భారత్ న్యూస్ అమరావతిరిపోర్టర్ ఆకుల సతీష్..ఇంకా ఆకలిరాజ్యమే!?


నిన్న ఆహారదినోత్సవం…
నేడు పేదరిక నిర్మూలన దినం..
అర్థం ఒకటే..
వ్యర్థం ఆపడమే..
అదే లేదు..ఉంటే కథే వేరు!

ఈ సృష్టిలో
రెండంటే రెండే
గొప్ప ఆవిష్కరణలు..
దేవుడు సృష్టించిన ఆకలి..
మనిషి సృష్టించిన డబ్బు..
ఈ రెండూ లేకపోతే
కష్టం ఉండదు..
నష్టం ఉండదు
నికృష్టం ఉండదు..!

ఉన్నవాడికి అరగని జబ్బు
లేనివాడికి ఆకలి జబ్బు..
ఉండీ లేని మధ్యరకానికి
చాలీ చాలని జబ్బురా
ఒకటే అప్పుల జబ్బురా..!

పేదరిక నిర్మూలన..
పుట్టినప్పటి నుంచి
వింటున్న మాట..
నిండుతున్న
బడాబాబుల మూట..
పేదోడిని ఉద్ధరించడానికి
ఎన్నో పథకాలు..
నిజానికి అవి పాలకుల
జేబు నింపే ప్రణాళికలు!

ఇంకా అన్నం దొరకని జనం ఉన్న దేశాలెన్నో..
క్షుద్బాధతో అలమటించే జనాభా వంద కోట్లు..
అటు చూడు సోమాలియా
వినిపించడం లేదా
ఆకలికేకలు..
ఖజకిస్తాన్..
ఆకలే జెండా..
ఆ ఆకలితో చావులే అజెండా..
ఇటు చూడు..
కడుపు నిండిన దేశాల్లో
రోజూ పారబోస్తున్న
ఆహారం..
ఇక్కడ వదిలేసే బువ్వ
అక్కడ తినే
కూడు కంటే ఎక్కువే..
కష్టమయ్యే బ్రతుకుతెరువు..
తప్పని ఆకలిచావు..!

ఎంతో సాధించామని గొప్పలు పోయే
మన దేశంలోనూ..
అన్నం దొరకని
జనం ఎందరో..
ఈ పథకాలు
నేతలకు పతకాలు..
రోడ్ల మీదే
చిన్నారి బ్రతుకులు..
ఏరుకుంటూ అన్నం మెతుకులు..!

అనుకుంటే సాధించలేనంత
కష్టమైన పనా..
ఇక్కడ జాస్తి..
అక్కడ నాస్తి..
ఇక్కడ బరువు..
అక్కడ కరవు…
అందరూ ఒక మాట అనుకుంటే..
ఉన్నది పంచుకుంటే..
ఉన్నోడు లేనోడికి
చేయూత అందిస్తే..
దేశాల నడుమ
ద్వేషం మాయమై..
సహకారం పెరిగితే..
అదే కదా..
విశ్వమానవ సౌభ్రాత్వత్వం..
సమధర్మం..సమన్యాయం..
సమసమాజం..
వసుధైక కుటుంబం..!

సురేష్ కుమార్ ఎలిశెట్టి
9948546286.