పాకిస్థాన్‌పై భారత్‌ దాడి….

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంది భారత్ . పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని…ఉగ్రవాద శిబిరాలపై భారత సాయుధ దళాలు నిర్వహించిన వరుస దాడుల్లో సుమారు 80 మందికి పైగా టెర్రరిస్టులు మరణించారని భద్రతా దళాలు తెలిపాయి. నిషేధిత ఉగ్రవాద సంస్థలైన జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే-ఎ-తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్‌లతో సంబంధం ఉన్న తొమ్మిది స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది భారత్ సైన్యం. అయితే, సీనియర్ అధికారుల సమాచారం మేరకు ….బహవల్పూర్, మురిద్కేలలో రెండు అతి పెద్ద దాడులు జరిగాయి.. ప్రతి ప్రదేశంలో 25 నుండి 30 మంది ఉగ్రవాదులు మరణించినట్టు తెలుస్తోంది. ఇక, మృతుల సంఖ్యను నిఘా సంస్థలు ఇప్పటికీ ధృవీకరిస్తున్నాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం మొత్తం 80 నుంచి 90 మంది ఉగ్రవాదులు హతమైనట్లు భావిస్తున్నారు. ఈ దాడి తర్వాత భారత సైన్యం న్యాయం జరిగింది అనే సందేశాన్ని వీడియోను ఎక్స్ వేదికగా పోస్టు చేసింది.

1971 యుద్ధం తర్వాత పాకిస్థాన్‌పై మూడు రక్షణ దళాలు కలిసికట్టుగా దాడి చేయడం ఇదే ప్రథమం. అయితే రెండు వారాల క్రితం పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో అత్యధికులు పర్యాటకులు కాగా, మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ శపథం చేశారు. దీనికి అనుగుణంగా, బుధవారం తెల్లవారుజామున 1:44 గంటలకు ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట ఈ సైనిక చర్యలు ప్రారంభమయ్యాయి. “భారత్‌పై ఉగ్రదాడులకు ప్రణాళికలు రచించి, వాటిని అమలు చేస్తున్న పాకిస్థాన్ మరియు పీఓకేలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ఈ ఆపరేషన్ ద్వారా లక్ష్యంగా చేసుకున్నామని” సైన్యం ఒక పత్రికా ప్రకటనలో స్పష్టం చేసింది.

ఈ దాడులలో త్రివిధ దళాలకు చెందిన కచ్చితత్వంతో కూడిన దాడి ఆయుధ వ్యవస్థలను ఉపయోగించినట్లు తెలుస్తోంది… లక్ష్యాన్ని ఛేదించి, విధ్వంసం సృష్టించే కామికేజ్ డ్రోన్లు కూడా ఈ దాడుల్లో వినియోగించారు. మొత్తం తొమ్మిది ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నామని…. అయితే పాకిస్థాన్ సైనిక స్థావరాలపై ఎలాంటి దాడులు జరపలేదని” సైన్యం నొక్కి చెప్పింది. లక్ష్యాల ఎంపికలోనూ, దాడుల నిర్వహణలోనూ… భారత్ చాలా సంయమనం పాటించింది అని సైన్యం పేర్కొంది.

కాగా ధ్వంసం చేసిన తొమ్మిది లక్ష్యాలలో బహవల్పూర్‌లోని జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయం, మురిద్కేలోని లష్కరే తోయిబా స్థావరాలు… ఉన్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రధాని నరేంద్ర మోదీ రాత్రంతా ఈ ఆపరేషన్‌ను స్వయంగా పర్యవేక్షించారు. ఈ ఆపరేషన్ ముగిసిన వెంటనే, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, అమెరికా జాతీయ భద్రతా సలహాదారు……విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోలతో ఫోన్‌లో మాట్లాడి, తీసుకున్న చర్యల గురించి వివరించిన్నారు. ఇక ఆపరేషన్ సిందూర్ పై పూర్తి వివరాలతో కూడిన ప్రకటనను సైన్యం త్వరలోనే విడుదల చేయనుంది.

