.భారత్ న్యూస్ అమరావతి..చంద్రబాబు, జగన్ నోట జమిలి మాట
2027లో రాష్ట్రంలో ఎన్నికలు వస్తాయా?
జమిలికి మద్దతివ్వాలని కోరిన చంద్రబాబు!
బాబు మాటల వెనుక ఆంతర్యం ఏమిటి?
జమిలి వస్తే అధికారం వైసీపీదే అంటున్న జగన్…
ఇలా ఉంది ఏపీలో జమిలి ఎన్నికల సందడి… ఈ ఆలోచన ఏపీ రాజకీయాలను హుషారెత్తిస్తోంది. సాధారణంగా సార్వత్రిక ఎన్నికలు ముగిసిన కొంతకాలం పాటు రాజకీయాల్లో స్తబ్ధత వాతావరణం ఉంటుంది. ఎన్నికల్లో గెలిచి అధికారం దక్కించుకున్న పార్టీపై విమర్శలకు ప్రతిపక్షాలు కూడా దూరంగా ఉంటాయి. హామీలు అమలు చేసేందుకు ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలన్న ధోరణితో ప్రతిపక్షం వ్యవహరిస్తుంది.
ఈ సారి మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. చంద్రబాబునాయుడు అధ్యక్షతన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల గడవక ముందే ప్రధాన రాజకీయపార్టీల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటుంది. పరస్పర విమర్శలు ప్రతి విమర్శలు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రత్యేకించి కూటమి లో ప్రధాన పార్టీగా ఉన్న తెలుగుదేశానికీ, ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ ఆర్ సీపీకి మధ్య సాధారణ ఎన్నికల ముందు నాటి పోటాపోటీ పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి ప్రధాన కారణం జమిలి ఎన్నికలేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ చెబుతున్న ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’కు చంద్రబాబునాయుడు బేషరతు మద్దతు ప్రకటించారు. దీనికి అందరూ సహకరించాలనీ, మద్దతు పలకాలని బహిరంగంగానే చంద్రబాబు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఏపీలో సాధారణ ఎన్నికలు నిర్వహించగా మళ్లీ 2019లోనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. జమిలి ఎన్నికల నిర్వహణ ఖాయమైతే 2027లో అంటే రెండేళ్ల ముందుగానే ఎన్నికలు రావచ్చని కేంద్రం నుంచి ఏపీలో రాజకీయ పార్టీలకు సంకేతాలందాయి.
జై జమిలి అంటున్న బాబు పార్టీ
చంద్రబాబునాయుడు కూడా జమిలి ఎన్నికలను దృష్టిలోనే ఉంచుకునే ఒక వైపు పాలనలోనూ, మరో వైపు ప్రధాన ప్రతిపక్ష నేతలపై రెడ్ బుక్ ను అమలు చేసే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో చంద్రబాబు నర్మగర్భ వ్యాఖ్యాలే అందుకు నిదర్శనమని భావిస్తున్నారు. ”తప్పు చేసే వారిని వదిలిపెట్టం.. అలా అని వాళ్ళు కక్ష గట్టి వేధించారనీ, మనం కూడా అదే పనిచేస్తే ప్రజలు గమనిస్తారు, ఆ విషయాన్ని అందరూ అర్ధం చేసుకోవాలని” చంద్రబాబు హితవు పలికారు. జగన్ ఘోరంగా ఓడిపోవటానికి గల అనేక కారణాల్లో ఆయన ప్రభుత్వం అనుసరించిన కక్ష సాధింపు చర్యలు కూడా ప్రధానమైనవని అందరూ నమ్ముతున్నారు. ప్రత్యేకించి చంద్రబాబునాయుడు ను అరెస్ట్ చేసి జైలుకు పంపించటంతో ప్రజల్లో విపరీతమైన సానుభూతి వచ్చిందనీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి బీజం పడిందనీ, అదే జగన్ ఓటమికి నాందిగా పలికిందని భావించే వారు ఉన్నారు.
