.భారత్ న్యూస్ అమరావతి.:

నిఘా పరికరాల కొనుగోళ్ల కేసుల నుంచి విముక్తి

రెండు కేసులు మూసివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

మరో కేసు ఫైల్‌ సీఎం చంద్రబాబు టేబుల్‌పై!

అమరావతి,
రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట లభించింది. చెయ్యని తప్పునకు ఐదేళ్లపాటు వైసీపీ ప్రభుత్వంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఆయన ఎట్టకేలకు వాటినుంచి బయటపడ్డారు. ఏబీవీపై ఉన్న కేసుల్లో రెండింటిని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈమేరకు మంగళవారం ఉత్వర్వులు జారీ చేసింది. మరో కేసుపై సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. నిఘా పరికరాల కొనుగోళ్లలో అవినీతి జరిగిందంటూ జగన్‌ ప్రభుత్వం ఐదేళ్లపాటు ఏబీవీని వేధించింది. అసలు కొనుగోలు చేయని పరికరాల్లో అవినీతి ఎక్కడుందని అన్నందుకు హద్దులు మీరారని, సాక్షులను బెదిరిస్తున్నారని ఆయనపై కేసుల మీద కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేసింది. ఏబీవీని సర్వీస్‌ నుంచి డిస్మిస్‌ చేయాలంటూ కేంద్రానికి ప్రతిపాదించింది. 2019 నుంచి ఐదేళ్లపాటు సస్పెన్షన్లు, కేసులు, క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొంటూనే న్యాయపోరాటం చేసిన వెంకటేశ్వర రావు సరిగ్గా పదవీ విరమణకు ఒక్కరోజు ముందు పోస్టింగ్‌ దక్కించుకున్నారు. క్యాట్‌ ఆదేశాల మేరకు ఈ ఏడాది మే 30న ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ డీజీగా బాధ్యతలు స్వీకరించి ఆ మరుసటి రోజు 31న రిటైరయ్యారు. గత వైసీపీ ప్రభుత్వం తనను వేధించిన తీరు, చేయని తప్పులకు విధించిన సస్పెన్షన్లు, తప్పుడు కేసుల నుంచి విముక్తి కోసం ప్రభుత్వానికి ఏబీవీ విన్నవించుకున్నారు

కక్షపూరితంగా అభియోగం

ఏబీ వెంకటేశ్వరరావు గత టీడీపీ ప్రభుత్వంలో నిఘా విభాగం అధిపతిగా పనిచేశారు. అప్పట్లో ఇజ్రాయెల్‌ నుంచి నిఘా పరికరాల కొనుగోళ్లకు ఆకాశ్‌ అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్‌ అనే సంస్థకు 2018 అక్టోబరు 31న రూ.35లక్షలు చెల్లించినట్లు వైసీపీ ప్రభుత్వం అభియోగాలు మోపింది. ఏసీబీ విచారణకు ఆదేశించింది. రూపాయి ఖర్చు చేయలేదని చెబుతున్నా.. అవినీతి జరిగిందంటూ 2020 మార్చి 7న ఏబీవీని సస్పెండ్‌ చేసింది. దీంతో న్యాయపోరాటానికి దిగిన ఏబీవీ… క్యాట్‌ ఆదేశాలతో రెండేళ్ల తర్వాత 2022లో పోస్టింగ్‌ దక్కించుకున్నారు. ఆ సమయంలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ తనపై కుట్రపూరితంగా కొందరు వ్యక్తులు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అవకాశంగా ప్రభుత్వ చర్యలపై బహిరంగంగా మాట్లాడినందుకు ఆలిండియా సర్వీ్‌స రూల్స్‌ ప్రకారం జగన్‌ ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలకు సిద్ధపడింది. అప్పట్లో కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ ఆర్‌పీ సిసోడియా ముందు హాజరైన ఏబీవీ… తనను కుట్రపూరితంగా ఇరికించేందుకు ఎవరెవరు ఫోర్జరీ పత్రాలు సృష్టించారో వివరించారు. ఆలిండియా సర్వీస్‌ నిబంధనలు అతిక్రమించలేదని స్పష్టం చేశారు. అయినా సంతృప్తి చెందని జగన్‌ సర్కారు, సాక్షులను బెదిరిస్తున్నారంటూ మరోమారు ఏబీవీని సస్పెండ్‌ చేసింది. కాగా, మీడియాతో మాట్లాడారని ఏబీవీకి గత వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన రెండు చార్జి మెమోలను ప్రస్తుత ప్రభుత్వం ఉపసంహరించుకుంది. సర్వీసు నిబంధనల ప్రకారం గత ప్రభుత్వం విచారణ అధికారిని నియమించకుండా కాలయాపన చేసింది. వాటిని జారీచేసి ఏడాది పూర్తికావడంతో ఆ ఉత్వర్వులు నిరర్థకంగా మారాయి. ఈ నేపథ్యంలో చార్జిమెమోలను ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.