
ఆపరేషన్ సిందూర్ తో పాకిస్థాన్ లోని ఉగ్రశిబిరాలు ముక్కలయ్యాయి. ఉగ్రమూకలను భారత సైన్యం మట్టుబెట్టింది. పక్కా ప్లానింగ్ తో.. పక్కా సమాచారంతో.. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తో భారత్ ఉగ్రవాదుల స్థావరాలపై అటాక్ చేసింది. భారత్ దాడులతో పాకిస్థాన్ కు ఎలాంటి దెబ్బ తగిలింది..? భారత్ టార్గెట్ చేసిన ఉగ్రశిబిరాలు ఏంటి..? అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్ అజార్‌కు ఎలాంటి గుణపాఠం చెప్పారు.?
పాకిస్థాన్ లో ఉగ్రవాద స్థావరాలను పసిగట్టడం ఒక ఎత్తైతే.. వాటిని కచ్ఛితంగా ధ్వంసం చేయడం మరో ఎత్తు. ఎప్పటి నుంచో సేకరించిన సమాచారంతో ఉగ్రశిబిరాలపై భారత్ కన్నేసి ఉంచింది. దాడులు చేసి వాటిని ధ్వంసం చేద్దామన్నా కాస్త ఆలోచించింది. అయితే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత.. భారత్ ఇక ఆలోచించలేదు. పక్కా సమాచారంతో కచ్ఛితమైన టార్గెట్ తో ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది.
పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సిందూర్ పేరుతో జరిపిన ఈ దాడుల్లో పాక్‌లోని 9 కీలక ఉగ్ర స్థావరాలను భారత సైన్యం లక్ష్యంగా చేసుకుంది. అంతర్జాతీయ సరిహద్దుకు 100 కిలోమీటర్ల లోపు ఉన్న క్యాంపులను టార్గెట్ చేసింది. పాకిస్థాన్‌లోని 4, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని 5 స్థావరాలను ధ్వంసం చేసింది. ఇందులో జైషే మహ్మద్‌కు చెందిన నాలుగు, లష్కరే తోయిబాకు చెందిన 4 క్యాంపులు ఉన్నాయి. రెండు హిజ్బుల్ ముజాహిద్దీన్ శిబిరాలు ఉన్నాయి.
అసలు భారత్ ఎక్కడెక్కడ దాడి చేసింది.?. ఇక్కడ ఏ ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోందో ఒకసారి చూద్దాం.
బహవల్‌పూర్‌లోని మర్కజ్ సుబాన్. ఇది సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. జైషే మహ్మద్‌కు చెందిన ప్రధాన కార్యాలయంగా చెబుతారు. మురిద్కేలోని మర్కాజ్ తోయిబా.. సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలోని లష్కరే క్యాంపు కార్యాలయం ఇది. ఇక్కడే ముంబై దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు తలదాచుకున్నారని సమాచారం. సియల్‌కోట్‌లోని మెహ్‌మూనా జోయా.. అంతర్జాతీయ సరిహద్దుకు 15 కి.మీ దూరంలో ఉన్న ఇది హిజ్బుల్ ముజాహిద్దీన్ శిబిరం. కోట్లిలోని మర్కాజ్ అబ్బాస్ ఉగ్ర స్థావరం.. నియంత్రణ రేఖకు 35 కి.మీ. దూరంలో ఈ క్యాంప్ ఉంది. 20 ఏప్రిల్ 2023న పూంచ్‌లో జరిగిన దాడులకు, జూన్ 24న బస్సులో ప్రయాణిస్తున్న అమాయక యాత్రికులపై దాడికి ఇక్కడి ఉగ్రవాదులే కారణం అని సమాచారం. కోట్లిలోని మస్కర్ రహీల్ షహీద్.. పీఓకేలో హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన స్థావరం ఇది.
