కరీంనగర్లో కాంగ్రెస్ యుద్ధం..

పొలిటికల్ ట్రెండ్ మారుతున్నా.. ఆ పొలిటికల్ పార్టీలో ఎప్పట్నుంచో ఉన్న బ్రాండ్ మారట్లేదు. కరీంనగర్ జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ.. ఆగమాగం అవుతోందట. తరచుగా వివాదాలు.. విభేదాలతో.. లీడర్లు తెగ తన్నుకుంటున్నారట. సొంత పార్టీ కార్యకర్తలే వీధి పోరాటాలకు దిగుతుండటంతో.. చేసేదేమీ లేక లీడర్లంతా చూస్తూ ఉండిపోతున్నారట. అంతేకాదు.. తమ మంత్రు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆందోళనలకు దిగుతున్నారు. ఏఐసీసీ ఇంచార్జుల నుంచి పీసీసీ నేతల దాకా.. ఎవరొస్తే వాళ్లు కంప్లైంట్లు చేసేస్తున్నారు. కాంగ్రెస్‌లో కలహాలతో.. జిల్లా హస్తం పార్టీ అస్తవ్యస్తంగా మారుతోందనే టాక్ వినిపిస్తోంది. అసలు.. కరీంనగర్ కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది?ఒక జిల్లాకు.. పార్టీ ఆఫీస్ ఒకటే ఉంటుంది. అది ఏ జిల్లా అయినా. ఏ పార్టీ అయినా! కానీ.. కరీంనగర్‌లో అలా కాదు. ఎవరి దుకాణం వారిదే. అసలు దుకాణాన్ని మూసేసి.. ఎవరి దుకాణం వారు తెరిచి చేస్తున్న హంగామాతో.. జిల్లాలో హస్తం పార్టీ పరిస్థితి అస్తవ్యస్తంగా తయారవుతోందనే చర్చ మొదలైంది. కొన్నాళ్లుగా..

కరీంనగర్‌లో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు రెండు వర్గాలుగా చీలిపోయి.. ప్రతి సమావేశంలో ఏదో రకంగా గొడవకు దిగుతున్నారనే ప్రచారం సాగుతోంది. ఇటీవలే.. ఇరు వర్గాల మధ్య డీసీసీ ఆఫీస్ వేదికగా జరిగిన గొడవ, ఆ వెంటనే.. సిరిసిల్ల కాంగ్రెస్ కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తల బాహాబాహీ లాంటి ఘటనలు.. జిల్లా పార్టీలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరి కళ్లకు కట్టాయ్. పార్టీలో ఒక్కొక్కరి ఆగ్రహావేశాలు నివురుగప్పిన నిప్పులా ఎలా ఉన్నాయో తేటతెల్లం చేశాయ్. కరీంనగర్ డీసీసీ ఆఫీసులో ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్ పెరుమాళ్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో.. ఆయన ముందే కాంగ్రెస్ కార్యకర్తలు గల్లాలు పట్టుకున్నారు. ఆ తర్వాత ఇదే దృశ్యం.. సిరిసిల్లోనూ కనిపించింది. ఇలాంటి వరుస ఘటనలు చూశాక.. కరీంనగర్ కాంగ్రెస్‌లో అసలేం జరుగుతోందనే చర్చ మొదలైంది.

