ఆపరేషన్ సింధూర్ ఎలా జరిగింది?

కొట్టడం లేటు అవుతుందేమో కాని.. కొట్టడం మాత్రం మామూలుగా ఉండదు. ఆపరేషన్ సిందూర్ ఇప్పుడు అదే రుజువు చేసింది. పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ దీటైన సమధానం చెప్పింది.. పాకిస్థాన్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై విరుచుకుపడింది. అత్యాధునిక టెక్నాలజీతో .. లక్ష్యాలను గురి తప్పకుండా కొట్టింది. అసలు ఆపరేషన్ సిందూర్ ఎలా జరిగింది..? దీని వెనకు ఎలాంటి ప్లాన్ ఉంది..? ఈ ఆపరేషన్ తో భారత్ ఏం చెబుతోంది..?

భారత దళాలు చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ పాకిస్థాన్ లో వణుకు పెట్టించింది. భారత్ దాడి చేస్తుందని తెలుసు.. కాని ఎప్పుడు చేస్తుంది..? ఎలా చేస్తుందో అని భయపడిన పాకిస్థాన్ కు దాడి చేసింది.. అదీ దిమ్మతిరిగిపోయేలా. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో చనిపోయిన వారికి ఈ దాడుల ద్వారా నిజమైన నివాళి అర్పించింది.

పహల్గామ్ ఘటనకు ప్రతీకారంగా భారత సైన్యం బుధవారం తెల్లవారుజామున 1:04 నుంచి 1:44 గంటల మధ్య ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 ఉగ్రవాద స్థావరాలపై 24 ఖచ్చితమైన మిస్సైల్ దాడులు చేసింది. ఈ ఆపరేషన్‌ను భారత సైన్యం, వైమానిక దళం, నావికా దళం సంయుక్తంగా నిర్వహించాయి. దీనిని భారత గడ్డపై నుంచే చేసిన దాడులను ఆర్మీ ప్రకటించింది.

ఈ దాడులు ఖచ్చితమైనవి, పిన్ పాయింట్ గా జరిగాయని తెలిపింది. పాకిస్థాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోకుండా కేవలం ఉగ్రవాద సంస్థలైన జైష్-ఎ-మహ్మద్, లష్కర్-ఎ-తొయిబా, హిజ్బుల్ ముజాహిదీన్‌ల స్థావరాలపైనే ఈ దాడులు జరిగాయి. ఈ ఆపరేషన్‌లో పాకిస్థాన్‌లోని నాలుగు స్థావరాలు, పీవోకేలోనే ఐదు స్థావరాలపై దాడులు జరిగాయి. బహవల్పూర్‌లోని జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయం, మురిద్కేలోని లష్కరే తోయిబా స్థావరం, సియాల్కోట్‌లోని హిజ్బుల్ ముజాహిదీన్ కంట్రోల్ సెంటర్ వంటి కీలక స్థావరాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడుల్లో స్కల్ప్ క్రూయిజ్ మిస్సైళ్లు, హమ్మర్ స్మార్ట్ బాంబులు, రాఫెల్ ఫైటర్ జెట్‌లు ఉపయోగించబడ్డాయి. ఈ స్థావరాలు పహల్గామ్ దాడి వంటి భారత్‌పై దాడులను ప్లాన్ చేసే కేంద్రాలుగా గుర్తించబడ్డాయి.

భారత రక్షణ మంత్రిత్వ శాఖ, సైన్యం ఈ ఆపరేషన్‌ ద్వారా న్యాయం జరిగిందని అభివర్ణించాయి. తాము పహల్గామ్ దాడికి కారణమైన ఉగ్రవాద స్థావరాలను ఖచ్చితంగా ధ్వంసం చేశామని ఆర్మీ తెలిపింది. కోట్లీలోని అబ్బాస్ క్యాంప్ , గుల్పూర్ క్యాంప్, సియాల్కోట్‌లోని మెహమూనా జోయా క్యాంప్ వంటి లక్ష్యాలను ధ్వంసం చేశామని వివరించింది. అజ్మల్ కసబ్, డేవిడ్ హెడ్లీ శిక్షణ పొందిన మురిద్కేలోని లష్కరే తోయిబా క్యాంప్ ధ్వంసమైన వీడియోలను కల్నల్ సోఫియా ఖురేషీ ప్రదర్శించారు.

ఈ దాడులు ఖచ్చితమైన సమాచారంతో నిర్వహించామన్నారు. ఏప్రిల్ 29న ఉన్నత స్థాయి సమావేశంలో ప్రధాని మోదీ సైన్యానికి పూర్తి స్వాతంత్ర్యం ఇచ్చారు. దాడుల సమయం, లక్ష్యాలను సైన్యమే నిర్ణయించింది. 25 నిమిషాల పాటు జరిగిన ఈ ఆపరేషన్‌లో రాఫెల్ జెట్‌లు, డ్రోన్లు, లాంగ్-రేంజ్ మిస్సైళ్లు ఉపయోగించబడ్డాయి. దాడుల తర్వాత పాకిస్థాన్ లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి సరిహద్దు గ్రామాలపై కాల్పులకు దిగగా, భారత పౌరులు మరణించారు. దీనికి భారత సైన్యం దీటుగా సమాధానం చెప్పింది.

