శ్రీ మూలస్థానం ఎల్లమ్మకు పులివర్తి సుధా రెడ్డి గారు పట్టు వస్త్రాలు సమర్పణ…

స్వాగతం పలికిన ఆలయ అధికారులు, కమిటీ అధ్యక్షులు, సభ్యులు…

చంద్రగిరి ( భారత్ న్యూస్ )

కరుణామయి శ్రీ మూలస్థాన ఎల్లమ్మ నియోజకవర్గంలోని ప్రజలందరినీ చల్లంగా చూడాలని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారి సతీమణి పులివర్తి సుధా రెడ్డి గారు ప్రార్థించారు. అమ్మవారి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆఖరి రోజు శనివారం సాయంత్రం పులివర్తి సుధా రెడ్డి సత్య ప్రమాణాలకు నెలవైన చంద్రగిరి గ్రామ దేవత శ్రీ మూలస్థాన ఎల్లమ్మకు పట్టు వస్త్రాలను,పూజా సామాగ్రిని సమర్పించారు. చంద్రగిరి నడిబొడ్డులోని టవర్ క్లాక్ నుంచి ఊరేగింపుగా కూటమి పార్టీల నాయకులు, మహిళలు, యువతతో కలసి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ఆలయ ఉత్సవ కమిటీ అధ్యక్షులు, సభ్యులు, అర్చకులు సుధా రెడ్డి గారికి మంగళ వాయిద్యాల నడుమ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సుధా రెడ్డి పట్టు పీతాంబరాలను, పూజా ద్రవ్యాలను అర్చకులకు అందజేశారు. ఆలయ మర్యాదలతో ఆమెకు అమ్మ వారి దర్శన భాగ్యం కల్పించి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు ఇచ్చారు. అనంతరం ఆమె వారి ఆలయ ప్రదక్షిణ నిర్వహించి నియోజకవర్గమంతా సుభిక్షంగా ఉండాలని దినదిన ప్రవర్ధమానంగా చంద్రగిరి నియోజకవర్గం అభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించారు. అనంతరం సుధా రెడ్డి మాట్లాడుతూ శ్రీ మూలస్థాన ఎల్లమ్మ ఎంతో మహిమ గల దేవతని ఆమె సన్నిధిలో ఎన్నో శుభాలు కలుగుతాయి అన్నారు. అమ్మవారి దయతో ఎమ్మెల్యే పులివర్తి నాని నియోజకవర్గంలోని ప్రజలందరికీ సేవ చేసే భాగ్యం పొందారని తెలిపారు. అందరి సహాయ సహకారాలతో నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి ఎమ్మెల్యే పులివర్తి నాని గారి కి అమ్మవారు అఖండ శక్తినీ ప్రసాదించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, యువత, మహిళలు, ఆలయ కమిటీ సభ్యులు, సిబ్బంది,అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.