
తెలంగాణ బీజేపీలో సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం అయిందని తెగ హ్యాపీ అయిపోయారు. నేతలందరూ ఎవరికి వారు అది తమ ఘనటే అన్నట్లు జబ్బలు చరుచుకున్నారు.. అయితే ఆ నమోదైన సభ్యత్వాల్లో 13 వేలు ఫేక్ అని తేలిందంట.. అది తెలిసి పార్టీ పెద్దలు మమ్మల్నే ఫూల్స్ చేస్తారా..? అంత తెలివి లేకుండా పార్టీని నడుపుతున్నామా..? అని రాష్ట్ర నాయకులపై ఫైర్ అయ్యారంట.. ఆ క్రమంలో నకిలీ సభ్యత్వాలతో రాష్ట్ర నేతల కమిటిమెంట్ ఏంటో అర్థమైందంటున్నారు ..క్రియాశీల సభ్యత్వాల పంచాయతీ ఆ పార్టీ డొల్లతనానికి నిదర్శనమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది..
అంతన్నారు, ఇంతన్నారు.. కొత్తగా తెలంగాణలో బీజేపీ సభ్యత్వాలు అరకోటి దాటిస్తామన్నారు.. దేశంలో అతి పెద్ద పార్టీగా అవతరించబోతున్నామనారు..? సభ్యత్వ నమోదులో చరిత్ర సృష్టిస్తామని గొప్పలు చెప్పుకున్నారు ..కానీ తీరా చూస్తే అంత ఫసక్, అంతా ఫేక్ అని తేలిందంట. ఆ క్రమంలో రాష్ట్ర కాషాయ పార్టీలో క్రియాశీల సభ్యత్వాల రచ్చ కెక్కింది. సాధారణ సభ్యత్వాలు 45 లక్షలకు చేరుకున్నాయని సంబర పడుతున్న రాష్ట్ర కమలం పార్టీ నేతలకు పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ సునీల్ బన్సల్ క్రియాశీల సభ్యత్వాల అంశంలో షాక్ ఇచ్చారు.
ఫేక్ సభ్యత్వాలు చేస్తారా..? మమ్మల్ని ఫూల్స్‌ను చేస్తున్నారా..? వాస్తవాలు కళ్ళకు కనిపించడం లేదా..? పార్టీ అంటే ఆషామాషీనా..? అంత తెలివి లేకుండా పార్టీని పదేళ్లకు పైగా అధికారంలో నడిపిస్తున్నామా..? అంటూ రాష్ట్ర నేతల పని తీరుపై సునీల్ బన్సాల్ ఆగ్రహం వ్యక్తం చేశారంట. తెలంగాణ బీజేపీలో అక్షరాలా 13 వేల క్రియాశీల నకిలీ సభ్యత్వాలు ఉన్నాయంటూ స్వయంగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ సునిల్ బన్సల్ ఆఫీస్ బేరర్స్ మీటింగులో బయట పెట్టడం సంచలనంగా మారింది.
క్రియాశీల సభ్యత్వాల నమోదుపై బన్సల్ రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తంచేసినట్లు ఆ పార్టీవర్గాల నుంచి వినిపిస్తోంది. 13 వేల ఫేక్ క్రియాశీల సభ్యత్వాలిస్తే తెలుసుకోనేంత తెలివి కూడా లేకుండా పార్టీ నడుపుతున్నారనుకున్నారా.? అంటూ రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర అసహనం వ్యక్తంచేసినట్లు సమాచారం. దీంతో కిషన్ రెడ్డే కాదు, సమావేశంలో ఉన్న ముఖ్య నేతలందరూ షాక్‌కు గురయ్యారంట. సభ్యత్వంపై ఎవరికి వారు మేమే కింగ్‌ల మంటూ గొప్పలు చెప్పుకున్న నేతలకు బన్సల్ ఇచ్చిన ట్రీట్ మెంట్‌తో గట్టిగానే నెప్పి తెలిసిందంట. తెలంగాణ బీజేపీకి జాతీయ నాయకత్వం 50 లక్షల సాధారణ సభ్యత్వాలు నమోదు చేయాలని టార్గెట్ ఇచ్చింది. పార్టీ మాత్రం 45 లక్షల టార్గెట్ ను రీచ్ అయ్యామని చెబుతోంది. కానీ క్రియాశీలక సభ్యత్వాల్లో ఫేక్ లెక్కలు చూస్తుంటే సాధారణ సభ్యత్వాలు కూడా 45 లక్షలకు చేరిందా అది కూడా ఫేకేనా అనే అనుమానాలు ఆ పార్టీ వర్గాల్లోనే వ్యక్తమవుతున్నాయి
వాస్తవానికి క్రియాశీల సభ్యత్వ నమోదు ప్రక్రియ అత్యంత పారదర్శకంగా సాగాలి.. ఒక పార్టీ బతకాలన్న, బలోపేతం కావాలన్నా సభ్యత్వ నమోదు అత్యంత కీలకం. కానీ అందుకు భిన్నంగా బీజేపీ నేతలు చాలా లైట్ తీసుకోవడేమే కాక, నకిలీ సభ్యత్వాలను సృష్టించడంపై బన్సాల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తినట్లు టాక్. ఒకవైపు అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ రాష్ట్రంలో వరసగా వస్తున్న ఎన్నికల్లో విజయం సాధిస్తూ అధికార, ప్రతిపక్ష పార్టీలకు ఝలక్ ఇస్తూ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్న కమలం పార్టీలో ఒక్కసారిగా సభ్యత్వాల నమోదులో నకిలీ ఉదంతాలు బయటపడటం ఆపార్టీ డొల్లతనానికి నిదర్శనమన్న విమర్శలు వస్తున్నాయి.
