
అనుకున్నదొక్కటి, అయినది ఒక్కటి…బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట పాట గుర్తుందా. ఇప్పుడు ఈ పాట వరంగల్ బీఆర్ఎస్ నేతల నోళ్ళల్లో నానుతోందట. రజతోత్సవ సభ తర్వాత పార్టీలో కొత్త ఊపు వస్తుందని భావిస్తే….అసలు పార్టీ భవితవ్యం ఏంటో తెలియక శ్రేణులు నారాజ్ లో ఉన్నారట. నాయకుల మధ్య ఉన్న విభేదాలు బయటపడడంతో…తాము ఎప్పుడు బయటకు వెళ్దామా అనే ఆలోచనలో పడ్డారట ద్వితీయ శ్రేణి నేతలు. ఇంతకీ ఓరుగల్లు గులాబీ పార్టీలో ఏం జరుగుతోంది?
ఓరుగల్లు వేదికగా బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన రజతోత్సవ సభ అనుకున్నట్టుగా విజయవంతం కాలేదని బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తూ డీలా పడిపోతున్నాయి. ఉమ్మడి వరంగల్ నుండే 3లక్షల మంది శ్రేణులను సభకు తరలిస్తామని చెప్పిన ఓరుగల్లు గులాబీ నేతలు… 60వేల మందిని తరలించడం కనాకష్టమైందంట. దీంతో ఓరుగల్లు గులాబీ నేతలపై కేసీఆర్ గుస్సా అయ్యారట. సభ నిర్వహణపై ఓరుగల్లు మాజీ ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు నెలకొనండంతో ఒకానొక సమయంలో సభను హైదరాబాద్ లో నిర్వహించేందుకు సిద్ధమయ్యారు కేసీఆర్. దాంతో ఓరుగల్లు బీఆర్ఎస్ నేతలంతా కేసీఆర్ ను ఒప్పించి సభను సక్సెస్ చేస్తామని ప్రాధేయపడ్డారు. చివరికి కేసీఆర్ ఒప్పుకోవడంతో సభ సాక్షిగా తమ సత్తా చాటుకోవాలని భావించారు
సభా నిర్వహణ బాధ్యతల కోసం ఉద్యమ నేతలు, వలస నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగింది. చివరకు ఉద్యమ నేతలకే సభ నిర్వహణ బాధ్యతలు దక్కాయి. దీంతో పార్టీ పుట్టినప్పటి నుండి ఉన్న నాయకులకే కేసీఆర్ గుర్తింపు ఇచ్చారనే టాక్ వినిపించింది. దీంతో వలస నాయకులు, వారి శ్రేణులు అసహనానికి గురయ్యారు. తమ నేతలకు ప్రాధాన్యత లేనప్పుడు పార్టీ కోసం ఎందుకు కష్టపడాలనే ఆలోచనకి వచ్చారట. సభలో కేసీఆర్ ప్రసంగం, తర్వాత జరిగే పరిణామాలను బట్టి నిర్ణయం తీసుకునేందుకు సిద్దమయ్యారట మరికొందరు.
రజతోత్సవ సభ తర్వాత పార్టీ నిర్మాణం, సభ్యత్వాలు నమోదుపై దృష్టి పెట్టాలని అధిష్టానం ఆదేశాలు జారీ చేసిందట. సభ్యత్వ నమోదుపై మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారట. కీలక సభకు శ్రేణులు తరలిరానప్పుడు, సభ్యత్వ నమోదు సైతం అదేవిధంగా కొనసాగుతుందని…అప్పుడు పార్టీ బలహీనత బయటపడుతుందని ఆలోచిస్తున్నారట. కేసీఆర్ సభతో పార్టీ శ్రేణుల్లో జోష్ వచ్చి, స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి వస్తుందని భావించిన ద్వితీయ శ్రేణి నాయకులు…తమ పార్టీ ఎంత బలహీనంగా ఉందో తెలిసిపోయిందని భావిస్తున్నారట.
మొత్తానికి పది లక్షల మందితో సభను గ్రాండ్ సక్సెస్ చేస్తానన్న నాయకులు అందులో విఫలమయ్యారు. నాయకుల మధ్య ఆధిపత్య పోరు కారణంగా వర్గాలు ఏర్పడి క్యాడర్ సైతం రెండు గ్రూపులుగా చీలిపోయింది. తమ నాయకునికి అవమానం జరిగింది అని అనుచరులు సైతం… పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత పెంచుకుంటున్నారు. ఇలాంటి సందర్భంలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే ఘోర పరాభవం తప్పదని భావిస్తున్నారట గులాబీ శ్రేణులు. రజతోత్సవ సభ తర్వాత పార్టీ గాడిన పడుతుందని భావిస్తే….ఉన్న పరువూ పోయి, కొత్త వర్గాలు ఏర్పడి పార్టీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయే దశకు చేరుకుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట సీనియర్ నేతలు. మొత్తానికి ఏదో తలిస్తే ..ఇంకేదో అయ్యిందన్న అంతర్మధనం ఓరుగల్లు గులాబీనేతల్లో కనిపిస్తోంది