గజ వాహనంపై శ్రీ మలయప్ప కనువిందు

  • వాహన సేవలో ప్రత్యేక ఆకర్షణగా లక్ష్మీ-మహా లక్ష్మి-పద్మజ-పద్మావతి గజాలు తిరుమల( భారత్ న్యూస్ ) శ్రీ‌వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు బుధవారం రాత్రి 7 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు గజవాహనంపై దర్శనమిచ్చారు. మాడ వీధుల్లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన వాహ‌న‌సేవ‌లో వివిధ క‌ళాబృందాల ప్ర‌ద‌ర్శ‌న‌లు భ‌క్తుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు స్వామివారిని వాహ‌న‌సేవ‌లో ద‌ర్శించుకున్నారు.

గజ వాహనం – క‌ర్మ విముక్తి

నిద్ర లేవగానే ఐశ్వర్యానికి ప్రతీక అయిన ఏనుగును దర్శించడం వల్ల భోగభాగ్యాలు అభివృద్ధి అవుతాయి. మంగళకరమైన గజరాజుకు అతిశయమైన మంగళత్వం కలిగించేందుకు శ్రీవారు ఆరో రోజు తన సార్వభౌమత్వాన్ని భక్తులకు తెలిపేందుకు గజవాహనంపై ఊరేగుతాడు. ఏనుగు ఓంకారానికీ, విశ్వానికీ సంకేతం. స్వామి ప్రణవరూపుడు, విశ్వాకారుడూ, విశ్వాధారుడూ కనుక గజరాజుపై ఊరేగడం ఎంతో సముచితం. ఈ ఉత్సవం మనలోని అహంకారం తొలగితే మనపై రక్షకుడుగా భగవంతుడుంటాడనే సంగతి గుర్తు చేస్తుంది.

వాహన సేవలో ప్రత్యేక ఆకర్షణగా శ్రీవారి గజాలు

 శ్రీవారి ఆలయ గజాలు లక్ష్మీ, మహాలక్ష్మి, పద్మజ, పద్మావతి నేతృత్వంలో మలయప్ప వాహన సేవల  వైభవాన్ని పెంచింది.

రంగురంగుల అలంకారాలతో గజవాహనం ముందు శరవేగంగా కదులుతూ భక్తులకు కనువిందు చేశాయి.

వాహ‌న‌సేవ‌లో తిరుమ‌ల‌ శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవోలు శ్రీమతి గౌతమి, శ్రీ వీరబ్రహ్మం, సీవీఎస్వో శ్రీ శ్రీధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.