Headlines

చెరువుల ఆక్ర‌మ‌ణ‌ల‌పై స‌మ‌గ్ర క్షేత్ర‌స్థాయి స‌ర్వేఆక్ర‌మ‌ణ‌ల‌కు గురైన చెరువుల‌ను పూర్వ‌స్థితికి కృషి

భారత్ న్యూస్ . హైదరాబాద్: చెరువుల ఆక్ర‌మ‌ణ‌ల‌పై స‌మ‌గ్ర క్షేత్ర‌స్థాయి స‌ర్వే
ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురైన చెరువుల‌ను పూర్వ‌స్థితికి కృషి
సమీక్షా స‌మావేశంలో ఉప ముఖ్య‌మంత్రి భట్టి విక్ర‌మార్క

గ్రేటర్ హైద‌రాబాద్‌, అవుట‌ర్ రింగ్ రోడ్ ప‌రిధిలో గ‌ల చెరువులు, కుంట‌ల‌పై సంబంధిత అధికారుల‌తో క‌లిసి ఈ రోజు డాక్ట‌ర్ అంబేద్క‌ర్ స‌చివాల‌యంలో ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క సమీక్ష సమావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా అధికారులు తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేష‌న్ సెంట‌ర్ (టీజీఆర్ఏసీ) రిమోట్ సెన్సింగ్ సాంకేతిక ద్వారా 2014 ఉంచి 2023 వ‌ర‌కూ ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురైన చెరువులు, కుంట‌ల సంబంధించిన నివేద‌క‌ను ఈ సంద‌ర్భంగా విశ్లేషించ‌డం జ‌రిగింది.

గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో 2014కు పూర్వం 417 చెరువులు, కుంట‌లు ఉన్నాయి. అందులో 182 చెరువులు కుంట‌లు పూర్తిగా దురాక్ర‌మ‌ణ‌ల‌కు గురయ్యాయి. మ‌రో 76 చెరువులు, కుంట‌లు పాక్షికంగా ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురైన‌ట్లు టీజీఆర్ఏసీ త‌న నివేదికలో స్ప‌ష్టం చేసింది. గ్రేట‌ర్ నుంచి అవుట‌ర్ రింగ్ రోడ్ ప‌రిధిలో మొత్తంగా 503 చెరువులు కుంట‌లు ఉండ‌గా.. ఇందులో 62 చెరువులు పూర్తిగా అక్ర‌మ‌ణ‌ల‌కు గుర‌య్యాయి. మ‌రో 102 చెరువులు, కుంట‌లు పాక్షికంగా ఆక్ర‌మ‌ణ‌ల‌కు గుర‌య్యాయి.

వీటికి అదనంగా 2014 నుంచి 2023 వ‌ర‌కూ.. గ్రేట‌ర్ లోని 417 చెరువుల‌కు గాను 11 చెరువులు పూర్తిగా, మ‌రో 7 చెరువులు పాక్షికంగా ఆక్రమణకు గుర‌య్యాయి. ఇక గ్రేట‌ర్ నుంచి అవుట‌ర్ ప‌రిధిలో గల 503 చెరువులలో 27 చెరువులు పూర్తిగా ఆక్రమణకు గురికాగా మ‌రో 24 చెరువులు పాక్షికంగా ఆక్రమించబడినట్లు తేలింది.

ఈ రకంగా గ్రేట‌ర్, అవుట‌ర్ ప‌రిధిలో గల మొత్తం 920 చెరువులు, కుంటలకు గాను 282 పూర్తిగా ఆక్రమణకు గురి అయ్యాయి. మ‌రో 209 చెరువులు పాక్షిక ఆక్రమణకు గురి అయినట్లు ఆయా సంవత్సరాల ఉపగ్రహ చిత్రపటాలు మరియు సర్వే ఆఫ్ ఇండియా వారి టోపోషీట్ ల రిమోట్ సెన్సింగ్ సాంకేతిక పరిజ్ఞాన మరియు పరిశీలన ద్వారా స్పష్టమైంది.

చెరువులు కుంట‌లు అక్ర‌మ‌ణాల‌కు సంబంధించిన టోపోషీట్ ల‌ను, చిత్ర ప‌టాల‌ను ప‌రిశీలించిన ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క ఈ ఆక్ర‌మ‌ణ‌ల‌పై స‌మగ్ర క్షేత్ర స్థాయి సర్వే ద్వారా వాటిని పూర్వ స్థితికి పునరుద్ధరించడానికి చర్యలు చేపడతామని తెలియజేసారు.

ఈ సమీక్షా కార్యక్రమంలో టీజీఆర్ఏసీ సంస్థ అడిషనల్ డైరెక్టర్ జనరల్ శ్రీ పి. మనోహర్ గారు మరియు సైంటిఫిక్ ఆఫీసర్స్ అయిన Dr. S. బాల కృష్ణ, శ్రీ పి. ప్రకాష్, శ్రీ. అశ్విని కుమార్ దాస్ మరియు AO శ్రీ R N చారి గార్లు పాల్గొన్నారు.