రూ.6073 కోట్ల విద్యుత్ చార్జీలను ఉపసంహరించాలి: సిఐటియు తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి : కందారపు మురళి

తిరుపతి (భారత్ న్యూస్ )
రూ.6073 కోట్ల విద్యుత్ చార్జీలను ఉపసంహరించాలి: సిఐటియు

టిడిపి కూటమి ప్రభుత్వం తన ఎన్నికల వాగ్దానానికి భిన్నంగా విద్యుత్ చార్జీలను 44 శాతం పెంచటాన్ని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి తీవ్రంగా ఖండించారు.

శనివారం నాడు ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ తాము విద్యుత్ చార్జీలను పెంచబోమని ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వం భారాలు మోపడం దారుణమని విమర్శించారు.

పెంచిన చార్జీలను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.

వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉండగా అంతకు ముందు ఉన్న టిడిపి ప్రభుత్వం తప్పిదాల కారణంగా సర్దుబాటు పేరిట విద్యుత్ చార్జీలను పెంచాల్సి వచ్చిందని చెప్పిందని, ఇప్పటి టిడిపి ప్రభుత్వం కూడా తాను పెంచిన చార్జీలకు గత వైసిపి ప్రభుత్వం కారణమని చెబుతున్నదని ఈ రెండు ప్రభుత్వాలు ప్రైవేటు ఉత్పత్తిదారుల నుండి అధిక ధరలకు విద్యుత్తును కొని ఈ భారాన్ని ప్రజలపై మోపుతున్నాయని ఆరోపించారు.

ప్రైవేటు పెట్టుబడులకు దాసోహమై పీక్ లోడ్ పేరుతో యూనిట్ సుమారు రూ.8 లు పెట్టి కొంటున్నారని విమర్శించారు.

ప్రపంచ బ్యాంకు సిఫార్సులకు అనుగుణంగా విద్యుత్ ప్రైవేటీకరణను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని గుర్తు చేశారు.

2022-2023 ఆర్థిక సంవత్సరంలో అధిక ధరలకు ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి కంపెనీల నుండి కొన్నందుకు గాను సర్దుబాటు చార్జీల పేరుతో 2024 నవంబర్ నుండి 2026 జనవరి వరకు యూనిట్ కు 83 పైసల చొప్పున 15 నెలల పాటు వినియోగదారులు అదనంగా చెల్లించాల్సి వస్తున్నదని ఆరోపించారు.

ఉద్యోగులు, కార్మికులు, పేదలు ఈ అదనపు భారాన్ని మోయలేరని ప్రత్యేకించి అసంఘటిత కార్మికులు, చిరుద్యోగులపై ఈ భారం అత్యధికంగా ఉంటుందని ఆయన అన్నారు.

గత వైసిపి ప్రభుత్వం 8 సార్లు విద్యుత్ చార్జీలను పెంచి ఎన్నికల్లో ఓడిపోయిందని, టిడిపి కూటమి ప్రభుత్వం దీని నుండి గుణపాఠం తీసుకొని వెంటనే పెంచిన చార్జీలను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.

సర్దుబాటు చార్జీలకు వ్యతిరేకంగా ప్రజలు తిరగబడకపోతే 2024-25 ఆర్ధిక సంవత్సరపు సర్దుబాటు చార్జీలను 2026-2027 లో అదనంగా మోయాల్సి వస్తుందని కందారపు మురళి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

(కందారపు మురళి) జిల్లా ప్రధాన కార్యదర్శి