భారత్ న్యూస్ విజయవాడ…Ratan Tata: ఎయిరిండియాకు ఊపిరులూదిన ఫైటర్ పైలట్
తాను చదివిన ఆర్కిటెక్చర్‌కు.. కలలుగన్న విమానయాన రంగానికి సంబంధం లేదు. అయినా అప్పటికి తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన ఎయిరిండియాను తమ గూటి కిందకు తెచ్చుకుని.. దానికి కొత్త జవసత్వాలు అందించారు రతన్ టాటా.
నష్టాల్లో ఉన్న సంస్థకు జవసత్వాలు అందించిన రతన్
విమానాలతో పాటు యుద్ధ విమానాలనూ ఎగరేసిన ఫైటర్ పైలట్ ఆయన. ఎయిరిండియాకు పునర్వైభవం తేవాలన్న ఆయన కల.. 2022 జనవరి వరకు కలగానే మిగిలిపోయింది. అంతకుముందు విదేశీ సంస్థల భాగస్వామ్యంలో ఎయిర్ ఏషియా ఇండియా, విస్తారాలను నెలకొల్పారు. ఎయిర్ ఏషియా ఇండియా పేరు ఏఐఎక్స్ కనెక్ట్‌గా మారి, ఈ సంవత్సరం అక్టోబరు 1న ఎయిరిండియాలో విలీనమైంది. ‘ఎయిరిండియా ప్రయాణికులకు టాటా గ్రూప్ స్వాగతం పలుకుతోంది. ప్రయాణికులకు మెరుగైన సేవలు, సౌకర్యాలు అందించడంలో, ఎయిరిండియాను అగ్రస్థానంలో నిలిపేందుకు అందరితో కలిసి పనిచేస్తాం’’ అని 2022 జనవరి 27న విలీనం పూర్తయ్యాక రతన్‌టాటా ప్రకటించారు.
కలలు కని.. నిజం చేసుకుని..
1932లో జేఆర్‌డీ టాటా నెలకొల్పిన టాటా ఎయిర్‌లైన్స్‌ను ఆ తర్వాత జాతీయీకరణ చేసి, ఎయిరిండియాగా పేరు మార్చారు. 1994లో టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో కలిసి మన దేశంలో సంయుక్తంగా విమానయాన సంస్థను నెలకొల్పే ప్రయత్నాలు చేశారు. ఆరేళ్ల తర్వాత ఎయిరిండియాలో వాటా కొనుగోలుకు ప్రయత్నించారు. ఆ రెండు ప్రయత్నాలూ విఫలమయ్యాయి. 2015లో విస్తారాను స్థాపించగలిగారు. రతన్ మనసుకు విమానయాన రంగం చాలా దగ్గరగా ఉంటుందని విస్తారా సీఈఓ వినోద్ కన్నన్ చెబుతారు. భారీ నష్టాల్లో కూరుకుపోయిన ఎయిరిండియాకు మళ్లీ ఊపిరులూదడంలో రతన్‌టాటాకు ఉన్న ఆసక్తి అందరికీ తెలుసని, ఆ కుటుంబం ఎన్నటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుందని ఎయిర్‌బస్ ఇండియా, దక్షిణాసియా విభాగం ప్రెసిడెంట్, ఎండీ రెమీ మిలార్డ్ అంటున్నారు. అంతర్జాతీయ విమానయాన రంగంలో భారత దేశానికి తగిన స్థానం సంపాదించేందుకు ఎయిరిండియా వెంట నడుస్తామని ఇండిగో బ్రాండ్‌పై విమాన సేవలందిస్తున్న ఇంటర్‌గ్లోబ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్ ఎండీ రాహుల్ భాటియా చెప్పారు.
రతన్ టాటా 69 ఏళ్ల వయసులో ఫైటర్ జెట్‌ను నడిపి సంచలనం సృష్టించారు. జెట్ విమానాలు, హెలికాప్టర్లు నడిపేందుకు లైసెన్స్ కూడా ఆయనకు ఉంది.
2007లో బెంగళూరులో ఏరో ఇండియా షోలో పాల్గొన్న లాక్‌హీడ్ మార్టిన్.. తమ ఫైటర్ విమానం నడిపేందుకు రతన్‌టాటాను ఆహ్వానించింది. ఆయన కో-పైలట్‌గా వ్యహరించి, కొన్ని విన్యాసాలు కూడా చేశారు. ఆ మర్నాడే ఆయన ఎఫ్-18 సూపర్ హార్నెట్ విమానాన్ని నడిపారు.
🇮🇳సత్యమేవ జయతే🇮🇳