ఇండియన్ ఆర్మీ కొత్త స్కెచ్…

విలేజ్ డిఫెన్స్ గార్డ్స్. వినడానికి కొత్తగా ఉన్నా.. విషయం చాలా ఉంది. పహల్గామ్ టెర్రర్ ఎటాక్ తర్వాత.. కశ్మీర్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయ్. సరిహద్దు జిల్లాల్లో ఉగ్రవాదుల కదలికలు పెరిగాయనే అనుమానాలున్నాయ్. దాంతో.. ఇండియన్ ఆర్మీ ఓ కొత్త ప్లాన్ వేసింది. భారత సరిహద్దుల అవతలి నుంచి వచ్చే ఎలాంటి శత్రువైనా సరే.. ఆ సరిహద్దుల్లోనే ఖతమయ్యేలా మన ఆర్మీ పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది. అసలు.. జమ్ముకశ్మీర్‌ సరిహద్దుల్లో ఇండియన్ ఆర్మీ ఏం చేస్తోంది? విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ ఎవరు? వాళ్లకెందుకు ట్రైనింగ్ ఇస్తున్నారు?

భారత శత్రువులెవరైనా సరే.. మన బోర్డర్ దాటాలంటే ఇకపై ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. మన సరిహద్దుల అవతలి నుంచి వచ్చే ఏ శత్రువైనా సరే.. ఆ సరిహద్దుల్లోనే ఖతమయ్యేలా ఇండియన్ ఆర్మీ పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది. ఇందుకోసం.. భారత బలగాలు సరికొత్త ప్లాన్ వేశాయ్. తీవ్రవాదుల్ని ఎదుర్కొనేందుకు.. బోర్డర్ దగ్గర్లో ఉన్న గ్రామస్తులకు ట్రైనింగ్ ఇచ్చి మరీ తుపాకులు అందిస్తోంది.

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. దాంతో.. జమ్ముకశ్మీర్‌లోని కిష్ట్వార్, దోడా, రాజౌరి, పూంచ్ లాంటి జిల్లాల్లో.. భద్రత దృష్ట్యా.. విలేజ్ డిఫెన్స్ గార్డ్స్‌కు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పోలీసులు. ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడులతో.. ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. విలేజ్ డిఫెన్స్ గార్డ్స్.. తమ ఆయుధాలను సమర్థవంతంగా ఉపయోగించేందుకు, అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేందుకు.. ఈ ట్రైనింగ్ ఎంతో కీలకమని పోలీసు అధికారులు చెబుతున్నారు. కొన్ని వారాలుగా.. కిష్ట్వార్, దోడా, ఉధమ్‌పూర్ జిల్లాల్లో టెర్రరిస్టుల యాక్టివిటీ పెరిగింది. గత నెలలో కిష్ట్వార్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు, ఇంకొందరు టెర్రరిస్టులు తప్పించుకొని.. దట్టమైన అడవుల్లో తలదాచుకున్నట్లు అనుమానిస్తున్నారు. దాంతో.. ఈ శిక్షణా కార్యక్రమాలను ముమ్మరం చేశారు. ట్రైనింగ్ తీసుకుంటున్న ఈ విలేజ్ డిఫెన్స్ గార్డ్స్‌ని.. సరిహద్దులకు దగ్గర్లో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో భద్రతను కాపాడేందుకు, ఉగ్రవాదుల నుంచి స్థానికులను రక్షించేందుకు ఏర్పాటు చేశారు. వీరికి.. పోలీసులు, సైన్యమే.. ఆయుధాలతో పాటు శిక్షణ కూడా ఇస్తాయి. ఈ ఆపరేషన్లలో.. ఇండియన్ ఆర్మీ, జమ్మూకశ్మీర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ బృందాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. డ్రోన్లు, హెలికాప్టర్ల సాయంతో ఉగ్రవాదుల కదలికలను గమనిస్తున్నారు.

విలేజ్ డిఫెన్స్ గార్డ్స్‌కి ప్రధానంగా రైఫిళ్లు, ఆటోమేటిక్ ఆయుధాలను సమర్థవంతంగా ఎలా ఉపయోగించాలనే విధానంపై శిక్షణ ఇస్తున్నారు. ఉగ్రవాద దాడుల సమయంలో.. రక్షణాత్మకంగా ఉండటంతో పాటు, వారిపై ఏవిధంగా దాడి చేయాలనే దానికి సంబంధించిన వ్యూహాలను అమలు చేసే పద్ధతుల్ని కూడా నేర్పిస్తున్నారు. సరిహద్దు గ్రామాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు, ఆకస్మిక దాడుల సమయంలో వెంటనే స్పందించడం, అందరితో సమన్వయం చేసుకోవడం ఎలా అనేది కూడా చెబుతున్నారు. బోర్డర్‌ దగ్గరలో అనుమానాస్పద కదలికలను గుర్తించి.. పోలీసులకు, సైన్యానికి సమాచారం అందించడంపైనా శిక్షణ ఇస్తున్నారు. ముఖ్యంగా.. గ్రామీణ, కొండ ప్రాంతాల్లో శారీరకంగా చురుగ్గా ఉండేందుకు ఫిట్‌నెట్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ సెషన్ అంతా.. గ్రామీణ ప్రాంతాల్లోని స్థానిక పోలీస్ స్టేషన్లు, సైనిక శిబిరాల్లో సాగుతున్నాయి. కొన్నిసార్లు.. డ్రోన్ టెక్నాలజీ, రాత్రి పూట గస్తీ లాంటి ఆధునిక టెక్నిక్‌లపైనా శిక్షణ ఇస్తున్నారు. జమ్మూకశ్మీర్ పోలీసులు, భారత సైన్యం, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కలిసి.. విలేజ్ డిఫెన్స్ గార్డ్స్‌కి ట్రైనింగ్ సెషన్స్‌ని నిర్వహిస్తున్నాయి.

పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత.. జమ్మూకశ్మీర్‌లో భద్రతా చర్యలు మరింత కఠినతరమయ్యాయ్. ఈ క్రమంలోనే గ్రామీణ ప్రాంతాల్లో భద్రతను పటిష్టం చేసేందుకు.. ఈ గ్రామ రక్షణ బృందాలను సన్నద్ధం చేయడంపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఈ విలేజ్ డిఫెన్స్ గార్డులకు శిక్షణని తప్పనిసరి చేయడం ద్వారా.. సరిహద్దుల్లో భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఉగ్రవాద బెదిరింపులను ఎదుర్కొనేందుకు.. ప్రభుత్వం, సైన్యం, పోలీసులు సమన్వయంతో పనిచేస్తున్నారు. ఈ శిక్షణా కార్యక్రమాలు.. సరిహద్దు గ్రామాల్లో శాంతి, స్థిరత్వాన్ని పునరుద్ధరించడంలో కీలకపాత్ర పోషిస్తాయని ఆశిస్తున్నారు.

మరోవైపు.. జమ్మూకశ్మీర్ పోలీసులు, సైన్యం కలిసి ఉగ్రవాదులను పూర్తిగా నిర్మూలించేందుకు యాక్షన్ ప్లాన్‌ని వేగవంతం చేశాయి. కిష్ట్వార్‌లోని దట్టమైన అడవుల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. విలేజ్ డిఫెన్స్ గార్డ్స్‌తో పాటు స్థానికులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. అనుమానాస్పద కదలికలను గమనిస్తే.. వెంటనే అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఈ శిక్షణా కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో భద్రతా భావాన్ని పెంపొందించడంతో పాటు, ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టడంలో సహాయపడతాయని అధికారులు భావిస్తున్నారు.