మహిళల దైనందిన జీవితాలలో వెలుగులు నింపటానికే దీపం-2 పథకం – ఎమ్మెల్యే పులివర్తి నాని

పాకాల( భారత్ న్యూస్ .) మహిళల దైనందిన జీవితాలలో వెలుగులు నింపటానికి దీపం…2 పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. పాకాల మండలం, దామలచెరువు పంచాయితీలో తిరుపతి జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తో కలిసి శుక్రవారం ఎమ్మెల్యే నాని దీపం -2 మొదటి ఉచిత సిలిండర్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే పులివర్తి నాని గారికి జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ గారికి నాయకులు, మహిళలు, యువత అపూర్వ స్వాగతం పలికారు. మంగళ వాయిద్యాల నడుమ పూర్ణకుంభంతో అడుగడుగున హారతులు పడుతూ సభా వేదికకు అతిధులను ఆహ్వానించారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభా వేదిక వద్ద ప్రజల నుండి ఎమ్మెల్యే నాని వినతులు స్వీకరించారు. అనంతరం సభను ఉద్దేశించి ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఉమ్మడి మేనిఫెస్టో “సూపర్ సిక్స్” పథకంలో పొందుపరిచిన విధంగా మహిళలకు మూడు ఎల్పిజి సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేయడానికి పెద్దాయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం శ్రీకాకుళంలో శ్రీకారం చుట్టారని తెలిపారు. అందులో భాగంగా చంద్రగిరి నియోజకవర్గంలో కూడా సిలిండర్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గంలో సుమారు 66 వేల మంది లబ్ధిదారులకు దీపం పధకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస‌్తున‌్నట‌్టు వివరించారు. ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం ఒక్కొక్కటిగా ప్రజలకు అందిస్తున్నట్లు తెలియజేశారు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అప్పుల కుంపటిని మిగిల్చిన ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తుందని చెప్పారు. ఎవరికి ఏ సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. తిరుపతి జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ మాట్లాడుతూ ఉచిత గ్యాస్ సిలిండర్ పొందటానికి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా గ్యాస్ ఏజెన్సీ ద్వారా ఇకేవైసి చేసుకోవాలన‌్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలలో విడతల వారీగా అమలు చేయడానికి పూనుకున్నదని గుర్తు చేశారు. ఎమ్మెల్యే పులివర్తి నాని నిత్యం అధికారులతో సంప్రదింపులు జరుపుతూ అభివృద్ధి సంక్షేమ పథకాలను పరుగులు పెట్టిస్తున్నారని తెలిపారు. పాకాల మండలంలో సుమారు 16 వేల 126 మంది లబ్ధిదారులకు దీపం పధకం ద్వారా ఉచిత గ్యాస్ పంపిణీ చేయడం జరిగుతున‌్నదని వివరించారు. సంవత్సరంలో మూడు విడతల్లో లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. శ్రీకాకుళంలోని ఇచ్చాపురం నుండి కుప్పం వరకు రాష్ట్ర ప్రజలకు దీపావళి పండుగ నాడు దీపం పధకం ద్వారా ఉచిత గ్యాస్ పంపిణీ చేస‌్తున‌్నట‌్టు పేర‌్కొన‌్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పైన లబ్ధిదారుల నుండి ఎటువంటి ఫిర్యాదు వచ్చినా కఠినమైన చర్యలు తీసుకుంటామని జిల్లా జాయింట్ కలెక్టరు తెలిపారు. కొంతమంది మహిళలకు ఉచిత సిలిండర్ లను ఎమ్మెల్యేతో కలిసి జాయింట్ కలెక్టర్ పంపిణీ చేశారు. అనంతరం గ్యాస్ సరఫరా వాహనాలను జండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, యువత, మహిళలు, ఉచిత సిలిండర్ల లబ్ధిదారులు పాల్గొన్నారు.