హాలీవుడ్ కే సినిమా చూపిస్తున్న ట్రంప్…

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ బాంబు అయిపోయాయి అనుకున్న సమయంలో మరో బాంబు విసిరారు. అయితే ఇది మరోదేశంపై కాదు.. సొంత దేశంలోని హాలీవుడ్ పై.. ఈ సారి ట్రంప్ అమెరికాలో సినిమా రంగంపై గురిపెట్టారు. అసలు ట్రంప్ మామ కన్ను సినిమాలపై ఎందుకు పడింది..? ఎందుకు హాలీవుడ్ పై ఎందుకు ఆగ్రహంగా ఉన్నారు..? సినిమాలపై ఎలాంటి టారిఫ్ లు విధించనున్నారు..? దీని వల్ల ఇంగ్లీష్ సినిమాలపై ఎలాంటి ప్రభావం పడనుంది..?

ట్రంప్ తన టారిఫ్‌లతో ప్రపంచ దేశాలతో పాటు హాలీవుడ్‌ను కూడా భయపెడుతున్నారు. 2025 జనవరిలో రెండో సారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్, ఏప్రిల్ 2న లిబరేషన్ డేగా ప్రకటించి, అన్ని దేశాల నుంచి దిగుమతయ్యే వస్తువులపై 10 శాతం బేస్‌లైన్ టారిఫ్, అమెరికాతో భారీ వాణిజ్య లోటు ఉన్న దేశాలపై 49 శాతం వరకు రిసిప్రొకల్ టారిఫ్‌లు విధించారు. చైనాపై 145 శాతం, కెనడా, మెక్సికోపై 25 శాతం, యూరోపియన్ యూనియన్‌పై 20 శాతం, జపాన్‌పై 24 శాతం, వియత్నాంపై 46 శాతం టారిఫ్‌లు ప్రకటించారు. ఈ టారిఫ్‌లు అమెరికా సగటు టారిఫ్ రేటును 2.5 శాతం నుంచి 27 శాతానికి పెంచాయి. ఇది గత శతాబ్దంలో అత్యధికం. దీని వల్ల అమెరికాలో ప్రతీ ఇంటిపై సగటున 1,300 డాలర్ల అదనపు ఖర్చు, దిగుమతుల్లో 23 శాతం తగ్గుదల, ఆర్థిక వృద్ధి 0.8 శాతం తగ్గుదల కనిపిస్తుందని టాక్స్ ఫౌండేషన్ అంచనా వేసింది. ఏప్రిల్ 8న చైనా మినహా ఇతర దేశాలపై టారిఫ్‌లను 90 రోజులపాటు నిలిపివేశారు. దీంతో ట్రంప్ శాంతించారు అనుకున్నారు. కాని ఇప్పుడు ట్రంప్ హాలివుడ్ పై గురి పెట్టారు. ట్రంప్ విదేశాల్లో నిర్మించిన సినిమాలపై 100 శాతం టారిఫ్‌లు విధిస్తున్నట్లు ప్రకటించారు. అమెరికాలో చనిపోతోన్న సినీ పరిశ్రమను కాపడటానికి, హాలీవుడ్‌ను రక్షించడానికి ఈ టారిఫ్ లు తప్పదని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో రాశారు. ఈ టారిఫ్‌లు ప్రపంచ దేశాలతో పాటు సినీ పరిశ్రమలోనూ అలజడి సృష్టించాయి.

ట్రంప్ విదేశాల్లో నిర్మించిన సినిమాలపై 100 శాతం టారిఫ్‌లు విధిస్తామని ప్రకటించారు. అయితే దీని వెనుక అమెరికా సినీ పరిశ్రమ విదేశాలకు తరలిపోవడమే ప్రధాన కారణమని చెబుతున్నారు. లాస్ ఏంజిల్స్‌లో చిత్రీకరణలు 40 శాతం తగ్గాయని తాజా నివేదికలు ట్రంప్ చర్యలకు కారణంగా కూడా చూడొచ్చు. కెనడా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి దేశాలు షూటింగ్ లకు టాక్స్ రాయితీలు, ఆర్థిక సహాయం ఇవ్వడం వల్ల అమెరికన్ స్టూడియోలు అక్కడ చిత్రీకరణలు చేస్తున్నాయి. ఆస్ట్రేలియా 2019 నుంచి 540 మిలియన్ డాలర్ల టాక్స్ రాయితీలు ఇచ్చింది. దీంతో థోర్: లవ్ అండ్ థండర్, గాడ్‌జిల్లా వర్సెస్ కాంగ్ లాంటి చిత్రాలు అక్కడ చిత్రీకరించబడ్డాయి. దీనిని ఇతర దేశాలు అమెరికా సినీ సామర్థ్యాలను ఇతర దేశాలు దొంగిలిస్తున్నాయని అని విమర్శించారు. అమెరికా సినీ పరిశ్రమ చనిపోతోందని… ఇతర దేశాలు మన నిర్మాతలను ఆకర్షిస్తున్నారని ట్రూత్ సోషల్‌లో ట్రంప్ రాసుకొచ్చారు. ఇది జాతీయ భద్రతకు ముప్పు, ప్రచారంతో కూడిన కుట్ర అని అన్నారు.