దక్షిణాదిలో బీజేపీ బలోపేతానికి గేట్ వే తెలంగాణ అని ఆ పార్టీ జాతీయ నాయకత్వం చెప్పుకుంటుంది. కానీ రాష్ట్ర నాయకత్వం మాత్రం అందుకు విరుద్ధంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక నెక్ట్స్ తెలంగాణే టార్గెట్ గా అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే క్రమంగా గ్రౌండ్ స్థాయి నుంచి బలోపేతమవ్వాలని, గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలని రాష్ట్ర నాయకత్వానికి పడే పదే ఢిల్లీ పెద్దలు సూచిస్తున్నప్పటికీ నేతలు మాత్రం రోజుకొక పంచాయితీతో రచ్చకెక్కుతున్నారు. సభ్యత్వాల టాస్క్‌ను సీరియస్‌గా తీసుకొని ముందుకు వెళ్ళాలని అధిష్టానం ఆదేశించినప్పటికీ ..ఫేక్ సభ్యత్వాలు నమోదు చేయడంపై సునీల్ బన్సలే కాదు టోటల్ హైకమాండ్ సైతం ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. అయితే సునీల్ బన్సాల్ ఇచ్చిన ఝలక్కు, ఏం చేయాలో తేలిక, క్రియాశీల సభ్యత్వాలకు సంబంధించిన వివరాలను మాన్యువల్ పద్ధతిన తీసుకున్నామని, వాటిని డిజిటల్ ఫార్మాట్ లో అప్ డేట్ చేయాల్సి ఉందని చెప్పుకొని రాష్ట్ర నేతలు చేతులు దులుపుకున్నారంట.
బీజేపీలో పదవులు దక్కాలంటే క్రియాశీల సభ్యత్వాలు చాలా కీలకం. ఈ క్రియాశీల సభ్యత్వమున్న వారికే పార్టీలో కీలక పదవులు దక్కుతాయని, లేదంటే కష్టమని పార్టీ కరాఖండిగా చెబుతోంది. జిల్లా అధ్యకుల నుంచి రాష్ట్ర అధ్యక్షుడి వరకు కనీసం రెండు క్రియాశీల సభ్యత్వాలుంటేనే అర్హుడనే నిబంధన బీజేపీలో ఉంది. అయితే ఇటీవల హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిగా పార్టీ ప్రకటించిన గౌతమ్ రావుకు సైతం క్రియాశీల సభ్యత్వం లేదని తెలుస్తోంది. క్రియాశీల సభ్యత్వాల విషయంలోనే ఇంత నిర్లక్షం ఉంటే అధికారానికి ఎలా చేరువవుతామని పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. నకిలీలు సృష్టించడంలో, ప్రచారం చేయడంలో బీజేపీ దేశ వ్యాప్తంగా అగ్రభాగంలో ఉంటుందని జరుగుతున్న ప్రచారానికి రాష్ట్ర బీజేపీలో నకిలీ సభ్యత్వాలే నిదర్శనమనే విమర్శలు పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి.
క్రియాశీల సభ్యత్వాల అంశంపైనే కాదు సునిల్ బన్సాల్ కొత్తగా ఎంపికైన జిల్లా అధ్యక్షులు ఏం చేస్తున్నట్లని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కేవలం వర్క్ షాప్ లు, ఇండోర్ మీటింగులు పెట్టుకుంటే సరిపోదని ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లక పోతే లాభం లేదని వార్నింగులు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఏసీ రూంలలో కూర్చుంటే పనులు కావని, ఫీల్డ్‌లోకి వెళ్లాలని, లేకపోతే ప్రయోజన ఉండదని నేతలకు బన్సాల్ గట్టిగానే క్లాస్ పీకారంట. మొత్తం మీద ఒకవైపు కొత్త, పాత నేతల పంచాయితీలతో పార్టీ సతమతమవుతుంటే, తాజాగా ఫేక్ సభ్యత్వాల కిరికిరి రాష్ట్ర బీజేపీకి తగులుకుంది. 13 వేల నకిలీ క్రియాశీల సభ్యత్వాలు నమోదయ్యాయని తేలడంతో.. 45 లక్షల సాధారణ సభ్యత్వాల నమోదుపై లేనిపోని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.