90 రోజుల ఆగిన ట్రంప్ …

సుంకాలతో ప్రపంచ దేశాలను వణికించిన ట్రంప్ ప్లేట్ ఫిరాయించాడు. చైనా మినహా అన్ని దేశాలపై విధించిన ప్రతీకార శుంకాల్ని 90 రోజులపాటు నిలిపివేశాడు. ఈ శుంకాలను 10 శాతానికి తగ్గించాడు. గత వారం రోజుల్లో ప్రపంచ మార్కెట్లు కుదేలయ్యాయి. స్టాక్ మార్కెట్లు దాదాపు 5 నుంచి 10 శాతం పడిపోయాయి. ఈ ఒత్తిడి ట్రంప్ ను ఆలోచనలో పడేసిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు ట్రంప్ నిర్ణయం వెనక మార్కెట్ బాండ్ల పాత్ర ఏంటి? ట్రంప్ స్వయంగా బాండ్ మార్కెట్ ను చూస్తున్నానని చెప్పాడు. ఏప్రిల్ 8 నాటికి అమెరికా 10 ఏళ్ల ట్రెజరీ బాండ్ల ఈల్డ్ 4.45 శాతానికి చేరింది. ఇది గత కొన్ని రోజుల్లో 4 శాతం కంటే తక్కువగా ఉంది. బాండ్ ఈల్డ్ పెరగడం అంటే ప్రభుత్వ రుణ ఖర్చు పెరుగుతోందని అర్థం. ఈ ఒత్తిడి ట్రంప్ ను వెనక్కి తగ్గేలా చేసిందా అనే మాట వినిపిస్తోంది.

బాండ్లు అంటే ప్రభుత్వం లేదా కంపెనీలు రుణం తీసుకునే సాధనాలు. ఇవి మార్కెట్లో కొనుగోలు, అమ్మకాలు జరుగుతాయి. బాండ్ ధరలు పడిపోతే.. ఈల్డ్ పెరుగుతుంది. ట్రంప్ శుంకాల వల్ల మార్కెట్లలో భయం పెరిగి.. బాండ్లపై ఒత్తిడి వచ్చింది. ఈ ఒత్తిడి వల్ల ఆర్థిక వ్యవస్థలో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ట్రంప్ భయపడ్డాడని నిపుణులు అంటున్నారు. మరోవైపు ట్రంప్ చైనాపై శుంకాలను 125 శాతానికి పెంచాడు. దీనికి కారణం.. చైనా ట్రంప్ హెచ్చరికలను పట్టించుకోకుండా 84 శాతం ప్రతీకార శుంకాలు విధించింది. ఇది ట్రంప్ ఈగోను హర్ట్ చేసింది. దీంతో మిగిలిన దేశాలపై శుంకాలు 90 రోజులు నిలుపుదల చేసినా.. చైనాకు మాత్రం శుంకాలు విధిస్తున్నారు. చైనాతో దీర్ఘకాల వాణిజ్య యుద్ధంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నాడు.

ట్రంప్ నిర్ణయాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకించింది. ఏప్రిల్ 4న 34 శాతం శుంకాలతో ప్రతీకారం తీర్చుకుంది. ఇప్పుడు 125 శాతం శుంకాలకు బదులుగా మరింత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అమెరికా కంపెనీలపై ఆంక్షలు, రేర్ ఎర్త్ ఎగుమతులపై నియంత్రణలు విధించే అవకాశం ఉందని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ట్రంప్ కొత్త నిర్ణయం తర్వాత మార్కెట్లు ఊపిరి పీల్చుకున్నాయి. ఎస్ అండ్ పీ 500 సూచీ 9 శాతం పెరిగింది. బాండ్ ఈల్డ్ కాస్త తగ్గింది. కానీ చైనాతో వాణిజ్య యుద్ధం మాత్రం ముదురుతోంది. ఈ 90 రోజుల్లో ఇతర దేశాలతో చర్చలు జరిగి శుంకాలు తగ్గితే.. ఆర్థిక వ్యవస్థకు కొంత ఊరట లభిస్తుంది.