విదేశీ సినిమాలు అమెరికా సంస్కృతిని ప్రభావితం చేసే కుట్రగా ఉన్నాయని ట్రంప్ ఆరోపించారు. విదేశీ సినిమాలు అమెరికన్ ప్రేక్షకులను ప్రభావితం చేస్తున్నాయని ట్రూత్ పోస్టులో ట్రంప్ రాశారు. ఈ కుట్రలో విదేశాలు ఉద్దేశపూర్వకంగా అమెరికా సినీ పరిశ్రమను బలహీనపరిచి, సాంస్కృతికంగా ప్రభావం చూపే చిత్రాలను విడుదల చేస్తున్నాయని ఆరోపించారు. ఈ పరిణామాలు జాతీయ భద్రతకు ముప్పుగా చూపించి, వాణిజ్య శాఖకు వెంటనే టారిఫ్ లు అమలు చేయాలని ఆదేశించారు. గతంలో ట్రంప్ జాన్ వాయిట్, మెల్ గిబ్సన్, సిల్వెస్టర్ స్టాలోన్‌ వంటి ఇంగ్లీష్ హీరోలను హాలీవుడ్‌ను పునరుద్ధరించడానికి రాయబారులుగా నియమించారు. ఇప్పుడు టారిఫ్ ల ద్వారా హాలీవుడ్‌ను మళ్లీ గొప్పగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకునట్టు చెబుతున్నారు. అయితే ఈ టారిఫ్‌లు స్వతంత్ర చిత్ర నిర్మాతలను, అంతర్జాతీయ సినిమాలను దెబ్బతీస్తాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అమెరికన్ స్టూడియోలు విదేశాల్లో చిత్రీకరించిన చిత్రాలపై టారిఫ్‌లు విధించడం వల్ల హాలీవుడ్‌కే నష్టం వాటిల్లవచ్చని అంటున్నారు. ఈ టారిఫ్‌ల అమలు ఎలా జరుగుతుందనే వివరాలు ఇంకా స్పష్టంగా లేవు, కానీ ట్రంప్ విధానం సినీ పరిశ్రమలో ఆందోళన కలిగిస్తోంది. ట్రంప్ టారిఫ్‌ల వల్ల ఇంగ్లీష్ సినిమాల టికెట్ ధరలు పెరిగే అవకాశం ఉంది. తెలుగు సినిమాల విడుదల ఖర్చును కూడా పెంచవచ్చు. అమెరికన్ స్టూడియోలు విదేశాల్లో చిత్రీకరించిన అవతార్, మిషన్ ఇంపాసిబుల్ లాంటి చిత్రాలు కూడా టారిఫ్‌ల కిందకు వస్తాయి, ఇది హాలీవుడ్‌కు ఆర్థిక ఇబ్బంది కలిగించవచ్చు.

ఇప్పటికే ట్రంప్ టారిఫ్‌లకు ప్రపంచ దేశాలు రకరకాల రీతుల్లో స్పందించాయి. చైనా 125 శాతం ప్రతీకార టారిఫ్‌లు విధించి, అరుదైన ఖనిజాల ఎగుమతులను పరిమితం చేసింది. కెనడా, యూరోపియన్ యూనియన్ 330 బిలియన్ డాలర్ల అమెరికా ఎగుమతులపై ప్రతీకార టారిఫ్‌లు విధించింది. దీనితో అమెరికా స్టాక్ మార్కెట్‌లు 2020 తర్వాత అత్యంత ఘోరమైన పతనాన్ని చవిచూశాయి. భారతదేశం ప్రతీకార టారిఫ్‌లకు బదులు చర్చలను ఎంచుకుంది. ఏప్రిల్ 17న అమెరికా ఈథేన్‌పై దిగుమతి పన్ను తొలగించే ఆలోచన చేస్తున్నట్లు ప్రకటించింది. ఇజ్రాయెల్ 17 శాతం టారిఫ్‌లను ఎదుర్కొన్న తర్వాత, అమెరికా వస్తువులపై అన్ని టారిఫ్‌లను తొలగించేందుకు ఒప్పుకుంది. ట్రంప్ ఈ టారిఫ్‌లను అమెరికా ఫస్ట్ విధానంగా, వాణిజ్య లోటు తగ్గించడానికి, స్థానిక తయారీని ప్రోత్సహించడానికి తీసుకున్నట్లు చెప్పారు. కానీ గ్లోబల్ సప్లై చైన్‌లు దెబ్బతినడం, వినియోగదారుల ధరలు పెరగడం వల్ల విమర్శలు వచ్చాయి. ఇప్పుడు హాలివుడ్ పై అమెరికా టారిఫ్ లు ఎలాంటి ప్రభావం చూపిస్తాయనే చర్చ మొదలైంది. ఈ టారిఫ్‌లు అమెరికా సినీ పరిశ్రమతో పాటు వాణిజ్య రంగంలో దీర్ఘకాలిక ప్రభావం చూపవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.