రజినీ, ఎన్టీఆర్ రెండు సార్లు పోటీపడనున్నారా?

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్.. వీరిద్దరూ బాక్సాఫీస్ దగ్గర పోటీపడనున్నారనే వార్త ఇటు టాలీవుడ్, ఇటు కోలీవుడ్ లోనే కాదు.. బాలీవుడ్ లో సైతం హాట్ టాపిక్ అయ్యింది. నిజంగా పోటీపడతారా..? లేక ఎవరైనా పోటీ నుంచి తప్పుకుంటారా అంటే.. తగ్గేదేలే.. బాక్సాఫీస్ దగ్గర పోటీ ఖాయం అని టాక్ బలంగా వినిపిస్తోంది. అయితే.. ఈ పోటీ ఒక్కసారే కాదు.. ఈ ఇద్దరు క్రేజీ స్టార్లు రెండు సార్లు బాక్సాఫీస్ దగ్గర పోటీపడనున్నారని ప్రచారం జరుగుతుంది. ఇంతకీ.. ఇది నిజమేనా..? అసలు ఏం జరుగుతోంది..?

రజినీకాంత్ నటిస్తోన్న కూలీ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. అ క్రేజీ మూవీని ఆగష్టు 14న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. అయితే.. అదే రోజున బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న క్రేజీ స్పై యాక్షన్ థ్రిల్లర్ వార్ 2 కూడా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో పాటు టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. దీంతో ఈ సినిమా పై భారీగా క్రేజ్ ఏర్పడింది. కూలీ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తుంటే.. వార్ 2 మూవీని యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తుంది. ఈ రెండు నిర్మాణ సంస్థలు తమ చిత్రాన్ని ఆగష్టు 14నే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు.

ఇక రజినీ, ఎన్టీఆర్ మధ్య రెండోసారి పోటీ ఏంటంటే.. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో మూవీ చేస్తున్నాడు. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. ఎన్టీఆర్ ఈ నెల 22 నుంచి ఈ మూవీ షూట్ లో జాయిన్ అవుతాడు. ఈ సినిమాను జనవరి 9న రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. అదే రోజున కోలీవుడ్ స్టార్ విజయ్ ఆఖరి చిత్రం జన నాయగన్ వస్తుండడంతో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీని జనవరి 9న కాకుండా ఏప్రిల్ 9న రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట. ఇక రజినీ మూవీ విషయానికి వస్తే.. కూలీ తర్వాత నెల్సన్ డైరెక్షన్ లో జైలర్ 2 చేయనున్నాడు. ఈ నెలలోనే షూటింగ్ స్టార్ట్ చేయనున్నాడు. ఈ సినిమాను కూడా నెక్ట్స్ ఇయర్ ఏప్రిల్ లో రిలీజ్ చేయాలి అనేది ప్లాన్. అందుచేత నెక్ట్స్ ఇయర్ ఏప్రిల్ లో రజినీ, ఎన్టీఆర్ మరోసారి పోటీపడడం ఖాయం అని టాక్ వినిపిస్తోంది. అయితే.. నిజంగా పోటీపడతారా..? లేక కొంత గ్యాప్ తర్వాత ఈ రెండు సినిమాలను రిలీజ్ చేస్తారా అనేది తెలియాల్సివుంది.