కరీంనగర్ డీసీసీ ఆఫీసులో కాంగ్రెస్ కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయిన కొట్టుకున్నారనే దాని వెనుక ఆసక్తికరమైన కథ ఉన్నట్లు తెలుస్తోంది. విశ్వనాథన్ పెరుమాళ్ కరీంనగర్‌కు రాగానే.. పార్టీలోని కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు ఆయనని కలిశారు. వారితో పాటు ముఖ్య నేతలూ ఉన్నారు. వారంతా.. ఇక్కడి కాంగ్రెస్‌లో నెలకొన్న పరిస్థితిని వివరించారు. అంతేకాదు.. కీలక నాయకులే గ్రూపులను ప్రోత్సహిస్తున్నారని ఫిర్యాదు చేశారట. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎదగకపోవడానికి కారణం వాళ్లేనని చెప్పారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. అంతేకాదు.. ప్రతి పనికీ అడ్డుపడుతున్నారని కూడా చెప్పారట. ఇదే సమయంలో..
కరీంనగర్ నియోజకవర్గ ఇంచార్జ్‌గా ఉన్న పురమళ్ల శ్రీనివాస్ కూడా కాస్త గట్టిగానే వాయించేశారట. ఒకతను హైదరాబాద్‌లోఉంటారని.. తాను ఇక్కడికి రారని.. ఇక్కడ ఎవ్వరినీ ఏమీ చేయనివ్వరని.. తాను కూడా ఏమీ చేయడని.. చెప్పినట్లుగా కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. దాంతో.. కాంగ్రెస్‌లోని ఓ వర్గీయులు.. శ్రీనివాస్‌పై.. ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్ పెరుమాళ్ ముందే దాడికి తెగబడ్డారు. నానా హంగామా చేశారు.

మరోవైపు.. సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్‌లోనూ ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయ్. అక్కడి జిల్లా ఆఫీసులోనూ ఇలాంటి దృశ్యమే కనిపించింది. చీటీ ఉమేశ్‌ రావు అనే నాయకుడు.. స్టేజ్‌పైకి ఎక్కగానే.. గొడవ మొదలుపెట్టేశారట. ఇంతకాలం కనిపించకుండా పోయిన నువ్వు.. ఇప్పుడొచ్చి ఫోజులిస్తున్నావా అంటూ.. కాంగ్రెస్ కార్యకర్తలు గొడవకు దిగారట. విప్ ఆది శ్రీనివాస్‌తో పాటు సిరిసిల్ల జిల్లా నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి ముందే ఈ గొడవంతా జరిగింది.దాంతో.. కరీంనగర్ డీసీసీ ఆఫీసులో జరిగిన గొడవని మరవకముందే.. సిరిసిల్ల జిల్లా పార్టీలో అంతర్గత కలహాలు ఏ స్థాయికి చేరుకున్నాయో అందరికీ అర్థమైంది.


తెలంగామ ఉద్యమం నుంచి మొదలుకొని.. తెలంగాణ రాష్ట్ర సాధన వరకు.. పదేళ్లు బీఆర్ఎస్ అధికారం చెలాయించిన దగ్గర్నుంచి.. కాంగ్రెస్‌కు అధికార పగ్గాలు అందేవరకు.. తెలంగాణ రాజకీయాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రాతినిథ్యం ఎంతో కీలకమైందనే చర్చ ఉంది. అలాంటిది.. ఇన్నేళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. కీలకమైన కరీంనగర్ జిల్లాలో మాత్రం విభేదాలు, వివాదాలతో రచ్చకెక్కుతోందనే చర్చ సాగుతోంది. ప్రతిపక్ష పార్టీలను కోలుకోలేని దెబ్బకొట్టే వ్యూహాలను పక్కనపెట్టి.. తమలో తామే కుమ్ములాడుకోవడం చూస్తుంటే.. జనాల్లో పార్టీ మరింత పలుచనవుతోందనే టాక్ వినిపిస్తోంది. ఈ విభేదాలు, గొడవలు.. పార్టీ పరువుతో పాటు సర్కారు ప్రతిష్ఠను కూడా మానేరులో ముంచేస్తోందనే వాదనలు బలపడుతున్నాయ్. అధికార పార్టీలో ఈ విధమైన కుమ్ములాటల్ని చూసి.. విపక్షాలు వినోదాన్ని పొందుతున్నాయనే చర్చ ఉంది. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల్ని సెట్ రైట్ చేసేందుకు.. పీసీసీ ఎలాంటి చర్యలు చేపడుతుందనేది ఆసక్తిగా మారింది.