జమిలి ఎన్నికలు మరో మూడేళ్లలో అంటే 2027లోనే వచ్చే విషయం కొట్టి పారేయలేని అంశంగా మారింది. 2017 నాటికి నాలుగున్నర ఏళ్ల నుంచి 5 ఏళ్ళు పూర్తి చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వాలు అధికంగా ఉండే అవకాశం ఉన్నందున జమిలి ఎన్నికలకు 2027 సరైన ముహూర్తమని మోడీ నాయకత్వలోని ఎన్డీఏ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో మరో మూడేళ్ల పాటు ఆచితూచి వ్యవహరించాలని చంద్రబాబు వ్యూహం. అందువల్లనే కక్ష సాధింపు రాజకీయాలపై ఆయన ఎమ్మెల్యేల సమావేశంలో బహిరంగంగా వ్యాఖ్యానించినట్టు ఆ పార్టీ నాయకులే అంటున్నారు.
వైసీపీలోనూ జోష్
జమిలి ఎన్నికలు వైసీపీలోనూ జోష్ నింపుతున్నాయి. ‘జమిలి అంటున్నారు.. 2027లోనే ఎన్నికలు అంటున్నారు. మళ్ళీ అధికారంలోకి వచ్చేది వైసీపీ’నే అంటూ జగన్ ఇటీవల పార్టీ సమావేశంలో వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వంపై అయిదు నెలలు గడవకముందే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చలేదు. ఇసుక, మద్యం విధానాల అమలులో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. గ్రామస్థాయి నుంచి పార్టీని పునర్నిర్మాణం చేయాలని వైసీపీ శ్రేణులకు ఇటీవల జగన్ దిశా నిర్దేశం చేశారు. పనిలో పనిగా పార్టీ నుంచి వెళ్ళే వాళ్ళు వెళుతుంటే చేరికలపైనా దృష్టి కేంద్రీకరించారు.
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ముదునూరి మురళీకృష్ణంరాజు జగన్ సమక్షంలో వైసీపీలో చేరటం ఇటీవల అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాదు.. వైసీపీ సీనియర్ల బాధ్యతల్లోనూ మార్పులు చేశారు. విజయసాయిరెడ్డికి ఉత్తరాంధ్ర జిల్లాల కో ఆర్డినేటర్ గా బాధ్యతలు అప్పగించారు. వైవీ సుబ్బారెడ్డికి ఉమ్మడి చిత్తూరు, గుంటూరు జిల్లాల బాధ్యతలు అప్పగించారు. జమిలి ఎన్నికలపై వచ్చిన సంకేతాల వల్లనే జగన్ పార్టీ పై అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్టు రాజకీయవర్గాల సమాచారం.
సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమంటున్న విపక్షాలు
జమిలి ఎన్నికలు రాజ్యాంగం నిర్దేశించిన ఫెడరల్ .. అంటే సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని కాంగ్రెస్ తో సహా అన్ని ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తున్నాయి. వందకోట్లకు పైబడి ఉన్న దేశంలో, అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న దేశంలో వన్ నేషన్ – వన్ ఎలక్షన్ కాన్సెప్ట్ వెనుక కుట్ర దాగి ఉందనీ, ప్రజలను స్వేచ్ఛగా తమకు కావాల్సిన ప్రభుత్వాలను ఎన్నుకునే వెసులుబాటు లేకుండా మసిపూసి మారేడుకాయ చేసేందుకు ఎన్డీఏ కూటమి ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ అంటోంది. అంతేకాదు, దేశాన్ని కాషాయీకరణ చేసేందుకే బీజేపీ జమిలి కుట్ర పన్నుతోందని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఇటీవల సీపీఎం నేత రాఘవులు కూడా ఒక సమావేశంలో జమిలి ఎన్నికల వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యాన్ని తనదైన శైలిలో విప్పి చెప్పారు.
జమిలి ఎన్నికల గురించి అధికార, ప్రతిపక్షాల వాదనలు ఎలా ఉన్నా…. ఏపిలో మాత్రం టీడీపీ, వైసీపీలు జమిలికి జై అంటున్నట్లు కనిపిస్తున్నాయి. దాంతో, రాష్ట్రంలో అధికార ముఖచిత్రం మారిపోతుందనే ఆశలు ప్రతిపక్షం నుంచి వినిపిస్తున్నాయి. అధికార పక్షం అందుకే ఆచితూచి వ్యవహరిస్తోందనే విశ్లేషణలు ముందుకు వస్తున్నాయి.