భారత్ న్యూస్ విజయవాడ…హైదరాబాద్-విజయవాడ 65వ నెంబర్ జాతీయ రహదారి రెండు తెలుగు రాష్ట్రాలు (తెలంగాణ-ఏపీ) మధ్య వారధిగా ఉన్న విషయం తెలిసిందే.
దేశంలో అత్యంత ఎక్కువ రద్దీగా ఉండే నేషనల్ హైవేల్లో ఇదీ ఒకటి.
ఈ రహదారిపై ప్రతి రోజూ వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి.
ఏపీ-తెలంగాణలకు చెందిన ప్రజలు ఈ రహదారిపై ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారు.
ప్రస్తుతం నాలుగు వరుసలుగా ఉన్న నేషనల్ హైవేపై నిత్యం రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ రహదారిపై వేల మంది ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు వికలాంగులుగా మారారు. ఈ నేపథ్యంలో హైవే విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదన పెట్టగా.. కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది.
ఇక విస్తరణ కంటే ముందు హైవేలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్న 17 బ్లాక్ స్పాట్స్‌ను అధికారులు ఇప్పటికే గుర్తించారు. రూ.325 కోట్లతో ఆయా ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రత్యేకంగా అండర్‌పాస్‌లు, బ్రిడ్జిలు, సర్వీసు రోడ్లు నిర్మించేందుకు గాను పనులను చేపట్టారు. ఎన్‌హెచ్‌ఏఐ (NHAI) ఆధ్వర్యంలో గుర్తించిన బ్లాక్ స్పాట్‌ల వద్ద అవసరమైన ఫ్లైఓవర్‌లు, ఇతర అభివృద్ధి పనులు ప్రారంభమైనట్లు తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు.
ఈ పనులను త్వరితగతిన పూర్తిచేసేందుకు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని చెప్పారు. ఈ పనులు పూర్తయ్యాక హైదరాబాద్-విజయవాడ నగరాల మధ్య ఉన్న రహదారిని ఆరు వరుసలుగా విస్తరించేందుకు యోచిస్తున్నామన్నారు. ఆయా అభివృద్ధి పనులు వచ్చే నెల (డిసెంబర్) లో ప్రారంభమవుతాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఈ రహదారి విస్తరణ పూర్తయితే ఎటువంటి ఆటంకాలు లేకుండా చాలా వేగంగా రెండు నగరాల మధ్య రాకపోకలు సాగించవచ్చునని చెప్పారు.
మరో 40 కి.మీ పెంపు, అక్కడి వరకు రహదారి కాగా, ఈ రహదారి పొడవు మరింత పెరగనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న రోడ్డుకు అదనంగా మరో 40.మీ విస్తరించనున్నట్లు తెలిసింది. తొలుత ఈ రహదారిని హైదరాబాద్ శివారు దండు మల్కాపూర్ నుంచి ఏపీలోని జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి వరకు విస్తరించాలనుకునారు. తాజాగా.. ఏపీలోని గొల్లపూడి వరకు విస్తరించేందుకు కేంద్రం సిద్ధమైనట్లు సమాచారం. ఈ విస్తరణ పనులు చేపట్టేందుకు వీలుగా 181.5 కి.మీ డీపీఆర్ సిద్ధం చేయాలని కేంద్రం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.