భారత్ న్యూస్:సికింద్రాబాద్:
ట్రాక్ పెట్రోలింగ్‌ను ముమ్మరం చేస్తూ భద్రతా పెంపుకై
భద్రతాపరమైన విధానాలను ఖచ్చితంగా అనుసరించాలి
:దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్

దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్ శ్రీ అరుణ్‌కుమార్‌ జైన్ రైల్వేలో ఇటీవల చోటుచేసుకున్న అవాంఛనీయ సంఘటనల దృష్ట్యా ఆర్‌.పి.ఎఫ్‌ మరియు జి.ఆర్.పి. బృందాల సహాయంతో ట్రాక్‌ పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయాలని మరియు భద్రతపై అప్రమత్తమైన విధానాన్ని అనుసరించాలని అధికారులకు సూచించారు. ఈరోజు అనగా అక్టోబర్ 14, 2024న సికింద్రాబాద్‌లోని రైలు నిలయంలో జోన్ వ్యాప్తంగా రైలు కార్యకలాపాల నిర్వహణలో భద్రతపై వివరణాత్మక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ శ్రీ నీరజ్ అగర్వాల్ గారితో పాటు వివిధ శాఖలకు చెందిన ప్రధానాధిపతులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ , హైదరాబాద్, విజయవాడ, గుంతకల్లు , గుంటూరు మరియు నాందేడ్ మొత్తం ఆరు డివిజన్‌లకు చెందిన డివిజనల్ రైల్వే మేనేజర్‌లు (డీఆర్‌ఎంలు) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.
జనరల్ మేనేజర్ సేఫ్టీ డ్రైవ్‌లు మరియు తరచుగా క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించాలని మరియు లోకో పైలట్లు, అసిస్టెంట్ లోకో పైలట్లు, గార్డులు మరియు ముఖ్యంగా ట్రాక్‌మెన్‌లతో సహా భద్రతా సంబంధిత సిబ్బందికి సలహాలు ఇవ్వాలని, ట్రాక్‌ల వెంట పెట్రోలింగ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, మరియు రైళ్లను సురక్షితంగా నడిపేందుకు సురక్షితమైన పని పద్ధతులను అనుసరించాలని ఆయన క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు. జోన్ లో రైళ్లలో పొగను గుర్తించే పరికరాలు, అగ్నిమాపక పరికరాలు మొదలైన భద్రతా వస్తువుల లభ్యతను ఆయన సమీక్షించారు. ఎలాంటి అత్యవసరమైనా సరిపడా నిల్వలు ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు.

జనరల్ మేనేజర్ ప్యాసింజర్ కంప్లైంట్ రిడ్రెసల్ సిస్టమ్ “రైల్ మదద్ ”ని కూడా సమీక్షించారు . వీలైనంత త్వరగా ప్రయాణికుల ఫిర్యాదులను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. రన్నింగ్‌ స్టాఫ్‌ పనివేళలపై సమీక్షిస్తూ, సిబ్బందిపై అధిక పని వేళలను తగ్గిస్తు సురక్షితమైన పని పరిస్థితులు కల్పించేందుకు తగిన చర్యలు తీసుకొని వారి పనివేళలపై ముందస్తు ప్రణాళికలను రూపొందించాలని ఆదేశించారు. ఎల్‌సీ గేట్లను మూసివేసిన పరిస్థితుల్లో వాటిని అతిక్రమించకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తూ లెవల్ క్రాసింగ్ గేట్ల వద్ద అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జనరల్‌ మేనేజర్‌ జోన్‌లో లెవల్‌ క్రాసింగ్‌ గేట్ల తొలగింపుపై పరిస్థితిని సమీక్షించారు మరియు వాటి తొలగింపుకై అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత డివిజనల్‌ రైల్వే మేనేజర్‌లను ఆదేశించారు.
శ్రీ అరుణ్ కుమార్ జైన్ పనిప్రదేశాలల భద్రతా విధివిధానాలను తప్పక పాటించాలని జోన్ లోని అన్ని డివిజనలకు నొక్కిచెప్పారు. వివిధ పనిప్రదేశాలలో పనిచేసేటప్పుడు వ్యక్తిగత భద్రతకు సంబంధించి ఉద్యోగులు మరియు కాంట్రాక్ట్ కార్మికులకు కూడా క్రమం తప్పకుండా కౌన్సెలింగ్ ఇవ్వాలని ఆయన సూచించారు. ఉద్యోగులు/ కాంట్రాక్ట్ కార్మికులు పనులు చేస్తున్నపుడు భద్రతకు సంబందించిన చేతి తొడుగులు, హెల్మెట్లు, బెల్టులు మొదలగు భద్రతా పరికరాలను తప్పని సరిగా ధరించాలని సూచించారు .