పూజ చేసేటప్పుడు.. ఇవి వద్దు..!

మన హిందూ సంప్రదాయంలో పూజకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. నిత్యం విడిగా విధిగా.. దేవుడికి లేదా దేవతలకు పూజ చేస్తూనే ఉంటాం. ఉదయం, సాయంత్రం ఇళ్లలో రెండు పూటలా పూజ చేస్తూనే వారిని చూస్తూనే ఉంటాం. ఏ దేవుడ్ని అయినా సరే భక్తితో పూజిస్తే.. కుటుంబంలో ఎల్లప్పుడూ ప్రశాంతత చేకూరి.. అభివృద్ధి సంతరించుకుంటుంది. భగవంతుని అనుగ్రహం పొందేందుకే కదా.. భక్తులందరూ విధిగా పూజలు చేస్తారు లేదంటే గుళ్ళకు వెళ్తారు.

అయితే సరైన సమయంలో, సరైన నియమాలతో పూజ చేసినప్పుడే కదా.. ఆ పూజకు సార్థకత లభించేది. మరీ పూజలో విధిగా పాటించేవి.. పాటించకూడనివి ఏంటో తెలుసుకుందామా…

సాధారణంగా కొందరు ఏ సమయంలో అంటే ఆ సమయంలో పూజ చేస్తారు. అలా చేయడం నిజానికి అశుభం. దైవారాధనకు సంబంధించిన అనేక నియమాలు మన పురాణ గ్రంథాల్లో పేర్కొనడమైంది.

హిందూ ధర్మంలో కొన్ని విశ్వాసాల ప్రకారం పూజ చేసే సమయాలు వేర్వేరుగా ఉంటాయి. తెల్లవారుజామున 04:30 నుంచి 5:00 గంటల వరకు మొదటి పూజ చేయవచ్చు. బ్రహ్మ ముహూర్తంలో చేసే ఈ పూజ చాలా విశిష్టమైనది.

  • ఉదయం 09:00 గంటల నుంచి రెండో పూజ.. మధ్యాహ్నం 12:00 గంటల నుంచి మధ్యాహ్న పూజ..
  • సాయంత్రం 04:30 నుంచి 6:00 గంటల వరకు పూజ చేస్తారు.
  • ఇక ముగింపుగా శయన పూజ రాత్రి 9:00 గంటలకు చేయవచ్చు.
  • ఇక్కడ పేర్కొన్న సమయాలలో ఏ సమయంలో అయినా సరే.. తగిన స్తోత్రాలతో, నామాలతో మనం దేవుడ్ని ఆరాధించవచ్చు.
  • కానీ మధ్యాహ్న సమయంలో మాత్రం పూజ చేయకూడదు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య అసలు పూజలు చేయకూడదు. ఈ సమయంలో పూజ చేసినా కూడా ఫలితం ఉండదు.

పూజ సమయంలో ఎల్లప్పుడూ మన ముఖాన్ని తూర్పు లేదా ఉత్తరం వైపు ఉంచాలి. తూర్పు లేదా ఉత్తరం ముఖంగా పూజించడం వల్ల ఇంట్లో సంతోషం కలుగుతుంది. పూజ సమయంలో కుడివైపున గంట, ధూపం, దీపం, అగరువత్తులు, పూజ సామగ్రిని ఉంచాలి. దేవుడి మీద ధ్యాస ఉంచడం తప్పనిసరి.