భారత్‌పై ఉగ్రదాడులు, చొరబాట్ల యత్నాలకు పాల్పడిన చరిత్ర ఉన్న తొమ్మిది ప్రాంతాలను ఈ ఆపరేషన్ కోసం ఎంపిక చేశారు. భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు ఈ స్థావరాలు ఎంత కీలకమైనవో అంచనా వేసి, వాటిని లక్ష్యంగా చేసుకున్నారు. పాకిస్థాన్‌లోని దక్షిణ పంజాబ్‌లో ఉన్న బహవల్పూర్.. మసూద్ అజార్ నేతృత్వంలోని జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు ప్రధాన కేంద్రంగా పేరుగాంచింది. 2001 పార్లమెంట్ దాడి, 2019 పుల్వామా ఆత్మాహుతి దాడి వంటి అనేక దాడులకు ఈ సంస్థ బాధ్యత వహించింది లేదా సంబంధం కలిగి ఉంది.

లాహోర్‌కు సుమారు 40 కిలోమీటర్ల ఉత్తరాన ఉన్న మురిడ్కే, లష్కరే తోయిబా, దాని సేవా విభాగం జమాత్-ఉద్-దవాకు దీర్ఘకాలంగా కీలక స్థావరంగా ఉంది. 200 ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న ఈ ఉగ్రవాద కేంద్రంలో శిక్షణ ప్రాంతాలు, భావజాల వ్యాప్తి కేంద్రాలు, రవాణా సదుపాయాలు ఉన్నాయి. 2008 ముంబై దాడుల వెనుక లష్కరే తోయిబా హస్తం ఉందని భారత్ ఆరోపిస్తోంది. 26/11 దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు ఇక్కడే శిక్షణ పొందారని సమాచారం.

పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని కోట్లి ఆత్మాహుతి బాంబర్లు, తిరుగుబాటుదారులకు ప్రధాన శిక్షణ కేంద్రంగా భారత్ పలుమార్లు గుర్తించింది. అధికార వర్గాల కథనం ప్రకారం, కోట్లి కేంద్రంలో ఒకేసారి 50 మందికి పైగా శిక్షణ పొందే సామర్థ్యం ఉంది. జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి, పూంచ్ ప్రాంతాలలో కార్యకలాపాల కోసం 2023, 2024లో గుల్పూర్‌ను పదేపదే ఫార్వర్డ్ లాంచ్‌ప్యాడ్‌గా ఉపయోగించినట్లు భావిస్తున్నారు. ఈ ప్రాంతాలలో భారత భద్రతా బలగాల కాన్వాయ్‌లు, పౌర లక్ష్యాలపై దాడులు చేసిన ఉగ్రవాదులకు ఈ ప్రదేశం ఒక వేదికగా ఉపయోగపడిందని సమాచారం. ఉత్తర కశ్మీర్‌లోని సోన్‌మార్గ్, గుల్‌మార్గ్ మరియు పహల్గామ్ ప్రాంతాలలో జరిగిన దాడులతో సవాయ్‌కి సంబంధం ఉన్నట్లు గుర్తించారు.

అంతర్జాతీయ సరిహద్దు మరియు నియంత్రణ రేఖకు సమీపంలో ఉన్న సర్జల్ మరియు బర్నాలా చొరబాటుకు కీలక మార్గాలుగా పరిగణించబడుతున్నాయి. సియాల్‌కోట్ సమీపంలోని మెహమూనా శిబిరాన్ని కశ్మీర్‌లో చారిత్రాత్మకంగా చురుకుగా ఉన్న హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ ఉపయోగించుకుంది. ఇటీవలి సంవత్సరాలలో ఈ బృందం క్షీణించినప్పటికీ, సరిహద్దు మీదుగా, ముఖ్యంగా స్థానిక మద్దతు నెట్‌వర్క్‌లు చెక్కుచెదరకుండా ఉన్న మెహమూనా వంటి ప్రాంతాల నుండి మిగిలిన వారికి శిక్షణ ఇస్తున్నారని, నిర్దేశిస్తున్నారని భారత అధికారులు చెబుతున్నారు.