భారత్ న్యూస్ సికిందరాబాద్:
దసరా & దీపావళి పండుగలను పురస్కరించుకొని ప్రయాణీకుల సౌకర్యార్ధం
సుమారు 1,400 ప్రత్యేక రైళ్లను నడుపనున్న దక్షిణ మధ్య రైల్వే
దక్షిణ మధ్య రైల్వే అందుబాటులో ఉన్న వనరులను సమీకరించడం ద్వారా రైలు ప్రయాణీకుల అవసరాలను తీర్చడానికి క్రమం తప్పకుండా సెలవు & పండుగ సీజన్లలో ముఖ్యమైన సందర్భాలలో ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. దసరా మరియు దీపావళి పండుగల సీజన్ దృష్ట్యా అక్టోబర్ & నవంబర్ మాసాలలో, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది మరియు ఉత్తర భారత రాష్ట్రాలైన బీహార్, ఉత్తరప్రదేశ్ మరియు పశ్చిమ బెంగాల్ వంటి తూర్పు రాష్ట్రాలకు కూడా ప్రయాణించడానికి అధిక డిమాండ్ ఉంది.
దక్షిణ మధ్య రైల్వే ఈ పండుగల దృష్ట్యా ప్రయాణీకుల సౌకర్యార్ధం అదనపు రద్దీని తగ్గించడానికి వివిధ గమ్యస్థానాల మధ్య 1400 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ప్రస్తుతం ఈ రైళ్లు అక్టోబరు 1 నుంచి నవంబర్ 30 వరకు వేర్వేరు తేదీల్లో నడపబడుతున్నాయి. ప్రజల పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి రాబోయే రోజుల్లో మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించాలని దక్షిణ మధ్య రైల్వే యోచిస్తోంది. దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం అదనపు బుకింగ్ కౌంటర్లను కూడా ఏర్పాటు చేస్తోంది.
ఈ రైలు సేవలు దక్షిణ మధ్య రైల్వేలోని ప్రధాన స్టేషన్ల నుండి తిరుపతి, నిజాముద్దీన్, విశాఖపట్నం, సంత్రాగచ్చి, గోరఖ్‌పూర్, అగర్తల, రక్సాల్, నాగర్‌సోల్, దానాపూర్, శ్రీకాకుళం, నాగ్‌పూర్, మాల్డా టౌన్, పాట్నా, షాలిమార్, షిర్డీ, సోలాపూర్, పూణే, ముంబై, జైపూర్ మొదలైన ప్రముఖ మార్గాలలో నడపబడుతున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లలో అన్ని వర్గాల ప్రయాణీకుల అవసరాలను తీర్చడానికి రిజర్వ్డ్ కోచ్ లు మరియు అన్రిజర్వ్డ్ కోచ్ ల మిశ్రమ కూర్పుతో ఏర్పాటు చేయబడ్డాయి.
దక్షిణ మధ్య రైల్వే రిజర్వ్ చేయని కోచ్ల ద్వారా ప్రయాణించాలనుకునే ప్రయాణీకుల కోసం జనరల్ కౌంటర్ల వద్ద క్యూలో నిలబడకుండా తమ టిక్కెట్లను మొబైల్ యాప్లో యూ.టి.ఎస్. ద్వారా కొనుగోలుచేసుకొనే అవకాశం ఏర్పాటుచేయబడినది సూచించింది.

భారతీయ రైల్వేలు దక్షిణ మధ్య రైల్వే అధికార పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్ మరియు తిరుపతి స్టేషన్లతో సహా మొత్తం రైల్వేవ్యవస్థలో 150కి పైగా రైల్వే స్టేషన్లలో ప్రయాణీకుల కోసం “నవరాత్రి స్పెషల్ థాలి” పేరుతో ప్రత్యేక భోజన సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికులు ఈ రుచికరమైన “నవరాత్రి స్పెషల్ థాలి” ని రైల్వే ఐ.ఆర్.సి.టి.సి మొబైల్ యాప్ మరియు రైల్వే అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొనవచ్చును.
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్, జోన్ అందించిన అదనపు ప్రయాణ సౌకర్యాన్ని రైలు వినియోగదారులు ఉపయోగించుకోవాలని మరియు వారి ప్రయాణాన్ని సురక్షితంగా, సౌకర్యవంతంగా మరియు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాబోయే రోజుల్లో రోలింగ్ స్టాక్, ట్రాక్ సామర్ధ్యం తదితర వనరుల లభ్యత మేరకు మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టేందుకు జోన్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రైల్వే ప్రయాణికులకు అనుకూలమైన మరియు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించే ప్రయత్నంలో భాగంగా డిమాండ్‌ ఎక్కువగా ఉన్న రైలు మార్గాలను క్రమం తప్పకుండా ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ నిరంతర పర్యవేక్షణ ద్వారా ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా రైళ్లను సమర్ధవంతంగా నడుపుతున్నట్లు తెలియజేశారు