
సమ్మర్ లో సర్రుమనిపించే ఎండల్లో.. బయట ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఆ వేడి ప్రభావం వృద్ధులు, పిల్లల్లో ఎక్కువగా ఉండి డీహైడ్రేషన్‌కు దారి తీసి వడదెబ్బకు కారణమవుతుంది. ఇటువంటప్పుడు బయటకు వెళ్ళేవారే కాదు ఇంట్లో ఉన్నవాళ్లు కూడా సరైన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
- ఇంట్లో ఉన్నప్పుడు ఏసీ లేదా ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటు చేసుకొని, వేడి ఏర్పడకుండా.. చల్లని ప్రదేశంలో ఉండాలి.
- ఇంట్లోకి వేడి గాలులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వడగాల్పులు ఇంట్లోకి రాకుండా కర్టెన్లు వాడాలి.
- రోజుకు 7 నుంచి 8 గ్లాసుల నీళ్లు తాగాలి. కేవలం నీళ్లు మాత్రమే కాకుండా ఉప్పు కలిపిన నిమ్మరసం లేదా మజ్జిగ, కొబ్బరినీళ్లు తీసుకుంటే ఎలక్ట్రోలైట్స్ అంది వడదెబ్బ బారిన పడకుండా ఉండవచ్చు.
- ఈ కాలంలో కలుషిత నీళ్లు ముప్పు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కడపడితే అక్కడ నీళ్లు తాగడం మంచిది కాదు. బయటకు వెళ్లినప్పుడు ఇంటి నుంచి బాటిల్లో నీళ్లు తీసుకువెళ్లడం ఉత్తమం.
- అధిక ఉష్ణోగ్రతలకు ఆహారం త్వరగా చెడిపోతుంది. కాబట్టి బయట ఫుడ్ తినడం మానేయాలి. ఎప్పుడు తాజాగా వండిన ఆహారం తీసుకోవాలి.
- మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలి. బీపీ రోగులు సైతం డీహైడ్రేషన్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
- ఎండాకాలంలో వదులుగా ఉండే కాటన్ దుస్తులనే ధరించాలి. చెమటను పీల్చి శరీరం చల్లబడేటట్లు ఇవి చేస్తాయి.
- ఉదయం 10 తర్వాత మధ్యాహ్నం 3 గంటలలోపు ఎండలో తిరగకపోవడం ఉత్తమం. బయటకు వెళ్తే తలకు టోపీ లేదా గొడుగు తీసుకెళ్లడం. కళ్లకు కూలింగ్ అద్దాలు పెట్టుకోవడం మంచిది.
- ఈ కాలంలో జ్వరం, విరేచనాలు కావడం, వాంతులు, అపస్మారక స్థితిలో ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించాలి.