పూజలో వాడిన పువ్వులను పడేయకూడదు..?!

ప్రతి నిత్యం దీపారాధన చేస్తుంటాం. ఈ క్రతువులో పువ్వులతో దేవతామూర్తులను అలకరించడం, ఇంట్లో ఉన్న గుడి గోపురాన్ని అందంగా పూలతో నింపేయడం చేస్తుంటాం. అయితే పూజలో సమర్పించే ఈ పుష్పాల విషయంలో అందరికీ ఒక సందేహం ఉంటుంది. పువ్వులను వాడిన తరువాత వాటిని తిరిగి ఉపయోగించుకుంటే బాగుంటుంది కదా.. అసలు దేవుడికి సమర్పించిన తరువాత వాడిపోయిన పువ్వులను ఏం చేయాలి? అంటే..

పూజ కోసం వాడిన పువ్వులను చాలామంది తర్వాతి రోజున పడేస్తుంటారు. ఇలా చేయడం మంచిది కాదట. ఒక్క విషయం గమనిస్తే మనం.. గణేష్ చతుర్థి.. బతుకమ్మ లాంటి పర్వదినాల్లో పూలను.. విగ్రహమూర్తులతో పాటుగా చెరువుల్లో, పారే నదిలో, నీటిలో వదిలేస్తుంటాం కదా..

దీని వెనుక ఆంతర్యం ఏంటంటే దేవుడి పూజకు వాడిన పువ్వులను ఎక్కడంటే అక్కడ వేస్తే వాటిని తొక్కుతామని.. దానివల్ల మనకు తెలియకుండానే పాపపు కార్యం చేసినవారం అవుతాం.
అయితే ఇలా నదిలో, నీటిలోనూ పువ్వులను వేసేందుకు వీలు అవ్వనప్పుడు..

దేవుడి పూజ కోసం వాడిన పువ్వులను చక్కగా కంపోస్ట్ తయారు చెయ్యడం మేలు. పైగా సులువు కూడా. కంపోస్ట్ అంటే మళ్ళీ ఇతర వ్యర్థాలతో పువ్వులను కలపడం కాదు. పువ్వులను ఏదైనా చెట్టు మొదట్లో లేదా మట్టిలో కలపాలి. ఇది మట్టికి సహజ పోషణను ఇస్తుంది. ఆ మట్టిలో నాటిన మొక్కలలో పచ్చదనం పెంచుతుంది.

దేవుడి పూజకు వాడిన పువ్వులను ఈ మధ్యన ధూప్ స్టిక్స్, కోన్స్, పెర్ఫ్యూమ్స్ ను తయారు చేయడం కోసం ఉపయోగిస్తూ ఉండటం చూస్తూనే ఉన్నాం. కాబట్టి దేవుడి పూజ కోసం వాడిన పూలను తిరిగి ఇంట్లో సువాసన కోసం, మొక్కల పెంపకం కోసం ఉపయోగించవచ్చు.