
క్రియేటీవ్ డైరెక్టర్ అనగానే ఠక్కున కృష్ణవంశీ గుర్తొస్తారు. ఇప్పటి వరకు ఎన్నో విభిన్న కథా చిత్రాలు అందించాడు. అన్నింటికీ మించి సినిమా ద్వారా ఏదైనా మంచి చెప్పాలని తపిస్తుంటాడు. సినిమాను ఒక యజ్ఞంలా భావించి తీస్తుంటాడు. అందుకనే.. కృష్ణవంశీతో ఒక్క సినిమా అయినా చేయాలి అనుకుంటారు. ఇదిలా ఉంటే.. కృష్ణవంశీ రైతు అనే సినిమాను ఎప్పుడో ప్రకటించాడు. ఇంత వరకు అది ఏమైందో క్లారిటీ లేదు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే కృష్ణవంశీని నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇవ్వడం ఆసక్తిగా మారింది. ఇంతకీ.. ఏం అడిగారు..? ఏం చెప్పారు..?
జూనీయర్ ఎన్టీఆర్ తో రైతు అనే సినిమా చేయాలి అనుకున్నారు కదా అని అడిగితే.. ఇప్పుడు ఎన్టీఆర్ ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగారు. ఇప్పుడు ఆయన స్థాయికి నేను సరిపోను అని చెప్పడం ఆసక్తిగా మారింది. వీరిద్దరూ కలిసి రాఖీ అనే సినిమా చేశారు. ఆ సినిమా ఇద్దరికీ మంచి పేరు తీసుకువచ్చింది. ఆతర్వాత ఇద్దరూ మరో సినిమా చేయలేదు. అలాగే నాగచైతన్యతో నిన్నే పెళ్లాడతా రీమేక్, నాగచైతన్య, ఎన్టీఆర్ లతో గుండమ్మకథ ఈ రెండింటిలో ఏది చేస్తారంటే.. 150 కోట్లు పట్టుకుని వచ్చేయండి.. దుల్లకొట్టేద్దాం అని కృష్ణవంశీ చెప్పడం విశేషం.
అలాగే నాగచైతన్య, అఖిల్ లతో సినిమా చేయండి అని నెటిజన్ చెప్పిన మాటకు అలాగే అనే సమాధానం ఇవ్వడం బట్టి చూస్తుంటే.. ఈ ఇద్దరి కాంబోలో సినిమా చేయాలనే ఆలోచన ఉందని అర్ధమౌతుంది. ఆపద్భాంధుడు లాంటి సినిమా చేయండి అంటే.. మంచి ఆలోచన అన్నయ్య చిరంజీవితో మీరే చెప్పండి అని సమాధానం ఇచ్చారు ఈ క్రియేటీవ్ డైరెక్టర్. రంగమార్తాండ సినిమా మంచి పేరు తీసుకువచ్చింది కానీ.. కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు. దీంతో నెక్ట్స్ మూవీ ఏంటి అనేది సస్పెన్స్ గానే ఉంది. మరి.. ఈ క్రియేటీవ్ డైరెక్టర్ ఎప్పుడు సినిమా చేస్తారో.. ఎప్పుడు సక్సెస్ అందిస్తారో చూడాలి.