అశ్వ వాహనంపై కల్కి అలంకారంలో శ్రీ మలయప్ప
తిరుమల (భారత్ న్యూస్ ) తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన శుక్రవారం రాత్రి అశ్వ వాహనంపై కల్కి అలంకారంలో శ్రీ మలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటలకు వాహనసేవ ప్రారంభమైంది.
వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్లు వేదమంత్రాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.
ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు. పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వవాహనాదిరూఢుడై కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండాలని, నామ సంకీర్తనాదులను ఆశ్రయించి తరించాలని ప్రబోధిస్తున్నాడు.
కాగా, బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన ఆదివారం ఉదయం 6 నుండి 9 గంటల వరకు స్వామిపుష్కరిణిలో స్నపన తిరుమంజనం, చక్రస్నానం నిర్వహిస్తారు. రాత్రి 7 నుండి 9 గంటల వరకు ధ్వజావరోహణం జరుగనుంది.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామలరావు ఆదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జెఈవోలు శ్రీమతి గౌతమి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ శ్రీధర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.