భారత్ న్యూస్. హైదరాబాద్ :

రైతు ఆదాయంలో వచ్చేఒడిదుడుకులను తట్టుకునేందుకు శాస్త్రీయ పంటల బీమా సహాయపడుతుంది.

        ` చైతన్యసేద్యం సెమినార్‌లో ప్రొఫెసర్‌ ఆర్‌.రామ్‌ కుమార్‌   

వాతావరణంలో అనిశ్చితస్థితి, పంట ఉత్పత్తి ఒడిదుడుకులలో రైతుల్సి ఆదుకునేది శాస్త్రీయ పంటల బీమా అని, రైతు ఆదాయంలో వచ్చే ఒడిదుడుకులను తట్టుకునేందు సహాయపడుతుందని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ ప్రొఫెసర్‌ ఆర్‌ రామ్‌ కుమార్‌ అన్నారు. 
సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో చైతన్యసేద్యం రైతుల మాస పత్రిక దశవార్షికోత్సవాల సందర్భంగా ప్రతికూల వాతావరణ మార్పులు- ` రైతు, పంటల బీమా అవసరాలు అనే అంశంపై సెమినార్‌ జరిగింది.   ప్రొఫెసర్‌ అరిబండి ప్రసాద్‌రావు రాసిన ప్రతికూల వాతావరణ మార్పులు రైతుల దుస్థితి నివారణ పుస్తకాన్ని డాక్టర్‌ పి.వి అమర్‌నాథ్‌ ప్రసాద్‌ ఆవిష్కరించారు. అనంతరం ముఖ్య అతిథి ప్రొఫెసర్‌ ఆర్‌ రామ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. దేశంలో పంటల బీమా పథకం రైతుల ఆదరణ పొందలేదని అన్నారు. దీనికి ప్రదాన కారణాలు బీమా పథకాలు రూపొందించి అమలు చేసిన విధానంలో లోపాలు ఉన్నాయని అన్నారు. అధికంగా ప్రీమియం, రైతుల్లో తక్కువ అవగాహన, పరిమితమైన అమలు విస్తీర్ణం, నష్టపరిహారం అంచనాలో సంక్లిష్టత, నష్ట పరిహారం చెల్లింపులో ఆలస్యమని అన్నారు. పంటల బీమా పథకం అమలులో ప్రైవేట్‌ బీమా కంపెనీలను అనుమతించడం అని అన్నారు. వీటన్నింటి ఫలితంగా దేశంలో 19.53 కోట్ల హెక్టార్‌ల భూమి సాగులో ఉండగా కేవలం 4.28 కోట్ల హెక్టార్ల భూమి బీమా పరిధిలోకి వచ్చిందని అన్నారు. మొత్తం పంటల విస్తీర్ణంలో కేవలం 22శాతం సాగు భూమి పంటల బీమా పథకంలోకి 2014లో వచ్చిందని అన్నారు. వరి, గోదుమల సాగు రైతుల్లో 10 శాతం కన్న తక్కువ మంది రైతులు 2018-19లో బీమా తీసుకున్నారు. సోయచిక్కుడు, పత్తి రైతుల్లో కేవలం 4వ వంతు రైతులు మాత్రమే బీమా తీసుకున్నారని అన్నారు. పంటల బీమా గురించి రైతులకు అసలు తెలవకపోవడం ప్రధాన కారణమని అన్నారు. దేశంలో పంటల బీమా పథకం విధాన రూపకల్పనలో లోపం ఉందని, నూతన ఆర్థిక, సరళీకరణ విధానాల వలన పంట ధరలు భారీగా తగ్గుతున్నాయని, దాంతో రైతుల ఆదాయం పడిపోతుందని అన్నారు.  రైతుల దుస్థితికి, ఆత్మహత్యలకు ఇవే ప్రధాన కారణాలని అన్నారు. అందుకే సమగ్రమైన పంట, ఆదాయ బీమా పథకాన్ని రూపొందించాలని అన్నారు. ప్రధాన మంత్రి బీమా పథకం రైతులందరికీ అమలయ్యేల అమలు చేయాలని కోరారు. 

ఉమ్మడి రాష్ట్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రిశ్వరరావు మాట్లాడుతూ… గ్రామ స్థాయిలో నష్టపరిహారం అంచనా కోసం వ్యవస్థను రూపొందించడంలో ప్రభుత్వాలు విఫలమౌతున్నాయి. పంట నష్ట పరిహారం చెల్లింపు స్వామినాథన్‌ కమీషన్‌ సూచించినట్లుగా అమలు చేయాలి. ప్రధానమంత్రి పంటల బీమా పథకం కార్పొరేట్‌ కంపెనీలకే ఉపయోగపడుతుంది. ఆచరణలో రైతులకు చెల్లించే పరిహారం తగ్గుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
అక్టోబర్ 26 నుండి నవంబర్ 10 వరకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారం – టి సాగర్

తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్ మాట్లాడుతూ… రాష్ట్రంలో గత మూడు సంవత్సరాలుగా పంటల బీమా పథకం లేదని దీనివల్ల అకాల వర్షాలు, వడగళ్ల వాన, తుఫాన్లు, కరువుల వల్ల పంటలు నష్టపోయిన సందర్భంలో ఎలాంటి పరిహారం అందడం లేదని అన్నారు. అడవి జంతువుల నుండి పంట నష్టం జరిగిన సందర్భంలో గాని, తామర వైరస్, గులాబీ తెగులు లాంటి రోగాల బారిన పడిన సందర్భంలో గానీ ఎలాంటి పరిహారం లభించడం లేదని అన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కేవలం ఇన్సూరెన్స్ కంపెనీలకే ఉపయోగపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న విధంగా దేశవ్యాప్తంగా రైతు బీమా పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీనికోసం దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై ఈనెల 26 నుండి నవంబర్ 10 వరకు జిల్లా, మండల కేంద్రాల్లో విస్తృత ప్రచారాన్ని నిర్వహించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్‌ పద్మాకర్‌రావు, సీనియర్ నాయకుడు సారం పల్లి మల్లారెడ్డి,తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌ రావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు నంద్యాల నర్సింహ్మారెడ్డి, పి. జంగారెడ్డి, మాదినేని రమేష్‌, బుర్రి శ్రీరాములు, వీరేపల్లి వేంకటేశ్వర్లు, వర్ణ వెంకటరెడ్డి, బుస్సు మధుసుదన్‌రెడ్డి, సహాయ కార్యదర్శులు లెల్లెల బాలకృష్ణ, కందాల ప్రమీల, కున్‌రెడ్డినాగిరెడ్డి, మాటూరి బాలరాజ్‌ గౌడ్‌, శెట్టిపల్లి సత్తిరెడ్డి, యం శ్రీనివాసులు, రైతాంగ సమితి రాష్ట్ర అధ్యక్షుడు జక్కుల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. వక్తలను తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్‌ శోభన్‌వేదిక పైకి ఆహ్వానం పలికారు.