…భారత్ న్యూస్ హైదరాబాద్…ప్రతీ విద్యార్ధిలో ఎదో ఒక రకమైన నైపుణ్యం దాగి ఉంటుందని దాన్ని గుర్తించి వెలికి తీసే బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపైనే ఉంటుందని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారు అన్నారు.

హన్మకొండ ప్రశాంత్ నగర్ లోని తేజస్వి పాఠశాలలో పాఠశాల విద్యా శాఖ హన్మకొండ జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన 2024 ముగింపు కార్యక్రమానికి ఎంపీ డాక్టర్ కడియం కావ్య గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్బంగా ఎంపీ గారు మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ కలలు కనాలి వాటిని నిజం చేసుకునేందుకు కార్యాచరణ రూపొందించుకోవాలని అన్నారు. మనం చేసే ఇన్నోవేషన్ లు సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని తెలిపారు. ఏ ఇన్నోవేషన్ అయిన భూమికి, పర్యావరణానికి హాని కలిగించకుండా ఉండాలని అన్నారు. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత అత్యల్పస్థాయికి పడిపోయిందని, భవిష్యత్ లో గాలిని కూడా కొనుక్కోవాల్సి వస్తుందేమో అన్న భయం కలుగుతుందని తెలిపారు. ప్లాస్టిక్ వినియోగన్ని తగ్గించి పర్యావరణానికి మేలు చేసే ఆవిష్కరణలు తీసుకురావాలని కోరారు. కేవలం నాలుగు గోడల మధ్య కూర్చొని చదవడమే కాదు, బయట సమాజం పట్ల కూడా అవగాహన పెంచుకోవాలని సూచించారు.

అనంతరం వైజ్ఞానిక ప్రదర్శనలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి, డీఈవో వాసంతి, ఇతర విద్యా శాఖ అధికారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు..