భారత్ న్యూస్ విజయవాడ…బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కేంద్రీకృతమైన అల్పపీడనం 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఈ వాయుగుండం ఉత్తరతమిళనాడు, దక్షిణకోస్తా తీరం వైపు కదలుతూ.. రేపటికి తీవ్ర తుపానుగా మారి, చెన్నైకి దక్షిణంగా తీరం దాటవచ్చునని వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ఏపీలో ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా విశాఖపట్నం, కడప, తిరుపతి, చిత్తూరు, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఎడతెరిపి లేని భారీ వర్షాలు పడుతున్నాయి. కుండపోత వర్షానికి పలు చోట్ల రోడ్లు జలమయం అయ్యాయి.
ఇక అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. బయటికొచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా జలదంకి మండలంలో 17.7 సెం.మీ వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలపై నెల్లూరు జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. జిల్లాలో ఇప్పటికే 146 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. అటు బాపట్ల జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్షానికి దుద్దుకూరు దగ్గర యార వాగు ఉధృతి ప్రవహిస్తోంది. దీంతో ఒంగోలు-ఇంకొల్లు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.