గరుడునిపై గోవిందుడు విహారం..!

-ఆరు గంటల పాటు సాగిన గరుడోత్సవం

-గోవింద నామస్మణలతో తరించిన భక్తజనం

-75 వేల మందికిపైగా దర్శించుకున్నట్లు అంచనా

-పల్లకీపై మోహినీ అవతారంలో విష్ణుమూర్తి అభయం

-తిరుపతి ఇస్కాన్ ఆలయం నుంచి పట్టువస్ర్తాలు సమర్పణ

‘ తిరుపతి (భారత్ న్యూస్ )శ్రీవారికి అత్యంత ప్రీతికరమైన గరుడ వాహనంపై మలయప్ప స్వామి విహరిస్తూ భక్తులను కటాక్షించారు.. గరుడునిపై గోవిందుడు విహరిస్తుండగా భక్తులు గోవింద నామ స్మరణలతో తుమ్మలగుంట గ్రామం పులకించింది.. అడుగడుగునా హారతులు, నైవేద్యం సమర్పిస్తూ స్వామిని దర్శించుకున్నారు భక్తులు.. గరుడవాహన దారుడైన శ్రీవారిని దర్శించేందుకు ఉమ్మడి చిత్తూరు జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.. గరుడోత్సవం ముగిసే సమయానికి సుమారు 75 వేల మందికి పైగా స్వామిని దర్శించుకున్నట్లు అంచనా వేశారు. తుమ్మలగుంట గ్రామానికి వెళ్లే దారులన్నీ జనసంద్రంతో నిండిపోవడంతో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు కఠినంగా అమలు చేశారు.’’
తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలలో అతి ముఖ్యమైన గరుడవాహన సేవ మంగళవారం రాత్రి అశేష భక్తజనుల మద్యన శోభాయమానంగా జరిగింది. ఎంతో ప్రసిద్ధమైన గరుడ వాహన సేవకు వేలాది మంది భక్తులు తరలిరావడంతో తుమ్మలగుంట వీధులన్నీ జనసంద్రమయ్యాయి. భక్తుల సౌకర్యార్థం సాయంత్రం 6 గంటల నుంచే స్వామి వారి గరుడవాహన సేవ ఊరేగింపుగా బయలుదేరినప్పటికీ అర్ధరాత్రి 12 గటల వరకు వాహన సేవ జరిగింది. హారతి కేంద్రాల్లో భక్తులు హరతి ఇచ్చేందుకు బారులు తీరడంతో అందరికీ సంతృప్తికరమైన దర్శనం కలిగించేలా ఏర్పాట్లు చేశారు. గరుడ వాహన సేవలో తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కాగా మంగళవారం ఉధయం విష్ణుమూర్తి మోహినీఅవతారంలో పల్లకీపై ఊరేగుతూ భక్తులకు అభయ హస్తంతో ఆశీస్సులు అందించారు.

గరుడ వాహనానికి గొడుగులు, వస్త్రం సమర్పణ

తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట గ్రామానికి చెందిన చెంచురెడ్డి గరుడవాహన సేవకు సంబంధించిన కొత్త గొడుగులు, శేష వస్త్రాన్ని స్వామి వారికి సమర్పించారు. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు చెవిరెడ్డి ఆయన ఇంటికి వెళ్లి నూతన గొడుగులు, వస్త్రాలకు ప్రత్యేక పూజలు చేసిన తర్వాత మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ సాదరంగా ఆలయం వద్దకు ఆహ్వానించి తీసుకువచ్చారు. అంతకు ముందు పేరూరు గ్రామంలోని శ్రీక్రిష్ణ మందిరం నుంచి స్వామి వారికి గజ మాలను తీసుకువచ్చి సమర్పించారు.

వందలాది మంది భక్తులతో స్వామి వారి సారె సమర్పణ

ప్రతి ఏటా తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహన సేవకు తిరుపతి ఇస్కాన్ ఆలయం నుంచి పట్టు వస్త్రాలు తీసుకుని రావడం ఆనవాయితీ. ఈమేరకు మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు ఇస్కాన్ ఆలయం అధ్యక్షులు రేవతి రమణ దాస్ ప్రభు పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే తిరుపతి రూరల్ మండలం మల్లంగుంట, సి.గొల్లపల్లి, దుర్గసముద్రం గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున సారె తీసుకువచ్చి స్వామి వారికి సమర్పించారు. అనంతరం స్వామి వారి పల్లకీ ఉత్సవంలో పాల్గొన్నారు. అలాగే సాయంత్రం గరుడవాహన సేవకు తిరుపతి రూరల్ మండలం పెరుమాళ్లపల్లి, రామచంద్రాపురం మండలం కుప్పం బాదూరు, నెత్తకుప్పం డివిజన్ల పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా సారెను తీసుకువచ్చి స్వామి వారికి సమర్పించారు. అనంతరం గరుడవాహన సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. సారె తీసుకువచ్చిన భక్తులు అందరినీ ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు చెవిరెడ్డితో పాటు ఆయన కుమారుడు తుడా మాజీ ఛైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డిలు ఆత్మీయ స్వాగతం పలికారు.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

బ్రహ్మోత్సవాలలో అత్యంత విశిష్టమైన గరుడవాహన సేవలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో అలరించాయి. కోలాటాలు, చెక్క భజనలు, కీలు గుర్రాలు, పిళ్లనగ్రోవులు, కేరళ వాయిద్యాలతో పాటు భరతనాట్యం, కూచిపూడి నృత్యాలు, దేవతా మూర్తుల కళారూపాలతో భక్తులను ఆకట్టుకున్నారు. స్వామి వారి గరుడ వాహన సేవకు ముందు కళాకారులు చేస్తున్న ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.