భారత్ న్యూస్ .రాజేంద్రనగర్.హైదరబాద్. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వ్యవసాయ, వెటర్నరీ, ఉద్యాన యూజీ (అండర్ గ్రాడ్యుయేట్) కోర్సులలో ప్రవేశాలకు కౌన్సిలింగ్ సోమవారం ప్రారంభమైంది. రాజేంద్రనగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో నిర్వహిస్తున్న ఈ కౌన్సిలింగ్ ను రిజిస్ట్రార్ డాక్టర్ పి రఘురామిరెడ్డి ప్రారంభించారు. తెలంగాణ ఎఫ్సెట్ – 2024 లో 369 ర్యాంకు పొందిన ఎం.స్ఫూర్తి రాజేంద్రనగర్ వెటర్నరీ కళాశాలలో తొలి అడ్మిషన్ పొందింది. అలాగే, 431, 550 ర్యాంకు పొందిన వై.శేషపద్మిని ఎస్. ధరణి కుమార్ కూడా రాజేంద్రనగర్ వెటర్నరీ కళాశాలలో బీవీఎస్సీ కోర్సులో సీటు పొందారు. అయితే, 732 వ ర్యాంకు వచ్చిన మహమ్మద్ సోహెల్ వరంగల్ వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సులో సీట్ తీసుకున్నాడు. వ్యవసాయ, వెటర్నరీ, ఉద్యాన కోర్సులలో చేరడం వల్ల విద్యార్థులకు ఉన్న ఉపాధి ఉన్నత విద్యా అవకాశాల గురించి ఆయా విశ్వవిద్యాలయాల అధికారులు ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ గోపాల్ రెడ్డి, వ్యవసాయ విశ్వవిద్యాలయం డీన్ ఆఫ్ అగ్రికల్చర్ డాక్టర్ జయశ్రీ, డీన్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ డాక్టర్ విజయలక్ష్మి, ఉద్యాన విశ్వవిద్యాలయం డీన్ డాక్టర్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారి ఆధ్వర్యంలో ఈ తొలి విడత కౌన్సిలింగ్ ప్రారంభమైంది.