కొండల ప్రాంతంలో ఉండే ఈ క్యాంప్‌లో నాలుగు గదులు, బరాక్‌లు ఉన్నాయి. వీటిలో పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రి ఉన్నట్లు సమాచారం. ముజఫరాబాద్‌లోని షవాయ్ నల్లాహ్.. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తంగ్ధర్ సెక్టార్‌లో సరిహద్దుకు 30 కిలోమీటర్ల పరిధిలో షవాయ్ లష్కరే క్యాంప్ ఉంది. ఈ ముఠాకు కీలకమైన క్యాంప్ ఇది. ఇక్కడే లష్కరే కేడర్ నియామకాలు, శిక్షణ వంటివి చేపడుతున్నారు. 2000 నుంచి ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నారు. బర్నాలలోని మర్కాజ్ అహ్లే హదిత్ ఉగ్ర స్థావరం.. ఇది లష్కరే తోయిబా ఉగ్ర క్యాంప్. పూంఛ్-రాజౌరి-రియాసీ సెక్టార్‌లోకి లష్కరే ఉగ్రవాదులు, ఆయుధాలను పంపించేందుకు దీన్ని వినియోగిస్తున్నట్లు సమాచారం. ముజఫరాబాద్‌లోని సైద్నా బిలాల్ ఉగ్ర స్థావరం..
పీఓకేలోని జైషే ప్రధాన కేంద్రాల్లో ఇది ఒకటి. ముజఫరాబాద్ రెడ్‌ఫోర్ట్‌కు ఎదురుగా ఉంటుంది. జమ్మూకశ్మీర్‌లోకి ఉగ్రవాదులను తరలించేందుకు వీలుగా దీన్ని రవాణా క్యాంప్‌గా నిర్వహిస్తున్నారు. తెహ్రా కలాన్‌లోని సర్జల్.. జైషే మహ్మద్ ఉగ్ర స్థావరం ఇది. దీన్ని కూడా జమ్మూకశ్మీర్‌లోకి ఉగ్రవాదులను పంపించేందుకు ఉపయోగిస్తున్నారు.
గతంలో పుల్వామా, ఉరి ఉగ్రఘటనలకు సంబంధించి భారత్ సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించింది. ఈ సారి ఏకంగా పాకిస్థాన్ ఆయువు పట్టు పంజాబ్‌లో సైతం దాడులు చేసింది. 1971 యుద్ధం అనంతరం భారత త్రివిధదళాలు సంయుక్తంగా సమన్వయంతో దాడులు నిర్వహించాయి. ఉగ్రవాదుల శిక్షణ వ్యవస్థను సమూలంగా నాశనం చేయడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. ఈ దాడులతో లష్కరే, జైషేకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. ముఖ్యంగా బహవల్‌పూర్‌లోని జైషే ప్రధాన కేంద్రంపై దాడిని భారీ విజయంగా చెప్పొచ్చు. దాడుల్లో ఈ స్థావరం ధ్వంసమైంది.
ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని బహవల్‌పూర్‌లో మర్కజ్ సుబాన్.. జైషే ముఠా హెడ్‌క్వార్టర్. ఈ ఉగ్రశిబిరంలోనే జైషే అనేక ఉగ్ర కుట్రలకు పథక రచన చేసింది. 2019 ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా దాడికి కూడా ఇక్కడే ప్లాన్ చేశారు. ఆ దాడికి పాల్పడిన వారికి ఇక్కడే శిక్షణ అందించారు. ఇప్పుడు ఆ స్థావరాన్ని ధ్వంసం చేశారు.
బహవల్‌పూర్‌లో మర్కజ్ సుబాన్ స్థావరంలో జైషే చీఫ్ మసూద్ అజార్ కుటుంబంలోని 10 మందితో పాటు అతడి మరో నలుగురు అనుచరులు మృతిచెందినట్లు తెలుస్తోంది. ఈ శిబిరాన్ని మసూద్ తన ఇంటిగా కూడా వినియోగిస్తున్నాడు. ప్రస్తుతం జైషే నెంబర్-2గా ఉన్న ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ అస్గర్, మౌలానా అమర్ ఇతరుల కుటుంబసభ్యులు కూడా దీనిలోనే ఉంటున్నట్లు సమాచారం. \
దాదాపు 600 మంది ఉగ్రవాదుల ఇళ్లు కూడా ఈ క్యాంపస్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సిందూర్ లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు అంటున్నారు. మసూద్ అజార్ సోదరి-ఆమె భర్త, మసూద్ మేనల్లుడు-అతడి భార్య, మేనకోడలు, ఐదుగురు చిన్నారులు మృతి చెందినట్లు తెలుస్తోంది. వీరితో పాటు అజార్ అత్యంత సన్నిహితులు నలుగురు మరణించినట్లు సమాచారం.