరిష్కరించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు.