
ప్రజాక్షేత్రంలో గెలిచిన నేతలు ప్రజల పక్షాన నిలవాలి..తమకు ఓటేసి గెలిపించిన ప్రజలను కంటి కి రెప్పలా కాపాడాలి. కానీ నల్గొండ జిల్లా లో పరిస్థితి భిన్నంగా ఉందట!.రాష్ట్రంలోనే భారీ మెజార్టీ తో నల్గొండ పార్లమెంట్ స్థానం కాంగ్రెస్ కైవసం చేసుకుంది. గత ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అంటూ ప్రజల ముందు చేయి చాపిన సీనియర్ నేతలు సర్వ శక్తులు ఒడ్డి తమ కుటుంబ సభ్యుల రాజకీయ భవిష్యత్తుకి బాటలు వేసుకున్నారట..గతంలో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనప్పటికి మొదటి సారి భారీ మెజారిటీ తో గెలిచిన నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి తన ప్రాంత ప్రజలకు దూరం అవుతున్నారనే టాక్ జోరుగా సాగుతుంది.
చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మినట్టు తన తండ్రి జానా రెడ్డి పేరు చెప్పుకుని గెలిచాక ప్రజలను గాలికి వదిలేశారని ప్రజలు మండి పడుతున్నారట!.తమ గోడు చెప్పుకునేందుకు అందుబాటులో ఉండరని ఓటేసిన ప్రజలు బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు…కనీసం జిల్లా కేంద్రం లో ఓ ఎంపీ క్యాంప్ కార్యాలయం కూడా లేకపోతే తమ బాధలు వినే వారు ఎవరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక చాలా మందికి తమ ఎంపీ పేరేమిటో కూడా తెలియకుండానే ఓటేశామని వాపోతున్నారట..ఇక మరో వైపు మంత్రి కోమటిరెడ్డి.. ఎంపీ రఘువీర్ ను నల్గొండ లో అడుగు పెట్టనీయడం లేదని చర్చ జోరుగాసాగుతుంది. ఇద్దరు నేతలు కలిసి పనిచేయకపోవడం ఆ ప్రాంత అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతోందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.”*
ఒకవైపు ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి సరైన వేదిక లేక అయోమయానికి గురవుతుంటే, వారిద్దరు ముఖ్య ప్రజాప్రతినిధులు కలిసి కనిపించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.పార్టీ అంతర్గత విభేదాలు ఉన్నాయా? లేక నియోజకవర్గ అభివృద్ధి పట్ల ఇద్దరి దృక్పథాలు వేర్వేరుగా ఉన్నాయా? అన్న ప్రశ్నలకు సమాధానం లేకపోవడంతో ప్రజల్లో మరింత గందరగోళం నెలకొంది. మా కోసం వీరు కలిసి పనిచేయరా?, ఇద్దరు ముఖ్య నేతలు విడివిడిగా ఉంటే మా సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారట..
ఎన్నికలప్పుడు మాత్రం బాగా కలిసి తిరిగారు, ఓటేయమని అడిగారు.. ఇప్పుడు మొఖం చాటేస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్తలే అంటున్నారట..పార్టీ మీద అభిమానంతో కాంగ్రెస్ కు అయితే ఓటేశాము కానీ ఎంపీ ఎవరో, తన పేరు ఏందో కూడా తెలియదంటున్నారు.ప్రజలకు అందుబాటులో ఉండాలని, తమ గోడు వినాలని ప్రజా ప్రతినిధులను సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు. నల్గొండ పార్లమెంటరీ నియోజకవర్గంలో నెలకొన్న ఈ విచిత్రమైన పరిస్థితి రాజకీయంగా అనేక సంకేతాలను ఇస్తోంది. ప్రజలు ఎన్నుకున్న ఇద్దరు నేతలు కలిసి పని చేయక పోవడం, ఎంపీ స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో ఆ ప్రభావం నియోజకవర్గ అభివృద్ధిపై స్పష్టంగా కనిపిస్తుంది.