భారత్ న్యూస్ :హరియాణా రాజ్ భవన్ll చండీగఢ్
హరియాణా రాష్ట్రం పంచకులలో ఆగస్టు 3, 4 తేదీల్లో జరుగుతున్న ఐజేయూ జాతీయ కౌన్సిల్ సమావేశాలలో ముగింపు సెషన్ ఆదివారం 4 ఆగష్టు 2024 రోజున హరియాణా రాష్ట్ర గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశానికి ఐజేయు జాతీయ అధ్యక్షుడు కే.శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షత వహించారు.
శ్రీ బండారు దత్తాత్రేయ గారు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ మీడియా మన ప్రజాస్వామ్యానికి మూల స్థంభమని , మీడియా పటిష్టం గా ఉంటేనే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని అన్నారు. ప్రభుత్వాలు వస్తూ పోతూ ఉంటాయి, పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి , కానీ దేశం శాశ్వతమని, దేశం వికాసం చెందాలంటే ప్రజాస్వామ్యం కీలకమని, అందుకు బలమైన మీడియా అవసరమని శ్రీ దత్తాత్రేయ గారు అన్నారు.
ప్రభుత్వాలు చేసే మంచిని, చెడును ప్రజల ముందుకు తెచ్చే బాధ్యత మీడియాదేనని వారు స్పష్టం చేశారు. నిబద్ధతతో జర్నలిజం చేసే పాత్రికేయులను చూసి ముఖ్యమంత్రులు సైతం భయపడటం తనకు తెలుసునని, అలాంటి పాత్రికేయులను పిలిచి వారు లేవనెత్తిన సమస్యలపై మాట్లాడుకోవడం జరిగేదని దత్తాత్రేయ అన్నారు. తన దృష్టిలో పాలకులకంటే నిజం చెప్పే జర్నలిస్టే ఉన్నతమైన వారని శ్రీ బండారు దత్తాత్రేయ గారు అన్నారు.
సత్యం చెప్పడానికి , వాస్తవాలను వెలుగులోనికి తేవడానికి మీడియా కృషి చేయాలని పిలుపునిచ్చారు. గతంలో ఎన్నో కుంభకోణాలను, అక్రమాలను, అవినీతిని వెలుగులోకి తేవడంలో పరిశోధనాత్మక జర్నలిజం ముఖ్య భూమిక పోషించిందని శ్రీ దత్తాత్రేయ గారు గుర్తు చేశారు. అయితే వాస్తవాలను వెలుగులోనికి తెస్తే సహించలేని దుష్ట శక్తులు మీడియాపై దాడులు చేస్తుంటాయని శ్రీ దత్తాత్రేయ గారు అన్నారు.
సత్యాన్ని వెలుగులోకి తేవాలంటే జర్నలిస్టు నిర్భీతితో, సాహసంతో, నిబద్ధతతో విధి నిర్వహణ చేయాల్సి ఉంటుందని దత్తాత్రేయ పేర్కొన్నారు.
నిజాలను నిర్భయంగా వెలుగులోకి తెచ్చే పాత్రికేయులకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని, జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేక చట్టం చేయాలన్న ఐ.జే.యు. డిమాండు న్యాయబద్దమేనని, ప్రత్యేక భద్రతా చట్టం డిమాండును కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతానని శ్రీ దత్తాత్రేయ గారు హామీ ఇచ్చారు.
భువనేశ్వర్ లో జరిగిన ఐజేయూ ప్లీనరీకి కేంద్ర కార్మికశాఖ మంత్రి హోదాలో తాను హాజరయ్యానని, వర్కింగ్ జర్నలిస్టుల సమస్యల గురించి తనకు అవగాహన కలిగిందని, వర్కింగ్ జర్నలిస్టుల వేజ్ బోర్డు నియమించాలన్న అంశాన్ని యూనియన్ నేతలు తన దృష్టికి తెచ్చారని, వెంటనే యూనియన్ల ప్రతినిధులతో సమావేశాన్ని ఏర్పాటు చేసానని శ్రీ దత్తాత్రేయ గారు గుర్తు చేశారు. ప్రస్తుతం వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాన్ని రద్దు చేయడంతో జర్నలిస్టుల వేజ్ బోర్డు కూడారద్దయ్యిందని తెలిపారు. అయితే వర్కింగ్ జర్నలిస్టులకు వేతన భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని, అందుకు వేజ్ బోర్డు ఏర్పాటు ఆవశ్యకతను తన స్థాయిలో కేంద్రం దృష్టికి తీసుకు వెళతానని దత్తాత్రేయ హామీ ఇచ్చారు. ఇటీవల కాలంలో సాంకేతికత పెరుగుదల, కృత్రిమ మేధ ప్రవేశంతో మీడియా రంగంలో తీవ్ర మార్పులు చోటు చేసుకుంటున్నాయని అన్నారు.
మీడియాకు విలువలు ప్రధానమని, విలువలు లేని మీడియాకు విశ్వసనీయత ఉండదని, విశ్వసనీయత లేని మీడియాకు గౌరవం ఉండదని, పాత్రికేయులు సమాచారాన్ని సమాచారంగా ఇవ్వాలని, న్యూస్ బదులు వ్యూస్ ఇవ్వడం మంచి పద్ధతి కాదని శ్రీ దత్తాత్రేయ గారు అన్నారు.