
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో అమెరికా మధ్యవర్తిత్వం చేస్తూ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి ప్రయత్నిస్తోంది. అమెరికా స్టేట్ సెక్రటరీ మార్కో రూబియో భారత విదేశాంగ మంత్రి జైశంకర్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో మాట్లాడారు. అమెరికా ఎలాంటి దౌత్యపరమైన చర్యలు తీసుకుంటోంది? అమెరికా ఏం చెబుతోంది? భారత్, పాక్ అమెరికా మాట వింటారా..?
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా రంగంలోకి దిగింది. రెండు దేశాలు ఉద్రిక్తలు తగ్గించుకోవాలని తెలిపింది. అమెరికా స్టేట్ సెక్రటరీ మార్కో రూబియో భారత విదేశాంగ మంత్రి జైశంకర్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో విడివిడిగా ఫోన్‌లో మాట్లాడారు. జైశంకర్‌తో మాట్లాడిన రూబియో, పహల్గాం దాడిలో మరణించిన వారి పట్ల సానుభూతి తెలిపారు. ఉగ్రవాదంపై భారత్‌తో సహకారాన్ని కొనసాగిస్తామని చెప్పారు. అదే సమయంలో, భారత్, పాకిస్థాన్ కలిసి ఉద్రిక్తతలు తగ్గించాలని సూచించారు.
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో మాట్లాడిన మార్కో రూబియో, పహల్గాం దాడిని ఖండించాలని, దర్యాప్తులో సహకరించాలని కోరారు. ఈ దాడిని నీచమైన చర్య వర్ణించిన రూబియో, పాకిస్థాన్ భారత్‌తో కలిసి ఉద్రిక్తతలు తగ్గించాలని, నేరుగా సంభాషణలు పునరుద్ధరించాలని సూచించారు. షరీఫ్ మాత్రం భారత్ ఉద్దేశపూరిత, రెచ్చగొట్టే చర్యలు చేస్తోందని ఆరోపించారు. ఈ దాడికి పాకిస్థాన్‌కు సంబంధం లేదని, నిష్పక్షపాత దర్యాప్తు కావాలని కోరారు.
అమెరికా ఈ సంక్షోభంలో రెండు దేశాలతో సమతుల్య వైఖరి అవలంబిస్తోంది. భారత్‌తో ఉగ్రవాద వ్యతిరేక సహకారాన్ని నొక్కిచెప్పిన రూబియో, పాకిస్థాన్‌ను దర్యాప్తులో సహకరించమని కోరారు. అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి టామీ బ్రూస్, రెండు దేశాలతో వివిధ స్థాయిల్లో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. ఇతర దేశాల నాయకులను కూడా ఈ సమస్యపై చర్చలు జరపమని రూబియో ప్రోత్సహించారు. సౌదీ అరేబియా, కువైట్, ఖతర్ వంటి దేశాలు కూడా ఉద్రిక్తతలు తగ్గించాలని కోరాయి. ఈ దౌత్యపరమైన చర్యలపై పాకిస్థాన్ ఆశాలు పెట్టుకుది.
భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ పహల్గాం దాడి చేసినవారు, మద్దతిచ్చినవారు, ప్లాన్ చేసినవారు న్యాయం ముందు తీసుకురావాలని రూబియోతో చెప్పారు. భారత్ తన ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని ఐక్యరాష్ట్ర సమితి సెక్యూరిటీ కౌన్సిల్ సభ్య దేశాలకు వివరించింది. పాకిస్థాన్ మాత్రం భారత్ ఆరోపణలను తిరస్కరించి, ఈ దాడిని భారత్ రాజకీయంగా ఉపయోగిస్తోంది అని ఆరోపించింది. షరీఫ్, ఇండస్ వాటర్ ట్రీటీ సస్పెన్షన్‌ను నీటిని ఆయుధంగా వాడటం అని విమర్శించారు.
అమెరికా గతంలో కూడా భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల్లో మధ్యవర్తిత్వం చేసింది. 2016లో ఉరి ఉగ్రదాడి తర్వాత, అప్పటి స్టేట్ సెక్రటరీ జాన్ కెర్రీ సుష్మా స్వరాజ్‌తో మాట్లాడి ఉద్రిక్తతలు తగ్గించమని కోరారు. 2019లో పుల్వామా దాడి, బాలాకోట్ ఎయిర్‌స్ట్రైక్ తర్వాత కూడా అమెరికా ఇలాంటి దౌత్యపరమైన చర్యలు తీసుకుంది.
రెండు దేశాల మధ్య ఎయిర్‌స్పేస్ ఆంక్షలు విమానయాన రంగంపై గణనీయమైన ప్రభావం చూపాయి. పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ ఇస్లామాబాద్ నుంచి గిల్గిట్, స్కార్డుకు విమానాలను రద్దు చేసింది. భారత విమానాలు యూరప్, ఉత్తర అమెరికా, మిడిల్ ఈస్ట్‌కు అరేబియా సముద్రం గుండా రీరూట్ అవుతున్నాయి, ఇది 2-2.5 గంటలు ఎక్కువ సమయం తీసుకుంటోంది. ఇండిగో ఢిల్లీ-అల్మాటి, తాష్కెంట్ విమానాలను రద్దు చేసింది.
పహల్గాం దాడి తర్వాత భారత్, పాకిస్థాన్ రెండూ తమ ఎయిర్‌స్పేస్‌పై ఆంక్షలు విధించాయి. భారత్ ఏప్రిల్ 30 నుంచి మే 23 వరకు పాకిస్థాన్ విమానాలను తన ఎయిర్‌స్పేస్‌లో నిషేధించింది. ఈ నిషేధం ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ రీజియన్స్‌లో అమలులో ఉంది. పాకిస్థాన్ కూడా కరాచీ, లాహోర్ ఎయిర్‌స్పేస్‌లో మే 1 నుంచి మే 31 వరకు ఉదయం 4 నుంచి 8 గంటల వరకు ఆంక్షలు విధించింది.