శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారికి వైభవంగా పవిత్ర సమర్పణ

తిరుపతి( భారత్ న్యూస్ ) శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో రెండో రోజైన మంగ‌ళ‌వారం పవిత్రోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి పవిత్ర సమర్పణ చేశారు.

  ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, తోమాల సేవ, కొలువు, పంచాంగశ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లను కల్యాణమండపంలోని యాగశాలకు వేంచేపు చేశారు. ఇందులో భాగంగా పుణ్యాహవచనం, పంచగన్యారాధన, రక్షాబంధనం, అన్నప్రానాయానం నిర్వహించారు.

     ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు.

      అనంతరం మధ్యాహ్నం 12 నుండి 1 గంట వరకు ఆల‌యంలోని మూల‌వ‌ర్ల‌కు, ఉత్స‌వ‌ర్ల‌కు శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ చేశారు.

      సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు స్వామి, అమ్మవార్లు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించనున్నారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు యాగశాల వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

       ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గోపీనాథ్, సూపరింటెండెంట్‌ శ్రీ రమేష్, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.