
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంది భారత్ . పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని…ఉగ్రవాద శిబిరాలపై భారత సాయుధ దళాలు నిర్వహించిన వరుస దాడుల్లో సుమారు 80 మందికి పైగా టెర్రరిస్టులు మరణించారని భద్రతా దళాలు తెలిపాయి. నిషేధిత ఉగ్రవాద సంస్థలైన జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే-ఎ-తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్లతో సంబంధం ఉన్న తొమ్మిది స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది భారత్ సైన్యం. అయితే, సీనియర్ అధికారుల సమాచారం మేరకు ….బహవల్పూర్, మురిద్కేలలో రెండు అతి పెద్ద దాడులు జరిగాయి.. ప్రతి ప్రదేశంలో 25 నుండి 30 మంది ఉగ్రవాదులు మరణించినట్టు తెలుస్తోంది.
1971 యుద్ధం తర్వాత పాకిస్థాన్‌పై మూడు రక్షణ దళాలు కలిసికట్టుగా దాడి చేయడం ఇదే ప్రథమం. అయితే రెండు వారాల క్రితం పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో అత్యధికులు పర్యాటకులు కాగా, మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ శపథం చేశారు. దీనికి అనుగుణంగా, బుధవారం తెల్లవారుజామున 1:44 గంటలకు ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట ఈ సైనిక చర్యలు ప్రారంభమయ్యాయి. “భారత్‌పై ఉగ్రదాడులకు ప్రణాళికలు రచించి, వాటిని అమలు చేస్తున్న పాకిస్థాన్ మరియు పీఓకేలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ఈ ఆపరేషన్ ద్వారా లక్ష్యంగా చేసుకున్నామని” సైన్యం ఒక పత్రికా ప్రకటనలో స్పష్టం చేసింది.
కాగా, భారత్ సైన్యం చేసిన దాడిలో 4 జైషే మహమ్మద్ స్థావరాలు ధ్వంసం అయ్యాయి. పాకిస్తాన్‌లోని బహవల్పూర్లోని మర్కజ్ సుభాన్ అల్లా ప్రాంతంలో ఈ హెడ్‌క్వార్టర్ ఉంది. సుమారు, 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ శిబిరం నుంచే 2019లో పుల్వామా దాడికి ఉగ్రవాదులు ఇక్కడే శిక్షణ పొందారు. అలాగే, మసూద్ అజార్ ఆధీనంలోని ఈ టెర్రర్ క్యాంప్‌ను టార్గెట్ చేసి మరి ధ్వంసం చేసింది భారత ఆర్మీ. ఇక, జైష్ చీఫ్ మౌలానా మసూద్ అజార్, ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ అస్గర్‌తో కలిసి ఈ శిబిరం నుంచే ఉగ్ర కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు.
అయితే, మసూద్ అజార్ ఉండే ప్రదేశాలే లక్ష్యంగా భారత ఆర్మీ మిస్సైల్ దాడులకు దిగింది. బహావల్పూర్లోని ఉగ్ర స్థావరంపై మొదటి దాడి చేసిన ఇండియా.. 30 మంది టెర్రరిస్టులను మట్టుబెట్టింది. లష్కరే తోయిబా ఉగ్రవాద స్థావరాలపైనా క్షిపణులతో దాడులకు దిగింది. భారత్ మిస్సైల్ దాడులతో పాకిస్తాన్ బెంబేలెత్తి పోయింది. 6 చోట్ల దాడి చేసి 24 క్షిపణులను భారత్ ప్రయోగించిందని పాక్ ఆరోపించింది. ఈ దాడుల్లో సుమారు 8 మంది పాకిస్తాన్ ప్రజలు మృతి చెందగా 33 మందికి గాయపడినట్లు పాక్ ఆర్మీ అధికారి తెలిపారు.
పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడికి భారత్ గట్టిగా ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్థాన్ భూభాగంలోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడింది. ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతగా నిర్వహించినట్లు సైన్యం ప్రకటించింది. ఈ మెరుపు దాడులకు సంబంధించిన వివరాలను భారత ఆర్మీ వెల్లడించింది. అయితే ఓఓ వైపు భారత్ గట్టిగానే పాక్‌కు సమాధానం ఇవ్వగా….పాకిస్థాన్ మరోసారి దేశంపై దాడి చేసేందుకు రెడీ అయిందని ఇంటిలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దక్షిణ భారతదేశంలోని ప్రధాన నగరాలైన విజయవాడ, హైదరాబాద్, వైజాగ్‌లను ఉగ్రవాదులు టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఈ మూడు నగరాల్లో పోలీసులుఅలర్ట్ ప్రకటించారు. మరోవైపు ఇవాళ దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఆయా నగరాల నుండి మా ప్రతినిధులను అడిగి తెలుసుకుందాం…
పాకిస్థాన్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత సైనిక దళాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పట్ల ....తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. ఒక భారతీయుడిగా తాను ఎంతో గర్వపడుతున్నానని అన్నారు. ఈ కీలక సమయంలో దేశ ప్రజలందరూ ఏకతాటిపై నిలిచి, జాతీయ ఐక్యతను ప్రదర్శించాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ముఖ్యమంత్రి తన అధికారిక ఎక్స్ ఖాతాలో జైహింద్ అంటూ తన స్పందనను తెలియజేశారు.
ఆపరేషన్ సిందూర్ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని అన్ని ప్రభుత్వ విభాగాలను రేవంత్ రెడ్డి అప్రమత్తం చేశారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ రోజు సాయంత్రం రాష్ట్రంలో నిర్వహించ తలపెట్టిన మాక్‌డ్రిల్ కార్యక్రమాన్ని కూడా ఆయన స్వయంగా పర్యవేక్షించనున్నారు. రాష్ట్ర భద్రతా యంత్రాంగం సంసిద్ధతను సమీక్షించడమే ఈ పర్యవేక్షణ ఉద్దేశంగా తెలుస్తోంది.
అలాగే, ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో రేవంత్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు. తాజా పరిస్థితుల దృష్ట్యా పర్యటనను ముగించుకుని తక్షణమే హైదరాబాద్‌కు తిరిగి రావాల్సిందిగా సూచించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత సైన్యం చేపట్టిన ఈ సాహసోపేత చర్య దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న వేళ, రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తూ తగిన చర్యలు చేపడుతోంది.
పహల్గాంలో అమాయకులపై జరిగిన దారుణ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సాయుధ బలగాలు చేపట్టిన 'ఆపరేషన్ సింధూర్' సైనిక చర్యలో భాగంగా అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది. జమ్మూ కాశ్మీర్‌లోని అఖ్నూర్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన పాకిస్థాన్‌కు చెందిన అత్యాధునిక JF-17 యుద్ధ విమానాన్ని భారత బలగాలు కూల్చివేశాయి. ఈ ఘటన సరిహద్దుల్లో ఉద్రిక్తతలను అనూహ్యంగా పెంచింది. అఖ్నూర్ ప్రాంతంలోని సుంగల్ సమీపంలోని రాజా చక్ గ్రామంలో కూల్చివేయబడిన ఈ JF-17 విమానం శిథిలాలు పడిపోయాయి. పాక్ యుద్ధ విమానం భారత్ గగనతలం వైపు రావడానికి ప్రయత్నించి కూల్చివేతకు గురికావడం 'ఆపరేషన్ సింధూర్' తీవ్రతను చాటి చెబుతోంది.