..భారత్ న్యూస్ అమరావతి..విజయం ముంగిట బోల్తా.. ముంబై టెస్టులోనూ భారత్ ఓటమి
ముంబై: అదే చెత్త బ్యాటింగ్.. అదే నిలకడలేని ఆటతీరు.. ముంబై టెస్టులోనూ బెంగళూరు, పూణే టెస్టుల ఫలితమే ఎదురైంది. న్యూజిలాండ్‌తో మూడవ టెస్ట్ మ్యాచ్‌లోనూ భారత్ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో 147 పరుగుల లక్ష్య సాధనలో భారత్ ఆటగాళ్లు దారుణంగా విఫలమయ్యారు. కేవలం 121 పరుగులకే ఆలౌట్ అయ్యారు. దీంతో 25 పరుగుల తేడాతో మరో ఓటమిని మూటగట్టుకుంది.
లక్ష్య ఛేదనలో స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ మినహా ఎవరూ రాణించలేకపోయారు. పంత్ 64 పరుగులతో పోరాడినప్పటికీ కీలకమైన దశలో అతడి వికెట్ పడడంతో భారత్‌కు అవమానకర రీతిలో 0-3 తేడాతో సిరీస్ ఓటమి ఎదురైంది.
యశస్వి జైస్వాల్ 5, రోహిత్ శర్మ 11, శుభ్‌మాన్ గిల్ 1, విరాట్ కోహ్లీ 1, సర్ఫరాజ్ ఖాన్ 1, రవీంద్ర జడేజా 6, వాషింగ్టన్ సుందర్ 12, రవిచంద్రన్ అశ్విన్ 8, ఆకాశ్ దీప్ 0, మహ్మద్ సిరాజ్ 0 (నాటౌట్) చొప్పున స్వల్ప స్కోర్లు చేశారు. ఇక న్యూజిలాండ్ బౌలర్లల ఎజాజ్ పటేల్ ఏకంగా 6 వికెట్లు తీసి భారత్ పతనాన్ని శాసించాడు. మిగతా బౌలర్లలో గ్లెన్ ఫిలిప్స్ 3 వికెట్లు, మ్యాట్ హెన్రీ 1 వికెట్ తీశారు.
అవమానకర ఓటమి..
స్వదేశంలో జరిగిన రెండు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లతో కూడిన టెస్టు సిరీస్‌లో భారత జట్టు వైట్‌వాష్‌కు గురికావడం 24 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. కివీస్ చేతిలో 0-3 తేడాతో ఓడిపోవడంతో గత 24 ఏళ్ల తర్వాత తిరిగి వైట్‌వాష్ రిపీట్ అయింది. చివరిసారిగా 2000లో టీమిండియా ఈ పరాభవాన్ని ఎదుర్కొంది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను దక్షిణాఫ్రికా 2-0తో గెలుచుకుంది. ఆ సిరీస్‌లో ముంబైలో జరిగిన మ్యాచ్‌ను 4 వికెట్ల తేడాతో, బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌ను ఇన్నింగ్స్, 71 పరుగుల తేడాతో కైవసం చేసుకుంది. సచిన్ టెండూల్కర్ నాటి జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. ఆ సిరీస్‌లో భారత జట్టు అత్యంత పేలవంగా ప్రదర్శన చేసింది. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో ఒక్కసారి కూడా 250 ప్లస్ పరుగుల మార్కును దాటలేకపోయింది. దక్షిణాఫ్రికా సంపూర్ణ ఆధిపత్యం చెలాయించింది. ఈ సిరీస్‌లో పర్యాటక జట్టు అత్యధికంగా 479 స్కోరు నమోదు చేసింది. దీనిని బట్టి దక్షిణాఫ్రికా ఎంత బాగా ఆడిందో అర్థం చేసుకోవచ్చు.
0-3తో క్లీన్ స్వీప్ చేసిన శ్రీలంక
టీమిండియా 1997లో మరింత దారుణంగా 0-3 తేడాతో టెస్ట్ సిరీస్‌ను ఓడిపోయి అవమానకర ఓటమిని మూటగట్టుకుంది. టీమిండియాను శ్రీలంక జట్టు చిత్తుచిత్తుగా ఓడించింది. నాటి జట్టుకు కూడా సచిన్ టెండూల్కర్ కెప్టెన్‌గా ఉన్నాడు. అర్జున్ రణతుంగ నేతృత్వంలోని శ్రీలంక జట్టు సంపూర్ణ ఆధిపత్యం చెలాయించింది. దీంతో అత్యంత అవమానకర రీతిలో టెస్ట్ సిరీస్ ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చింది..