తెలంగాణ సీఎంఓ ప్రక్షాళన..

తెలంగాణ సీఎంఓలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రక్షాళన దిశగా చర్యలు చేపట్టారు. అధికారుల మధ్య సమన్వయలోపంతో పాటు ఆధిపత్య పోరు ఈ మా‌ర్పులకు కారణం అని తెలుస్తోంది. ఇప్పుడున్న సెక్రెటరీల మధ్య సమన్వయలోపం కారణంగా వారి సంఖ్యను ఏడు నుంచి ఐదుకు కుదించారు. ఇప్పటికే ఇద్దరిని బదిలీ చేయగా మరో రెండ్రోజుల్లో మరొకరు వీఆర్ఎస్ తీసుకోనున్నారు. త్వరలో సెక్రెటరీల మధ్య పని విభజన కోసం శాఖలను కేటాయించి వారు సమర్థవంతంగా పనిచేసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది.

తెలంగాణ సిఎంఓలో ప్రక్షాళన దిశగా అడుగులు పడుతున్నాయి. తాజాగా సీఎం సెక్రెటరీ షానవాజ్ ఖాసీం బదిలీ చేసి ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్, డ్రగ్ కంట్రోలర్ డీజీగా నియమించారు. ఇప్పటికే సీఎం సెక్రటరీగా ఉన్న ఐఏఎస్ సంగీత సత్యనారాయణను హెల్త్ డైరెక్టర్ గా బదిలీ చేశారు. ఐఎఫ్ఎస్ అధికారి చంద్రశేఖర్‌రెడ్డిని ఆర్టీఐ చీఫ్ కమిషనర్ గా నియమించనున్నారు. త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నాయి. సీపీఏఆర్ఓ అయోధ్యరెడ్డి కి కూడా ఆర్టీఐ కమిషనర్‌గా అవకాశం కల్పించి ఆస్థానంలో మరొకరిని నియమించనున్నారు. ఏపీ కేడర్‌కు చెందిన శ్రీనివాస్ రాజ్ బీఆర్ఎస్ హయాంలో డిప్యూటేషన్‌పై రాష్ట్రంలో పనిచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్రం ఆయన డిప్యూటేషన్ పొడగించలేదు. దాంతో ఆయన వీఆర్ఎస్ తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన్ని సీఎం సలహాదారుడిగా నియమించారు. తాజాగా సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీగా ప్రమోట్ చేశారు

ప్రస్తుతం సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రెటరీగా పనిచేస్తోన్న చంద్రశేఖర్ రెడ్డిని చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌గా నియమించనున్నారు. ఇప్పటికే సంబంధిత ఫైల్‌ మీద గవర్నర్ సంతకం చేశారు. రెండు, మూడు రోజుల్లో ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీగా పదవీ విరమణ చేసి నూతన బాధ్యతలు చేపట్టనున్నారు. దాంతో సీఎం ఆఫీసు నుంచి ముగ్గురు అధికారులు బయటకు వెళ్తుండగా ఒకరు కొత్తగా బాధ్యతలు తీసుకోనున్నారు. మొత్తం ఐదుగురు అధికారులతో తన ఆఫీసు కార్యకలాపాలను కొనసాగించాలనే నిర్ణయానికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చినట్లు తెలుస్తోంది.

రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తన ఆఫీసులో పనిచేసే సెక్రటరీల నియామకం విషయంలో సామాజిక సమీకరణలకు ప్రయారిటీ ఇచ్చారు. ఆ క్రమంలో సీఎంఓలో పనిచేసే అధికారుల సంఖ్య ఏడుకు చేరింది. ఎక్కువ మంది ఆఫీసర్ల వల్ల కొన్ని సార్లు ప్రయోజనం ఉన్నా అధికంగా ఇబ్బందులు తలెత్తినట్లు విమర్శలు ఉన్నాయి. అలాగే ఫైల్స్ క్లియరెన్స్ విషయంలో కొన్ని సార్లు సెక్రటరీల మధ్య సమన్వయం లోపం ఏర్పడినట్లు టాక్. అందుకే సెక్రటరీల సంఖ్యను కుదించాలని.. అందులోనూ అనుభవం ఉన్న వారికి మాత్రమే ప్రయారిటీ ఇవ్వాలని నిర్ణయానికి సీఎం రేవంత్ వచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఎవరిని సీఎంఓలో కొనసాగించాలి? ఎవరిని బయటికు పంపించాలి? అనే అంశంపై పలుమార్లు ఆలోచించి తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

ఒక్క సిఎంవోనే కాదు ప్రభుత్వంలో కీలక అధికారుల విషయంలో ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తుంది. ఇప్పటికే సిఎస్‌గా రామకృష్ణారావుని నియమించగా డీజీపీ మార్పునకు కూడా ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి స్మిత సబర్వాల్‌కు చెక్ పెట్టి జయేష్‌రంజన్ కు ఆ భాద్యతలు అప్పగించారు. ఇలా మరికొందరు ఐపిఎస్, ఐఎఎస్ అధికారులకు స్థాన చలనం కలిగించడానికి రంగం సిద్దమైందంట.