భారత్‌ గతంలో జరిపిన మెరుపుదాడుల కంటే తాజాగా నిర్వహించిన ఆపరేషన్‌ సిందూర్‌ పూర్తిగా భిన్నమైనది. 2016లో ఉరి ఘటన తరువాత నిర్వహించిన మెరుపుదాడులు, 2019లో బాలాకోట్‌ ఎయిర్‌స్ట్రైక్స్‌ సహా గతంలో ఎన్నడూ ఇటువంటి దాడులు చేపట్టలేదు. సాంకేతికపరంగా ఈ ఆపరేషన్‌ అత్యంత బలమైనది.. ఖర్చుతో కూడుకొన్నది. అంతేకాదు.. ఉగ్రవాదం విషయంలో గతంలో అనుసరించిన వైఖరి పూర్తిగా మారిపోయిందనే బలమైన సంకేతం పాక్‌కు వెళ్లింది.

భారీ సంఖ్యలో ఉగ్రవాదులను హతమార్చడంతో.. టెర్రరిస్ట్‌ నెట్‌వర్క్‌లు, వాటి హ్యాండ్లర్లకు తీవ్ర హెచ్చరికలు వెళ్లినట్లైంది. దీంతోపాటు భారత్‌ అవసరమైతే ముందస్తుగా దాడి చేయగలదని.. పాక్‌లోని ఏ లక్ష్యం తమకు దూరం కాదని చెప్పినట్లైంది. దీంతోపాటు ఉగ్రదాడులకు ప్రతిస్పందించడమంటే కేవలం శక్తినే చూపబోమని.. టెర్రరిస్టుల కార్యకలాపాలు, ఇతర వనరుల పునాదులను పెకలించేస్తామని ఈ దాడులతో పేర్కొంది. అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించే 24 ఆయుధాలను భారత్‌ వినియోగించింది. వీటిల్లో క్షిపణులు, బాంబులు, ఆత్మాహుతి డ్రోన్లు ఉన్నాయి. మొత్తం తొమ్మిది ఉగ్రక్యాంప్‌లను ఏకకాలంలో ధ్వంసం చేశాయి. దాదాపు 70 మందికిపైగా ఉగ్రవాదులు మరణించారు. మరో 60 మంది వరకు గాయపడ్డారు.

ఈ దాడి కోసం భారత్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులు ఉపగ్రహ చిత్రాలను, హ్యూమన్‌ ఇంటెలిజెన్స్‌, ఉగ్ర కమ్యూనికేషన్లను విశ్లేషించి.. జైషే మహమ్మద్‌, లష్కరే వినియోగించే కాంప్లెక్స్‌ను గుర్తించారు. వీటితోపాటు ఆ ఉగ్ర సంస్థల ఆయుధ డిపోలను, బ్రెయిన్‌ వాషింగ్‌, స్లీపర్‌ సెల్‌ ప్లానింగ్‌ కేంద్రాలను నిర్ధరించుకున్నారు. ఇక సరిహద్దులకు అత్యంత సమీపంలో ఉన్న స్థావరాలపై మానవ రహిత విమానాలతో కొన్ని రోజులుగా నిఘా ఉంచారు.

ఆయుధాల ఎంపికలో కూడా అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలు ఛేదించేవాటినే ఎంచుకొన్నారు. స్కాల్ప్‌ క్రూజ్‌ మిసైల్‌, హ్యామర్‌ గైడెడ్‌ బాంబులు, ఆత్మాహుతి డ్రోన్లను ఎంచుకొన్నారు. దాదాపు 25 నిమిషాలపాటు జరిగిన ఈ ఆపరేషన్‌లో అంతర్జాతీయ సరిహద్దులకు దాదాపు 100 కిలోమీటర్ల దూరంలోని బవహల్పూర్‌ జైషే క్యాంప్‌ సహా పలు స్థావరాలను నేల మట్టం చేసింది. ఇక్కడ పాక్‌ ఆర్మీ రెజిమెంటల్‌ సెంటర్‌ కూడా ఉంది.

పాకిస్థాన్‌లో అత్యంత శక్తిమంతమైన పంజాబ్‌ ప్రావిన్స్‌లోనే నాలుగు టెర్రర్‌ క్యాంప్‌లను నేలమట్టం చేశారు. రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ ఈ దాడులను హనుమంతుడి లంకా దహనంతో పోల్చారు. తమని కొట్టిన వారిని మాత్రమే కొట్టామని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే సైన్యాన్ని అభినందించారు. ఈ సమయంలో ఐక్యత అవసరమని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా, బ్రిటన్, జపాన్, ఫ్రాన్స్ భారత్‌కు మద్దతు తెలిపాయి.