భారత్ న్యూస్ అమరావతి..అదానీకి ఎదురుదెబ్బ
ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశంలోనే అగ్రస్థాయి వాణిజ్యవేత్తగా ఎదిగిన గౌతమ్ అదానీ విదేశీ విస్తరణ ప్రణాళికకు బ్రేకు పడింది. కెన్యాలో ఆయన దక్కించుకోవాలనుకున్న అంతర్జాతీయ విమానాశ్రయం కాంట్రాక్టు చిక్కుల్లో పడింది. రాజధాని నైరోబీలోని జోమో కెన్యాటా ఎయిర్ పోర్టు నిర్వహణను అదానీ కంపెనీకి 30 ఏండ్ల పాటు లీజుకు ఇచ్చేందుకు అక్కడి ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. తన ప్రియమిత్రునికి ఈ ప్రాజెక్టును ఇప్పించేందుకు ప్రధాని మోదీ తెరవెనుక పావులు కదిపారనే వార్తలు ఇదివరకే గుప్పుమన్నా యి. ఒప్పందంపై సంతకాలు పెట్టే సమయం దగ్గరవుతున్న కొద్దీ ప్రాజె క్టు చుట్టూ వివాదాలు ముసురుకున్నాయి. ఒప్పంద అంశాల రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ కెన్యా మానవ హక్కుల కమిషన్, కెన్యా న్యాయవాద సంఘం కేసులు వేయడంతో తదుపరి నిర్ణయం వరకు అదానీ ప్రతిపాదనపై కోర్టు స్టే విధించింది. సెనేట్ విచారణలోనూ కెన్యా ప్రభు త్వం తీవ్ర విమర్శలకు గురైంది. గత నెల నిరసన ప్రదర్శనలు జరిపిన విమానాశ్రయ సిబ్బంది ఇటీవలే సమ్మెకు దిగి విమానాల రాకపోకలకు అంతరాయం కలిగించడం గమనిస్తే ప్రాజెక్టుపై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. దేశవ్యాప్త నిరసనల మధ్య కెన్యా ప్రభుత్వం అదానీ ప్రాజెక్టు విషయంలో వెనుకకు తగ్గడం ఒక ఎత్తయితే మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పటి నుంచీ అదానీ కంపెనీలను ప్రోత్సహిస్తున్నారని కెన్యా మాజీ ప్రధాని ఓడింగా వెల్లడించడం ఒక ఎత్తు.
ఇప్పటికే పలు సమస్యలతో సతమతమవుతున్న కెన్యా అధ్యక్షుడు విలియం రూటో ప్రభుత్వానికి అదానీ వ్యవహారం గుదిబండగా మారిం ది. ఇటీవలే ఎయిర్‌పోర్టు ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను సామాజిక కార్యకర్త నెల్సన్ అమెన్యా సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో బయటపెట్టినప్పటి నుంచి రాజకీయ దుమారం రేగింది. అనేక ఇతర కంపెనీలు ప్రతిపాదనలు పంపినా కెన్యా ప్రభుత్వం పట్టించుకోలేదని, అదానీ కంపెనీని ఏరి కోరి ఎంపిక చేసిందనే సంగతి తేటతెల్లమైంది. అంతర్జాతీయ టెండర్లు పిలవకుండా, లోపల్లోపల బంగారు బాతులాంటి ఎయి ర్ పోర్టును అదానీ పరం చేయడంపై గగ్గోలు బయల్దేరింది. అదానీ డిమాండ్లకు తలొగ్గాల్సిన అవసరం లేదని, ఎయిర్ పోర్టుకు అవసరమైన పెట్టుబడిని కెన్యా సొంతంగా సేకరించుకోవచ్చని పలువురు ప్రజా ప్రతినిధులు కెన్యా ప్రభుత్వానికి సూచించడం గమనార్హం.
దేశంలోని వాణిజ్యవేత్తలను లేదా కంపెనీలను సమదృష్టితో చూడాలి. కానీ, గత పదేండ్లుగా దేశాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా పాలిస్తున్న ప్రధాని మోదీ తన మిత్రుడు అదానీని కొంచెం ఎక్కువ సమదృష్టితో చూస్తున్నారనేది బహిరంగ రహస్యమే. భారత భూభాగం మీదే కాదు, విదేశాల్లోనూ అదానీకి కాంట్రాక్టులు ఇప్పించేందుకు మోదీ ఉత్సాహం చూపుతుంటారు. అయితే, విదేశీ కాంట్రాక్టులు ఇప్పించడం, మెప్పించడమనేది అంత తేలిక కాదు. గతంలో శ్రీలంకలో విద్యుత్తు ప్రాజెక్టు విషయంలో అదానీ కంపెనీ విమర్శల పాలైంది. ఇప్పుడు కెన్యా విషయంలో జరిగినట్టుగానే అప్పుడూ ప్రధాని మోదీ అదానీ తరఫున ఒత్తిడి తెచ్చినట్టు శ్రీలంక నేతలు ఆరోపించడం తెలిసిందే. అదానీ గ్రూప్‌పై సంచలన ఆరోపణలు చేసిన హిండెన్‌బర్గ్ సంస్థ గ్రూప్‌పై స్విట్జర్లాండ్‌లో మనీలాడరింగ్ కేసులు దాఖలైనట్టు వెల్లడించడం ప్రకంపనలు సృష్టిస్తున్నది. అటు అమెరికాలో ముడుపుల ఆరోపణలు నమోదైనట్టు బ్లూంబెర్గ్ వెల్లడించింది. అయితే, ఈ ఆరోపణలన్నిటిని అదానీ గ్రూపు ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నది. ఈ వివాదాలు ఆయా అంశాలకే పరిమితం కావు. దేశాలతో మైత్రిపై వాటి ప్రభావం ఉంటుందని గుర్తుంచుకోవాలి. కెన్యాలో అదానీ ప్రాజెక్టులపై వ్యక్తమవుతున్న నిరసనలు కాలక్రమంలో భారత వ్యతిరేకతగా పరిణమించే ప్రమాదమున్నదనే హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక వాణిజ్యవేత్తపై పాలకుల మమకారం విదేశాలతో సంబంధాలు దెబ్బతినడానికి కారణం కావడం ఏ మాత్రం వాంఛనీయం కాదు.