
జోగులాంబ గద్వాల జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు నేతల ఆధిపత్యమే కొనసాగుతోందని పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ హాట్ చర్చ నడుస్తోంది. వారిలో ఒకరు ప్రస్తుత ఎంపీ మల్లు రవి, మరొకరు మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్. ఇప్పుడు ఆ జిల్లాలో వారి మాటే అధికారులకు శాసనంగా మారిందట. పాలనలో కీలక నిర్ణయాలు, అధికారుల బదిలీలు, కీలక పోస్టింగ్‌లు అన్నీ వారి సిఫార్సుతోనే జరుగుతున్నాయంట. వారి మాట పట్టించుకోకుండా వ్యవహరించిన అధికారులకు తక్షణమే బదిలీ ఉత్తర్వులు సిద్ధమవుతున్నాయంట. దీంతో అధికారులు అప్రమత్తంగా ఉంటూ వీరి మాటలను శిరసావహించక తప్పని పరిస్థితి ఏర్పడిదంట.
ఆ ఇద్దరు నేతల్లో మల్లు రవి ఎంపీ హోదాలో ఉన్నారు. ఎంపి హోదాలో ఉన్న మల్లు రవి మాట చెల్లుబాటు అవుతుందంటే అర్థం ఉంది. అయితే ఏ హోదా లేని మాజీ ఎమ్మెల్యే సంపత్ పెత్తనంపై అధికారులు గుర్రుగా ఉన్నారంట. ఇక్కడ ప్రజా పాలన చేయకుండా పవర్‌తో పాలన చేస్తున్నారన్న చర్చలు జిల్లాలో ఊపందుకున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా… ఈ జిల్లాలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఒకటి అలంపూర్, మరొకటి గద్వాల. అయితే, ఈ నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు ఉన్నా, అసలు అధికారం ఎవరి చేతిలో ఉంది? అధికార యంత్రాంగాన్ని నడిపిస్తోంద ఎవరన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోందట.
ఒకరు గెలిచి పదవిలో ఉన్నా, మరొకరు ఓడిపోయినా, ఇద్దరి హవా మాత్రం ఏ మాత్రం తగ్గలేదన్న మాట అందరి నోట వినిపిస్తోంది. పాలన వీరి కనుసైగలతోనే సాగుతుందన్న వాదన రోజురోజుకు బలపడుతోందట. అధికారుల నియామకాలు, బదిలీలు, జిల్లాలో ముఖ్యమైన అన్ని నిర్ణయాలు వీరి అనుమతితోనే జరుగుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఇక్కడ పని చేయాలంటే, ఈ ఇద్దరిలో ఒకరి ఆమోదముద్ర తప్పనిసరి అన్నట్లుగా పరిస్థితి మారిపోయిందని స్థానికంగా చర్చ నడుస్తోందట. వీరిద్దరూ ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులుగా ఉండటంతో, అధికార యంత్రాంగం వారి దిశానిర్దేశంలోనే పనిచేస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీరి మాటను పట్టించుకోని అధికారులపై వెంటనే బదిలీ వేటు పడుతోందంట
గద్వాల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఉండగా… అలంపూర్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే విజయుడు ఉన్నారు. అయితే, ఎంపీ మల్లురవి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ హవా కొనసాగుతుండటంతో.. గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో డమ్మీలుగా మారిపోయారని టాక్. అధికారులు వారికి పెద్దగా పట్టించుకునే పరిస్థితి లేదట. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గెలిచిన కొద్దిరోజులకే అధికార కాంగ్రెస్ పార్టీలో చేరినా… ఆయన పార్టీలో పూర్తిగా ఇమడలేకపోతున్నారంట.
ఒకే పార్టీలో ఉన్నప్పటికీ, మాజీ జడ్పీ చైర్‌పర్సన్ సరిత – బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మధ్య వర్గ పోరు నడుస్తూనే ఉంది. దీంతో పాలన వ్యవహారాల్లో ఎంపీ, మాజీ ఎమ్మెల్యే సంపత్ జోక్యం ఎక్కువైందనే చర్చ నడుస్తోంది. వారు చెప్పిందే అమలు కావడంతో.. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అధికార కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా లేనట్టే తయారైందని ఆయన అనుచరులు వాపోతున్నారు. గద్వాల నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అధికార పార్టీ కాంగ్రెస్‌లో చేరినప్పటికీ, పరిస్థితులు ఒక్కటంటే ఒక్కటి కూడా అనుకూలించడం లేదంట.
బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ర్యాలంపాడు రిజర్వాయర్ మరమ్మత్తులు, గట్టు ఎత్తిపోతల పథకం పూర్తి కాకపోవడం, నెట్టెంపాడు ఎత్తిపోతల పనులు వాయిదా పడుతుండటం, నియోజకవర్గానికి నిధుల కేటాయింపులు ఆశించినంతగా జరగకపోవడంతో ఆయన అసంతృప్తితో ఉన్నారంటున్నారు. అధికార పార్టీలోకి చేరినప్పటికీ, నియోజకవర్గంలో తన మాటకు అసలు విలువ లేదని, కొన్ని కీలక నిర్ణయాలు తాను తీసుకోలేకపోతున్నానని ఆయన అనుచరుల దగ్గర వాపోతున్నారట. ముఖ్యమంత్రి, మంత్రులతో సత్సంబంధాలు కొనసాగించినా… నియోజకవర్గ అభివృద్ధిలో తన హస్తం తగ్గిపోవడమే కాదు, అధికార యంత్రాంగం కూడా తన సూచనలను బేఖాతరు చేస్తున్నారని బండ్ల అసహనంతో ఉన్నారంట. దీంతో గద్వాల నియోజకవర్గంలో అసలైన అధికారం ఎవరిది? అన్న చర్చ నడుస్తోంది
అలంపూర్ నియోజకవర్గంలోనూ రాజకీయ పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. ఎస్సీ రిజర్వ్డ్ అసెంబ్లీ స్థానం అయిన అలంపూర్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థి విజయుడు, కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్‌పై విజయం సాధించినా విజయుడు డమ్మీగానే మిగిలిపోతున్నారంట. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన సంపత్ కుమార్ గెలిచివుంటే ఖచ్చితంగా మంత్రి అయ్యేవారన్న అభిప్రాయం ఉంది. కానీ ఓటమి ఆయన రాజకీయ ఎదుగుదలకు బ్రేక్ వేసినప్పటికీ.. పార్టీ అధికారంలో ఉండటంతో సెగ్మెంట్లో ఆయన హవానే నడుస్తోదంట.
అలంపూర్‌లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే విజయుడు కాంగ్రెస్‌లోకి రావడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అయితే సంపత్‌కుమార్ ఆయన చేరికను సక్సెస్‌ఫుల్‌గా అడ్డుకున్నారు. ఇప్పుడు అలంపూర్, గద్వాలలోనూ రాజకీయ సమీకరణాలను తనకు అనుకూలంగా మార్చుకుంటున్న సంపత్ గట్టిగానే చక్రం తిప్పుతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అధికార పార్టీలో కీలకంగా ఉన్న కారణంగా… జిల్లా వ్యవహారాలు వారి చుట్టూనే తిరుగుతున్నాయంట. దీంతో గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు నామ్ కే వాస్తేగా మిగిలిపోతున్నారన్న టాక్ నడుస్తోంది. మొత్తమ్మీద గద్వాల జిల్లా రాజకీయం ఆసక్తికరంగా మారిందిప్పుడు?