మార్చి లోపు తుడా టవర్స్ నిర్మాణాలు పూర్తి చేస్తాం.

*తుడా ఉపాధ్యక్షులు ఎన్.మౌర్య

తిరుపతి (భారత్ న్యూస్) వచ్చే ఏడాది 2025 మార్చి లోపు తుడా టవర్స్ నిర్మాణాలు పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా)ఉపాధ్యక్షులు ఎన్.మౌర్య తెలిపారు. నగరంలోని రాయలచెరువు రోడ్డులో తుడా ఆధ్వర్యంలో నిర్మిస్తున్న తుడా టవర్స్ నిర్మాణ పనులను ఉపాధ్యక్షులు ఎన్.మౌర్య శనివారం ఇంజినీరింగ్ అధికారులతో కలసి పరిశీలించారు. అనంతరం తుడా కార్యాలయంలో అధికారులతో సమావేశమై సమీక్షించారు.

ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు ఎన్.మౌర్య మాట్లాడుతూ తుడా టవర్స్ ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా 3.6 ఎకరాల స్థలంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నామని అన్నారు. ఇందులో గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు 13 అంతస్థులతో తుడా టవర్స్ నిర్మిస్తున్నామని అన్నారు. గ్రౌండ్, ఒకటవ అంతస్థుల్లో 27 దుకాణాలతో వాణిజ్య సముదాయాలు, రెండు, మూడు, నాలుగు అంతస్థులలో ఆఫీస్ ల వినియోగానికి, మిగిలిన అంతస్థుల్లో నివాస యోగ్యంగా ఫ్లాట్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. నివసించేందుకు 230 ప్లాట్లు ఉంటాయని, అందులో 42 డబుల్ బెడ్ రూమ్స్, 152 ట్రిబుల్ బెడ్ రూమ్స్, నాలుగు బెడ్ రూమ్స్ ఫ్లాట్స్ 32 ఉంటాయని అన్నారు. విశాలమైన పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. వాణిజ్య సముదాయాలు, ఫ్లాట్స్ కు వేర్వేరుగా లిఫ్ట్ లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. 2025 మార్చి లోపు అన్ని పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని అన్నారు. విస్తృతంగా ప్రచారం చేసేందుకు నూతనంగా బ్రోచర్ కూడా తయారు చేయించామని ఇందులో అన్ని వివరాలు పొందుపరిచామని అన్నారు.

ఈ పరిశీలన , సమావేశంలో కార్యదర్శి వెంకటనారాయణ, సూపరింటెండెంట్ ఇంజినీర్ కృష్ణారెడ్డి, సలహాదారులు రామకృష్ణ రావు, ఈఈ రవీంద్రయ్య, కె.పి.సి సంస్థ ఈ.డి.సుశీల్ కుమార్, తదితరులు ఉన్నారు.