మహిళాపక్షపాతి ప్రభుత్వం మాది – ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
*మహిళా సాధికారిత మా లక్ష్యం – కమిషనర్ ఎన్.మౌర్య
తిరుపతి( భారత్ న్యూస్ )మనది మహిళా పక్షపాతి ప్రభుత్వం అని, దీపం 2.0 పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కోరారు. దీపం పథకం 2.0ను బైరాగిపట్టెడలోని మహాత్మాగాంధీ హైస్కూల్ లో లబ్దిదారులకు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అందించారు. సూపర్ సిక్స్ అమలులో భాగంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దీపం 2.0 పథకాన్ని దీపావళి కానుకుగా మహిళలకు అందించిందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు నెరవేరుస్తున్నారని ఆయన తెలిపారు. గతంలోనే చంద్రబాబు నాయుడు దీపం పథకాన్ని ప్రవేశపెట్టడంతో పాటు మహిళల సాధికారత కోసం డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసిన ఘనత ఆయనకు దక్కుతుందని ఆయన అన్నారు. మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల కూడా త్వరలోనే నెరవేరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తిరుపతి నియోజకవర్గంలో 1, 14,900 ఎల్ పీజి కనెక్షన్స్ ఉంటే అందులో 49 వేల మందికి దీపం 2.0 వర్తిస్తుందని ఆయన చెప్పారు. దీని కోసం సంవత్సరానికి 17 కోట్ల చొప్పున ఐదేళ్ళలో 86కోట్లు ప్రభుత్వం వ్యయం చేస్తోందని ఆయన తెలిపారు. నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య మాట్లాడుతూ దీపం 2.0 పథకం మహిళలకు ఎంతో ఉపయోగపడే మంచి పథకమన్నారు. తనకు ఊహ తెలిసిన రోజుల్లో గ్యాస్ సిలిండర్ వ్యయంతో కూడినది కావడంతో.. కట్టెల పొయ్యలే ఎక్కువ మంది వాడేవారని ఆమె గుర్తు చేసుకున్నారు. కట్టెల పొయ్య కారణంగా మహిళలు ఎక్కువ మంది ఊపితిత్తుల వ్యాధితో బాధపడే వారిని ఆమె చెప్పారు. దీపం 2.0 కింద ఏడాదికి మూడు సిలిండర్లను రాష్ట్ర ప్రభుత్వం అందించనుందని ఆమె తెలిపారు. ఉచితంగా ఇస్తున్న గ్యాస్ సిలిండర్లను ఏజెన్సీలు, మహిళలు దుర్వినియోగం చేయకుండా చూడాలని ఆమె కోరారు. గ్యాస్ సిలిండర్ మొత్తాన్ని నేరుగా లబ్దిదారుల ఖాతాలకే ప్రభుత్వం చెల్లిస్తుందని ఆమె చెప్పారు. దీపం 2.0 పథకం బుక్ చేసుకోవడంలో ఇబ్బందులు ఉంటే ప్రతి సోమవారం జరిగే ప్రజాఫిర్యాదుదారుల వేదిక ద్వారా పరిష్కరించుకోవాలని లబ్దిదారులకు ఆమె విజ్జప్తి చేసింది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నగరపాలక సంస్థ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.