టీటీడీ రవాణా, ముద్రణాలయంలో ఘనంగా ఆయుధపూజ
తిరుపతి( భారత్ న్యూస్) తిరుపతిలోని టీటీడీ రవాణా విభాగం, ముద్రణాలయాల్లో శనివారం ఆయుధపూజ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు, జేఈవో(విద్య&ఆరోగ్యం) శ్రీమతి గౌతమి, సీవీఎస్వో శ్రీ శ్రీధర్ లు పాల్గొని శ్రీవేంకటేశ్వర స్వామి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ముందుగా టీటీడీ రవాణా విభాగంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్న అధికారులకు ట్రాన్స్పోర్ట్ జీఎం శ్రీ శేషారెడ్డి ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ టీటీడీ రవాణా విభాగంలోని వాహనాలు, ఇతర యంత్రాలకు ప్రతి సంవత్సరం ఆయుధపూజను వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ సందర్భంగా భక్తులకు రవాణా విభాగం చేస్తున్న సేవలను అభినందించారు.
అనంతరం టీటీడీ ముద్రణాలయ భవనాన్ని సందర్శించి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి నమూనా విగ్రహాలకు పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా టీటీడీ ముద్రణాలయ ప్రత్యేక అధికారి శ్రీ రామరాజు ఈవో, ఇతర అధికారులను సత్కరించి ఆఫ్ సెట్, ప్రింటింగ్, బైండింగ్ తదితర యంత్రాల పనితీరును అధికారులకు వివరించారు.
ఆయుధపూజ కోసం రవాణా విభాగంలోని వాహనాలను, ముద్రణాలయంలోని యంత్రాలను పూల మాలలు, రంగవల్లికలు, మామిడి తోరణాలతో ప్రత్యేకంగా అలంకరించారు.
ఈ కార్యక్రమాల్లో టీటీడీ డీఎల్ఓ శ్రీ వరప్రసాదరావు, డిప్యూటీ ఈవోలు శ్రీ గోవింద రాజన్, శ్రీ దేవేంద్ర బాబు, శ్రీ గుణ భూషణ్ రెడ్డి, శ్రీ శివ ప్రసాద్, చీఫ్ పీఆర్వో డాక్టర్ టి.రవి, రవాణా, ముద్రణాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.